మాజీ ఎంపీ రమేష్‌ రాథోడ్‌ కన్నుమూత | telangana ex mp ramesh rathod passed away | Sakshi
Sakshi News home page

మాజీ ఎంపీ రమేష్‌ రాథోడ్‌ కన్నుమూత

Published Sat, Jun 29 2024 1:01 PM | Last Updated on Sat, Jun 29 2024 7:45 PM

telangana ex mp ramesh rathod passed away

ఆదిలాబాద్: మాజీ ఎంపీ, బీజేపీ నేత రాథోడ్ రమేష్‌ కన్నుమూశారు. నిన్న రాత్రి ఉట్నూరులో తన నివాసంలో అస్వస్థకు గురికాగా.. కుటుంబసభ్యులు జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం రమేష్‌ను హైదరాబాద్ తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. రమేష్‌ రాథోడ్‌ మృతదేహాన్ని ఆయన స్వస్థలం ఉట్నూరుకు తరలించారు. 

మాజీ ఎంపీ రమేష్ రాథోడ్‌ను పార్టీ నుంచి టీపీసీసీ సస్పెండ్‌ చేయడంతో.. లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. అనతంరం ఆయన బీజేపీలో చేరారు. రమేష్‌ రాథోడ్‌ 2009లో ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2018లో ఖానాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీచేసి ఓడిపోయారు.

రాథోడ్ రమేష్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నర్నూర్ జడ్పీటీసీగా, ఖానాపూర్ ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. ఆయన భార్య సుమన్ రాథోడ్‌ను రెండుసార్లు ఎమ్మెల్యేగా ఖానాపూర్ నియోజకవర్గం నుంచి గెలిపించుకున్నారు. ఆయన మృతి పట్ల అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. జిల్లా రాజకీయ నాయకులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

రమేష్‌ రాథోడ్‌ మృతి పట్ల కేంద్రమంత్రి బండి సంజయ్‌ దిగ్భ్రాంతి
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి పట్ల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘అదిలాబాద్ ఎంపీగా,  జిల్లా పరిషత్ చైర్మన్‌గా రమేష్ రాథోడ్ అందించిన సేవలు మరువలేనివి. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి రమేష్ రాథోడ్ ఎంతో కృషి చేశారు. రమేష్ రాథోడ్ చనిపోయారంటే నమ్మలేకపోతున్నా. రమేష్ రాథోడ్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. రాథోడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా’అని సంతాపం తెలిపారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement