నేడు ప్రశ్నోత్తరాలు.. సంతాపాలు, రెండు బిల్లులు, స్వల్పకాలిక చర్చ
బెల్టుషాపుల మూసివేత, పెండింగ్ బిల్లులు, టీజీఐఐసీ పార్కులపై ప్రభుత్వ సమాధానం
స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు మరో బిల్లు ప్రవేశపెట్టనున్న సర్కారు
పర్యాటక విధానంపై అసెంబ్లీ, మండలిలో స్వల్పకాలిక చర్చ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం పునఃప్రారంభం కానున్నాయి. శాసనసభతోపాటు మండలి కూడా ఉదయం 10:30 గంటలకు భేటీ కానున్నాయి. ఈనెల 9వ తేదీన ప్రారంభమైన శీతాకాల సమావేశాలు తొలిరోజు భేటీ అనంతరం సోమవారానికి వాయిదా పడిన విషయం తెలిసిందే. రెండోరోజు ఎజెండాలో భాగంగా రెండు సభల్లోనూ తొలుత ప్రశ్నోత్తరాలు ఉంటాయి. అనంతరం మాజీ ఎమ్మెల్యేలు కొమిరెడ్డి జ్యోతి, ఊకె అబ్బయ్య, డి.రామచంద్రారెడ్డిల మృతి పట్ల అసెంబ్లీలో సంతాప తీర్మానాలను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది.
వీరికి సంతాపం తెలిపిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ వర్సిటీ, తెలంగాణ విశ్వవిద్యాలయాల బిల్లు(సవరణ)–2024ను ప్రవేశపెడతారు. ఈబిల్లులపై చర్చించి ఆమోదం తెలిపిన అనంతరం ‘తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక విధానం’పై స్వల్పకాలిక చర్చ ఉంటుంది.
శాసనమండలిలోనూ ప్రశ్నోత్తరాల అనంతరం మాజీ ఎమ్మెల్సీ ఎన్.ఇంద్రసేనారెడ్డి మృతి పట్ల సంతాప తీర్మానం, అనంతరం పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. ఈ మేరకు సోమవారం ఎజెండాను అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు విడుదల చేశారు.
పలు కీలక ప్రశ్నలు: అటు అసెంబ్లీ, ఇటు మండలిలో పలు కీలక ప్రశ్నలపై రాష్ట్ర ప్రభు త్వం సమాధానం ఇవ్వనుంది. గ్రామ పంచాయతీల్లో బీటీ రోడ్లు, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల క్రమబద్దీకరణ, స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు, ముదిరెడ్డిపల్లి చెరువులో నీటి కాలుష్యం, రాష్ట్రంలో నూతన టీజీఐఐసీ పార్కుల ఏర్పాటు, పర్యాటకానికి ప్రోత్సాహం, ఓయూలో బీఈ విద్యార్థుల డిటెన్షన్, రాష్ట్రంలోని బెల్టుషాపుల మూసివేత, ఐవీఎఫ్ కేంద్రాలు, జీరో ఎన్‌రోల్‌మెంట్ పాఠశాలలపై సభ్యులు అడిగే పలు ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం సమాధానం ఇవ్వడంతోపాటు ఈ అంశాల్లో అనుసరించే విధానాలను వెల్లడించనుంది.
మండలిలో రాష్ట్రంలో టైగర్ రిజర్వుల అభివృద్ధి, ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ భవనాల నిర్మాణం, కొత్త రేషన్‌కార్డుల జారీ, తేనెటీగలు, పట్టు పురుగల పరిశోధన కేంద్రం ఏర్పాటు, వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీ, రేషన్ డీలర్ల గౌరవ వేతనం, చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం, తెలంగాణలో టీటీడీ ఆస్తులు, కొత్త బీసీ గురుకులాల ఏర్పాటు, జిల్లాల పునర్వ్యవస్థీకరణలపై ప్రభుత్వం సమాధానం ఇస్తుంది.
సమావేశాలు ఎప్పటివరకు?
అసెంబ్లీ శీతాకాల సమావేశాలను ఎప్పటివరకు కొనసాగించాలన్న దానిపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సోమవారం నిర్ణయం తీసుకోనున్నారు. ప్రశ్నోత్తరాల అనంతరం స్పీకర్ చాంబర్‌లో జరిగే సభా వ్యవహారాల సలహా కమిటీ భేటీలో సభను ఏఏ రోజుల్లో, ఎన్ని రోజుల పాటు నడిపించాలన్న దానిపై చర్చించిన అనంతరం అధికారికంగా ప్రకటిస్తారు. శీతాకాల సమావేశాలు ఈ వారం మొత్తం సాగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీనిపై బీఏసీలో తుది నిర్ణయం జరగనుంది. ఈసారి అసెంబ్లీ సమావేశాలు కొత్త ఆర్‌వోఆర్ చట్టం, కులగణన, రైతు భరోసా తదితర అంశాల ఎజెండాగా కొనసాగుతుందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment