
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పాత ప్రాజెక్టేనని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది. అది కొత్త ప్రాజెక్టేనని.. దానికి నీటి కేటాయింపులు చేసే అధికారం కొత్త ట్రిబ్యునల్‌కే ఉందంటూ కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ)–2 వద్ద ఏపీ ప్రభుత్వం వాదించిన నేపథ్యంలో అది ముమ్మాటికీ పాత ప్రాజెక్టేనని తెలంగాణ స్పష్టం చేసింది. చిన్న నీటివనరుల విభాగంలో మిగిలిన 45 టీఎంసీలు, కృష్ణా డెల్టాకు ఏపీ ప్రభుత్వం మళ్లించిన 80 టీఎంసీలకుగాను తమకు దక్కే 45 టీఎంసీలను కలిపి 90 టీఎంసీలను ఆ ప్రాజెక్టుకు కేటా యించామంటూ ట్రిబ్యునల్‌కు తెలంగాణ ప్రభుత్వం వివరించింది.
విభజన చట్టం ప్ర కారం ఆ ప్రాజెక్టుకు కృష్ణా బోర్డు, సీడబ్ల్యూ సీ, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం కోసం ప్రయత్నిస్తున్నామని.. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభు త్వం దాఖలు చేసిన ఐఏ(ఇంటర్ లొకేటరీ అప్లికేషన్)ను కొట్టేయాలని ట్రిబ్యునల్‌కు విజ్ఞప్తి చేసింది. రెండు రాష్ట్రాల వాదనలు విన్న ట్రిబ్యునల్.. తదుపరి విచారణను సెపె్టంబర్ 25కు వాయిదా వేసింది. సెపె్టంబర్ 25 నుంచి 27 వరకూ ట్రిబ్యునల్ విచారించనుంది.
ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన జలాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు పంపిణీ చేసేందుకు జస్టిస్ బ్రిజేష్‌కుమార్ అధ్యక్షతన జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్ ఎస్.తాళపత్ర సభ్యులుగా కేంద్రం ఏర్పాటుచేసిన ట్రిబ్యునల్ బుధవారం నుంచి విచారణను ప్రారంభించింది. బుధవారం, గురువారం తెలంగాణ సర్కార్ తరఫున సీనియర్ కౌన్సిల్ సీఎస్ వైద్యనాథన్ వాదనలు విన్పించగా.. శుక్రవారం ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ కౌన్సిల్ జయదీప్‌గుప్తా వాదనలు విన్పించారు.
తెలంగాణకు అన్యాయం చేశారు..
చిన్న నీటివనరుల విభాగంలో దశాబ్దాలుగా తాము ఏడాదికి సగటున 44 టీఎంసీలకు మించి వాడుకోలేదని.. కానీ విభజన సమయంలో 89 టీఎంసీలు వాడుకుంటున్నామ ని ఏపీ ప్రభుత్వం ఎత్తిచూపిందని ట్రిబ్యునల్‌కు తెలంగాణ సర్కార్ వివరించింది. ఆ క్రమంలోనే ఏపీకి 512, తమకు 299 టీఎంసీలు పంచుతూ అన్యాయం చేశారని పేర్కొంది.
మిగులు జలాలను వాడుకోవడానికే..
నికర జలాలను బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులకు కేటాయించడానికే బచావత్ ట్రిబ్యునల్ తొలి ప్రాధాన్యత ఇచ్చిందని.. నికర జలాల్లో మిగులును మాత్రమే బేసిన్ ఆవల ప్రాజెక్టులకు కేటాయించిందని తెలంగాణ ప్రభు త్వం పేర్కొంది. పాలమూరు–రంగారెడ్డి బేసిన్ పరిధిలోని ప్రాజెక్టేనని.. ఆ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు న్యాయబద్ధమేనని స్ప ష్టం చేసింది.
తెలంగాణ వాదనలు విన్నాక ట్రిబ్యునల్ చైర్మన్ బ్రిజేష్కుమార్ స్పందిస్తూ.. విభజన చట్టంలో సెక్షన్ 89 ప్రకారం కేటాయింపులు లేని ప్రాజెక్టులకు మాత్రమే నీటిని కేటాయించే అధికారం తమకు ఉందని.. నీటిని పునఃపంపిణీ చేసే అధికారం తమకు లేదని స్పష్టం చేశారు. దీనిపై తెలంగాణ సీనియర్ కౌన్సిల్ వైద్యనాథన్ స్పందిస్తూ.. అలాంటప్పుడు ఏపీ సర్కార్ దాఖలు చేసిన ఐఏను విచారించే అధికారం ట్రిబ్యునల్‌కు ఎలా ఉంటుందని ప్రశ్నించారు.
కేటాయింపులకు మించి వినియోగం: ఏపీ ఆరోపణ
తాము చేపట్టిన మిషన్ కాకతీయ విజయవంతమైందని తెలంగాణ సర్కారే చెబుతోందని.. దీన్ని బట్టి చూస్తే చిన్న నీటివనరుల విభాగంలో వాడుకుంటున్న నీటిపై తెలంగాణ చెబుతున్న లెక్కలు సరైనవి కావంటూ ట్రిబ్యునల్‌కు ఏపీ ప్రభుత్వ సీనియర్ కౌన్సిల్ జయదీప్‌గుప్తా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment