ఉదయమే ‘కసరత్తు’... రాత్రి వరకు విధ్వంస తర్ఫీదు | special plan in training of Popular Front of India | Sakshi
Sakshi News home page

ఉదయమే ‘కసరత్తు’... రాత్రి వరకు విధ్వంస తర్ఫీదు

Published Sat, Oct 19 2024 5:00 AM | Last Updated on Sat, Oct 19 2024 5:00 AM

special plan in training of Popular Front of India

పీఎఫ్‌ఐలో ప్రత్యేక టైమ్‌టేబుల్‌

ఏ గంటలో ఏం చేయాలో కరికులమ్‌

ప్రాణాయామంతో మొదలు పంచ్‌లు, కిక్‌లు  

కత్తులతో పొడవడం..కర్రలతో కొట్టడానికి ప్రత్యేక శిక్షణ 

ఎన్‌ఐఏ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి  

సాక్షి, హైదరాబాద్‌: విధ్వంసం ఎలా సృష్టించాలి..ఎదుటివారి మక్కెలెలా విరగ్గొట్టాలి. వారు దాడిచేస్తే ఎలా తప్పించుకోవాలి. ఇలా ప్రతిదానికి పీఎఫ్‌ఐ (పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా) శిక్షణలో ఓ ప్రత్యేక ప్రణాళిక ఉంది. ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు మొదలయ్యే ఈ శిక్షణలో ప్రతి అర్ధగంటకు ఏఏ పనులు చేయాలి. ఏ విషయాల్లో శిక్షణ ఇవ్వాలన్న టైమ్‌టేబుల్‌ సైతం పీఎఫ్‌ఐ నాయకులు తయారు చేసినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) వెల్లడించింది. తెలంగాణలో తొలిసారి వెలుగుచూసిన పీఎఫ్‌ఐ మూలాలు కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, రాజస్తాన్, మహారాష్ట్ర, బిహార్, పశి్చమబెంగాల్, అస్సోం, జమ్మూ, కశ్మీర్, మణిపూర్‌తోపాటు సింగపూర్, కువైట్, కతార్, ఓమన్, సౌదీఅరేబియా, యూఏఈ వంటి దేశాల్లోనూ విస్తరించినట్టు ఎన్‌ఐఏ అధికారులు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా ఎన్‌ఐఏ అధికారులు పీఎఫ్‌ఐ శిక్షణకు టైం టేబుల్‌ను గుర్తించారు. అందులో పలు విస్తుపోయే అంశాలున్నాయి.  

ప్రాణాయామంతో మొదలు  
పీఎఫ్‌ఐలోకి కొత్తగా వచ్చే ఓ వర్గం యువతను విధ్వంసకర శక్తులుగా మార్చేందుకు నిర్వాహకులు ఒక రోజులోని సమయాన్ని మొత్తం ఆరు సబ్జెక్ట్‌లు విడగొట్టి టైమ్‌టేబుల్‌ రూపొందించారు. ఉదయాన్నే మొదట ప్రాణాయామం చేయిస్తారు. ఆ తర్వాత ఉదయం 11 నుంచి శా రీరక దృఢత్వాన్ని పెంచేలా వ్యాయామం ఉంటుంది. మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి వరకు ప్రతి గంటకు, అర గంటకు ఒకటి చొ ప్పున విధ్వంసకరమైన దాడులపై శిక్షణ కొనసాగుతుంది. ఇందులో చేతిలో ఏ ఆయుధం లేకుండానే ఎదుటి వ్యక్తిని పిడిగుద్దులు, తన్నులతో, తలపై కొట్టి రక్తస్రావం వచి్చపడేలా చేయడంపై శిక్షణ ఇస్తున్నారు. చిన్నకత్తితో ఎదుటి వ్యక్తి పొట్టలో, తొడలపై పొడవడం ఇలా చేసి కదలకుండా చేయడంపై శిక్షణ ఇస్తున్నారు. కర్రతో మోకాళ్లపై దాడి చేయడం..మొహంపై కొట్టడం, మెడ పట్టుకొని కిందపడేసి కర్రతో విచక్షణారహితంగా కొట్టడం, పక్కటెముకలపై తన్నడం, కర్రతో దాడి చేయడానికి తరీ్ఫదు ఇస్తున్నారని ఎన్‌ఐఏ పేర్కొంది.  

తొలి రోజు నుంచే విద్వేషం నూరిపోస్తారు  
పీఎఫ్‌ఐలో కొత్తగా చేరిన వారికి మొదటి రోజు నుంచే నిత్యం భగవంతుడిని ప్రార్థన చేయడం అతి ముఖ్యమైన అంశంగా బోధిస్తున్నారు. ఇక్కడి నుంచే వారిలో మత ఛాందస వాదాన్ని నూరిపోస్తున్నారు. మధ్యాహ్నం 2 నుంచి 2.45 గంటల మధ్య మతపరంగా రెచ్చగొట్టే వీడియోలు చూపించడం, వాటితో ఉద్రేకపూర్వకంగా మార్చేలా ప్రసంగాలు ఇవ్వడం... ప్రతి రోజూ వార్తలు చదవడం, బృందంగా ఏర్పడి ఒక అంశంపై చర్చ, రైటింగ్‌ స్కిల్స్‌ సైతం నేర్పేందుకు ప్రత్యేక సమయం కేటాయించారని ఎన్‌ఐఏ అధికారులు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement