‘గేటెడ్‌’ నేరాల నిరోధానికి యాప్‌ | Strict action against anti social activities in club houses | Sakshi

‘గేటెడ్‌’ నేరాల నిరోధానికి యాప్‌

Jan 2 2025 3:59 AM | Updated on Jan 2 2025 3:59 AM

Strict action against anti social activities in club houses

రూపొందించాలని  పోలీస్‌ కమిషనర్లకు హైకోర్టు ఆదేశం 

క్లబ్‌ హౌస్‌లలో అసాంఘిక కార్యకలాపాలపై కఠినచర్యలు  

డ్రగ్స్, లిక్కర్‌ వినియోగంపై ఉక్కుపాదం మోపాలి 

ఫిర్యాదు చేసినవారి వివరాలు గోప్యంగా ఉంచాలి 

సిటీ పోలీస్‌ చట్టం ప్రకారం చర్యలు చేపట్టాలని సూచన

సాక్షి, హైదరాబాద్‌: గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లలో నేరాల నిరోధానికి ఒక యాప్‌ను రూపొందించాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్‌ కమిషనర్లను హైకోర్టు ఆదేశించింది. ఇతర నివాసితులకు ఇబ్బందులు కలిగించేలా చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేపడితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. 

హద్దు మీరితే హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి ఫేజ్‌–13లోని ఇందూ ఫార్చ్యూన్‌ ఫీల్డ్స్‌ విల్లాస్‌ క్లబ్‌ హౌస్‌ అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారిందని.. 

దీనిపై ఫిర్యాదు చేసినా యాజమాన్య సంఘం చర్యలు తీసుకోవడంలేదంటూ హరిగోవింద్‌ ఖురానారెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టి.. తీర్పు వెలువరించారు.  

కమిషనర్లకు అధికారం.. 
హైదరాబాద్‌ పోలీస్‌ చట్టంలోని సెక్షన్‌ 22 కింద ఊరేగింపుల నియంత్రణ, వీధుల్లో, బహిరంగ ప్రదేశాల్లో క్రమశిక్షణ పాటించటం, ఏదైనా వీధి లేదా బహిరంగ ప్రదేశాల్లో సంగీతం, పాటల నియంత్రణ, హైదరాబాద్‌ సిటీ లౌడ్‌ స్పీకర్‌ నియమాలు–1963, హైదరాబాద్, సికింద్రాబాద్‌ (పబ్లిక్‌ ప్లేస్‌ ఆఫ్‌ హాల్ట్‌/పీస్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌/ అమ్యూజ్‌మెంట్‌) నియమాలు–2005, శబ్ద కాలుష్య (నియంత్రణ) నియమాలు–2000, జీవో 172లోని పర్యావరణం, అడవులు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఈఎన్‌వీ) నిబంధనల ప్రకారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసే అధికారం కమిషనర్, ఇతర పోలీసు ఉన్నతాధికారులకు ఉంది అని హైకోర్టు స్పష్టంచేసింది.

తీర్పులో పేర్కొన్నసూచనలు, ఆదేశాలు..
1) ఇందూ ఫార్చ్యూన్‌ ఫీల్డ్స్‌ విల్లా ఓనర్స్‌ అసోసియేషన్‌ కార్యనిర్వాహక కమిటీ సభ్యుల నుంచి ముగ్గురు సభ్యులతో కూడిన ఉప కమిటీని ఏర్పాటు చేయాలి. వీరు ప్రధానంగా సీనియర్‌ సిటిజన్లు/మహిళలు/రిటైర్డ్‌ ఉద్యోగులై ఉండాలి. వీరు క్లబ్‌హౌస్‌ వంటి ప్రదేశాల్లో నిఘా ఉంచవచ్చు. 
2) అసోసియేషన్‌ ఓ యాప్‌ లాంటి ప్లాట్‌ఫామ్‌/అప్లికేషన్‌ను రూపొందించాలి. దీని ద్వారా సభ్యులు ఫిర్యాదులు/సందేశాలను పంపవచ్చు. దీని నిర్వహణకు ప్రత్యేక టీమ్‌ ఉండాలి. సబ్‌–కమిటీ సభ్యులు మాత్రమే యాక్సె స్‌ కలిగి ఉండేలా చర్యలు చేపట్టాలి. ఫిర్యాదులు/సందేశాలను ఆ సభ్యులకు పంపాలి. సబ్‌–కమిటీ సభ్యులు ఫిర్యాదుదారుడి గుర్తింపును గోప్యంగా ఉంచాలి. 
3) వచి్చన ఫిర్యాదులపై వెంటనే చర్య తీసుకొని కార్యనిర్వాహక కమిటీకి నివేదించాలి. ఏదైనా చట్టవిరుద్ధమైన చర్యలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. 
4) గేటెడ్‌ కమ్యూనిటీ క్లబ్‌హౌస్‌ వినియోగానికి అసోసియేషన్‌ నిర్దిష్టంగా చేయవలసినవి, చేయకూడని పనుల జా బితాను రూపొందించాలి. క్లబ్‌హౌస్‌ను దుర్వినియోగం చేస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించాలి. 
5) నగర పోలీసు చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధానికి, నేరాల నియంత్రణకు, ఇతర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా గేటెడ్‌ కమ్యూనిటీలు/అసోసియేషన్లు/ఫ్లాట్‌ అసోసియేషన్లకు అవసరమైన సలహాలను సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ జారీ చేయాలి. 
6) వేధింపులు, నేరాలు జరిగినప్పుడు గేటెడ్‌ కమ్యూనిటీలు/అసోసియేషన్లు/ఫ్లాట్‌ అసోసియేషన్లలో తగిన చర్యలు తీసుకోవడానికి సంబంధిత పోలీస్‌ స్టేషన్‌/టాస్క్‌ఫోర్స్‌కు అవసరమైన సూచనలను కూడా సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ జారీ చేయాలి.  
7) వీలైతే గేటెడ్‌ కమ్యూనిటీలు/అసోసియేషన్లు/ఫ్లాట్‌ అసోసియేషన్లలోని నేరాలపై ఫిర్యాదు చేయడానికి, సమాచారం ఇచ్చే వ్యక్తి/ఫిర్యాదుదారుడి గుర్తింపును గోప్యంగా ఉంచేందుకు సంబంధిత పోలీస్‌ స్టేషన్లకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ (యాప్‌)ను సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అందించాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement