వడివడిగా ‘స్టడీ’...నిరుద్యోగులకు ప్రత్యేక కోచింగ్‌  | Study Circle Centre for Arranged by Department of Welfare in Telangana | Sakshi
Sakshi News home page

వడివడిగా ‘స్టడీ’...నిరుద్యోగులకు ప్రత్యేక కోచింగ్‌ 

Published Mon, May 23 2022 2:02 AM | Last Updated on Mon, May 23 2022 9:56 AM

Study Circle Centre for Arranged by Department of Welfare in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  నిరుద్యోగ యువత కొలువుల జాతరలో మునిగిపోయింది. ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్న అభ్యర్థులు అకుంఠిత దీక్షతో సంసిద్ధులవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 80 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఈ మేరకు గ్రూప్‌–1, పోలీసు ఉద్యోగ ఖాళీలను నోటిఫై చేయడంతో తమకు ఆసక్తి ఉన్న ఉద్యోగాలను దక్కించుకునేందుకు అవసరమైన శిక్షణ కోసం యువత నడుం బిగించింది. ఈ క్రమంలోనే సంక్షేమ శాఖల పరిధిలోని స్టడీ సర్కిళ్లు కూడా యువతకు శిక్షణ ఇస్తున్నాయి. ఆయా స్టడీ సర్కిళ్లు వ్యూహాత్మక శిక్షణ ఇస్తుండటంతో నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఈ సెంటర్ల బాట పడుతున్నారు. దీంతో ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లో లక్ష మందికి పైగా అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ అమలు చేయడంలో సంక్షేమ శాఖలు నిమగ్నమయ్యాయి. 

వంద స్టడీ సెంటర్లు... లక్ష మంది అభ్యర్థులు 
నాలుగు సంక్షేమ శాఖలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో స్టడీ సెంటర్లను ఏర్పాటు చేశాయి. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక్కో స్టడీ సెంటర్‌ను ఏర్పాటు చేయగా.. బీసీ సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఉన్న పది స్టడీ సర్కిళ్లతో పాటు మరో రెండు చోట్ల స్టడీ సర్కిళ్లను అందుబాటులోకి తెచ్చింది. మైనార్టీ సంక్షేమ శాఖ కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో తాత్కాలిక స్టడీ సెంటర్లను తెరిచింది. రాష్ట్రవ్యాప్తంగా తొలివిడతలో ప్రస్తుతం పదివేల మంది అభ్యర్థులతో సంక్షేమ శాఖలు వంద స్టడీ సెంటర్లను నిర్వహిస్తుండగా... అతి త్వరలో మరో రెండు బ్యాచ్‌లకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించాయి. దీంతో పాటు ఆన్‌లైన్‌ కోచింగ్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నాయి. మొత్తం మీద లక్ష మందికి పైగా అభ్యర్థులకు శిక్షణ పొందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి.  

నిపుణులతో శిక్షణ తరగతులు: ప్రభుత్వ విభాగాల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్న నేపథ్యంలో అభ్యర్థులకు ఇచ్చే శిక్షణ.. ఏదో నామమాత్రపు, మొక్కుబడి శిక్షణ కాకుండా, నాణ్య తతో కూడిన శిక్షణ అందించాలని సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఆయా అంశా లు, సబ్జెక్టుల్లో నిపుణులైన వారిని నియమించేందుకు సంక్షేమ శాఖలు పోటీ పడ్డాయి. అత్యుత్తమ రేటింగ్‌ ఉన్న ప్రైవేటు కోచింగ్‌ సెంటర్లలోని నిపుణులను మంచి ప్యాకేజీలతో ఎంగేజ్‌ చేసుకున్నాయి. నిపుణుల ఎంపికకు హైదరాబాద్, నగర శివారు జిల్లాల్లో పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ.. ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం తదితర జిల్లాల్లో కాస్త కష్టంగా మారింది. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి కొందరిని ప్రత్యేకంగా ఎంపిక చేసి గ్రామీణ జిల్లాలకు పంపించేందుకు సంక్షేమాధికారులు విశేషంగా కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల ఒకటో తేదీ నుంచే గ్రూప్‌–1, పోలీసు ఉద్యోగాలకు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. 

పెద్ద సంఖ్యలో దరఖాస్తులు 
సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులకు అనూహ్య స్పందన వస్తోంది. తొలివిడతకు ఏకంగా 34 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో వడపోత అనంతరం 10 వేల మందితో ఒక బ్యాచ్‌ను ప్రారంభించారు. మరో రెండు బ్యాచ్‌లను అతి త్వరలో ప్రారంభించేందుకు స్టడీ సర్కిల్‌ డైరెక్టర్లు కసరత్తు చేస్తున్నారు. త్వరలో గ్రూప్‌–4 నోటిఫికేషన్‌ సైతం వెలువడే అవకాశం ఉండడంతో ఆ మేరకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. 

పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులు 
స్టడీ సెంటర్ల నిర్వహణకు గిరిజన సంక్షేమ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో స్టడీ సెంటర్లను నడిపిస్తోంది. వీటి నిర్వహణ బాధ్యతలను సంబంధిత జిల్లా కలెక్టర్లకు అప్పగించగా.. పర్యవేక్షణ కోసం గిరిజన సంక్షేమ శాఖ కమిషనరేట్‌ నుంచి ప్రత్యేకాధికారులు నియమితులయ్యారు. శిక్షణ తరగతులను క్రమం తప్పకుండా పర్యవేక్షించడంతో పాటు అంతర్గత పరీక్షల నిర్వహణ, ఫలితాల విశ్లేషణ తదితర అంశాలను సైతం పర్యవేక్షిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారి, ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రత్యేకాధికారి సముజ్వల తెలిపారు. 

అందుబాటులో వీడియో పాఠాలు 
బీసీ సంక్షేమ శాఖ ద్వారా నిర్వహిస్తున్న స్టడీ సెంటర్లలో ప్రత్యక్ష తరగతులకు హాజరు కాలేని అభ్యర్థుల కోసం వీడియో పాఠాలను సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు. నిపుణ చానల్‌తో పాటు టీశాట్‌ ద్వారా వీడియో పాఠాలను వీక్షించే వెసులుబాటును కల్పించారు. రెండ్రోజుల క్రితం ఈ తరగతులను ప్రారంభించారు. వారంలోగా వీక్షకుల సంఖ్య 50 వేలకు చేరుతుందని భావిస్తున్నామని, గ్రూప్‌–4 నోటిఫికేషన్‌ వచ్చిన వెంటనే మరికొన్ని బ్యాచ్‌లకు శిక్షణ ఇస్తామని బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ అలోక్‌ కుమార్‌ చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement