సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటా అడ్డగోలుగా ఫీజులు పెంచుతున్న ప్రైవేటు స్కూళ్లకు ముకుతాడు వేసేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. కొన్ని స్కూళ్లు ఏటా ఏకంగా 25 శాతం వరకు ఫీజులు పెంచుతున్న నేపథ్యంలో దీని నియంత్రణకు 11 మంది మంత్రులతో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం... ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేసినట్లు తెలిసింది. కొన్ని షరతులకు లోబడి ఏటా 10 శాతం వరకు ఫీజులు పెంచుకొనే అధికారాన్ని ఆయా ప్రైవేటు స్కూళ్లకే ఇవ్వాలని ఇటీవలి సమావేశంలో ఉపసంఘం అభిప్రాయపడ్డట్లు తెలియవచ్చింది. ఇందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం ఫీజుల నియంత్రణ బిల్లు తీసుకొచ్చే వీలుందని సమాచారం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వ వర్గాలు రూపొందిస్తున్నాయి. ఇటీవలి మంత్రివర్గ ఉపసంఘం భేటీ ఎజెండాలోని అంశాలు తాజాగా బయటకొచ్చాయి. దీనిప్రకారం ప్రైవేటు స్కూళ్ల జమాఖర్చులనే ఫీజుల పెంపులో కొలమానంగా తీసుకోవాలనే షరతు ప్రభుత్వం విధించనుంది.
మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు...
– స్కూల్ స్థాయిలో యాజమాన్యం సూచించే వ్యక్తి చైర్మన్‌గా, ప్రిన్సిపల్, టీచర్స్, విద్యార్థుల తల్లిదండ్రుల సంఘాల నుంచి ఇద్దరు మహిళలు, ఒక మైనారిటీ, మరో ఇద్దరు ఇతరులతో కమిటీ ఏర్పాటు చేయాలి.
– ఫీజు పెంచే సంవత్సరంలోని జమాఖర్చులను ఈ కమిటీలో చర్చించాలి. ముఖ్యంగా ఆడిట్ రిపోర్టును ప్రామాణికంగా తీసుకోవాలి.
– జమాఖర్చులకు సంబంధించిన లావాదేవీలన్నీ కేవలం డిజిటల్ విధానంలోనే జరగాలి. అప్పుడే దాన్ని విశ్వసనీయమైన లెక్కలుగా పరిగణించాలి.
– ఈ తరహా లెక్కలు చూపడంలో స్కూల్ కమిటీ విఫలమైతే రాష్ట్ర స్థాయి కమిటీ దీన్ని పరిశీలించి, ఫీజు పెంచాలా? వద్దా? అనేది నిర్ధారిస్తుంది.
– రాష్ట్రస్థాయి కమిటీలో ప్రభుత్వం నామినేట్ చేసిన రిటైర్డ్ న్యాయమూర్తి, పాఠశాల విద్య డైరెక్టర్ లేదా కమిషనర్, ప్రభుత్వం సూచించిన విద్యారంగ నిపుణులు ఉంటారు. అంతిమంగా ఈ కమిటీ ఎంత ఫీజు పెంచాలనేది నిర్ణయిస్తుంది.
ప్రతిపాదిత చట్టంలోనూ ఇదే నిబంధన!
ఫీజుల నియంత్రణకు చట్టం తేవాలని నిర్ణయించిన ప్రభుత్వం దీనిపై అధ్యయనానికి ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీని వేసింది. ఈ కమిటీ 2017లో ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చింది. ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘంలో మునుపెన్నడూలేనట్లుగా 11 మందిని చేర్చారు. కేబినేట్‌లో ఉన్న మంత్రుల్లో సగానికిపైగా ఈ కమిటీలో ఉండటం గమనార్హం. షరుతులతో ఫీజుల పెంపునకు ఇంత మంది మంత్రులు ఏకాభిప్రాయం తెలిపిన నేపథ్యంలో ఇదే చట్ట రూపంలో రాబోయే వీలుందని పలువురు భావిస్తున్నారు.
ప్రైవేటు స్కూళ్ల ఫీజుల పెంపుపై మంత్రివర్గ ఉపసంఘం కీలక సిఫార్సు
Published Mon, Mar 7 2022 2:54 AM | Last Updated on Mon, Mar 7 2022 9:34 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment