సాక్షి, హైదరాబాద్: మహిళలు అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్నా రావాల్సిన గుర్తింపు రావట్లేదని, పైగా అవమానాలు ఎదురవుతున్నాయని గవర్నర్ తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ఇప్పటికీ సరైన గౌరవం దక్కట్లేదని, అత్యున్నత పదవుల్లోని వాళ్లూ గౌరవం పొందట్లేదన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన మహిళలను గవర్నర్ సత్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘సమాన హక్కుల కోసం మనమంతా ఒకవైపు డిమాండ్ చేస్తుంటే అన్ని స్థానాల్లో, చివరకు ఉన్నత పదవు ల్లోని మహిళలూ ఇంకా వివక్షకు గురవుతున్నారని’ అన్నారు. ‘నన్ను ఎవరూ భయపెట్టలేరు. నేను దేనికీ భయపడను కూడా’అని వ్యాఖ్యానించారు.
మహిళలకు పని వాతావరణం కల్పించాలి
మహిళలు ప్రపంచవ్యాప్తంగా ప్రేమాభిమానాలు పంచుతూ శాంతియుత జీవనం కొనసాగేందుకు ఎన్నో త్యాగాలు చేస్తున్నారని గవర్నర్ గుర్తు చేశారు. మహిళలు జీవితంలో సవాళ్లను ఎదుర్కొంటున్నా ఆర్థిక స్వతంత్రం, ఆరోగ్యవంతంగా ప్రతీ క్షణం జీవితాన్ని ఆస్వాదించాలన్నారు. మహిళా రక్షణ, లింగ సమానత్వంతో వారు పని చేసే వాతావరణం కల్పించాలని కోరారు. మహిళలు సాధించిన అద్భుత విజయాలను గుర్తు చేసుకొని వారిని గుర్తించడం మహిళా దినోత్సవం ఉద్దేశమని అన్నారు.
జడ్జిలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులకు సన్మానం
కార్యక్రమంలో భాగంగా ‘ఈరోజు లింగ సమానత్వం – రేపటి సుస్థిర భవిష్యత్తు’అంశంపై సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్రీసుధ, జస్టిస్ రాధా రాణి, జస్టిస్ పి. మాధవీదేవి, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, ఎమ్మెల్యే సీతక్కతో పాటు డాక్టర్ పద్మజారెడ్డి (కూచిపూడి), నోముల హేమలత (సామాజిక, వైద్య సేవ), ప్రీతి రెడ్డి, సాత్విక, జయలక్ష్మి, సీతామహాలక్ష్మి, మామిడి రచనను గవర్నర్ సత్కరించారు. ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల బృందం కూచిపూడి బ్యాలెట్, గంగా జమునా బృందం మహిళా డప్పు వాయిద్య ప్రదర్శన నిర్వహించారు. దాదాపు 300 మంది మహిళలు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment