Telangana: 16,614 పోలీసు కొలువులు | Telangana Govt Jobs Notification Police Department | Sakshi
Sakshi News home page

Telangana: 16,614 పోలీసు కొలువులు

Published Tue, Apr 26 2022 5:02 AM | Last Updated on Tue, Apr 26 2022 7:56 AM

Telangana Govt Jobs Notification Police Department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎదురుచూస్తున్న పోలీస్‌ ఉద్యోగాల నోటిఫికేషన్‌ వచ్చే సింది. పోలీసుశాఖతోపాటు మరో 3 విభాగాల్లో 16,614 పోస్టులను భర్తీ చేస్తున్నట్టు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు సోమవారం తీపికబురు చెప్పింది. ఎస్సై పోస్టులు, ఇతరవిభాగాల్లో తత్సమాన హోదా ఉండే పోస్టులు కలిపి 587 ఖాళీలను.. కానిస్టేబుల్, తత్సమాన హోదా ఉండే 16,027 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేశామని బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాస్‌రావు ప్రకటించారు. 

వచ్చే నెల 2 నుంచి దరఖాస్తులు 
పోలీస్, ఫైర్, ఎస్పీఎఫ్, జైళ్లశాఖలో భర్తీ చేయనున్న పోస్టులకు వచ్చే నెల (మే) 2 నుంచి 20 వరకు పోలీస్ రిక్రూట్‌మెంట్‌ వెబ్‌సైట్‌ https://www.tslprb.in/లో దరఖాస్తు చేసుకోవాలని శ్రీనివాస్‌రావు సూచించారు. అభ్యర్థులు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి.. అందులో పేర్కొన్న మేర అర్హతలను పూర్తిగా చెక్‌ చేసుకున్న తర్వాతే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎస్సై, తత్సమాన హోదా పోస్టులకు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1,000.. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు రూ.500  దరఖాస్తు రుసుముగా చెల్లించాలని తెలిపారు. కానిస్టేబుల్, తత్సమాన హోదా పోస్టులకు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.800.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలన్నారు. దరఖాస్తు చేసుకునేవారు సంబంధిత విద్యార్హతలను కలిగి ఉండాలని.. అలాగే 2022 జూలై 1 నాటికి సదరు కోర్సులో ఉత్తీర్ణత సాధించగలిగిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 
మూడేళ్ల వయోపరిమితి సడలింపు 
నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం.. పోలీస్, తదితర విభాగాల్లో పోస్టులకు వయోపరిమితిని మూడేళ్ల పాటు సడలించింది. పోలీస్‌ శాఖ, ఇతర యూనిఫాం విభాగాల్లో.. సబ్‌ఇన్‌స్పెక్టర్‌ (ఎస్సై) పోస్టులకు 21 ఏళ్ల నుంచి 25ఏళ్ల మధ్య వయసు ఉన్నవారే అర్హులు. ఇప్పుడు 28 ఏళ్ల వరకు వయసువారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక కానిస్టేబుల్‌ పోస్టులకు 18 ఏళ్ల నుంచి 22 ఏళ్ల మధ్య వయసు పరిమితి ఉండగా.. ఇప్పుడు 25 ఏళ్ల వయసున్న వారి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న (కార్పొరేషన్లు కాకుండా) వారికి ఐదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు మరో మూడేళ్లు, ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్చర్లకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీల వారికి ఐదేళ్లు, జనగణన శాఖలో తాత్కాలిక పద్ధితిలో ఆరు నెలలల పాటు 1991లో పనిచేసిన వారికి మూడేళ్లు వయోపరిమితి సడలింపు ఉన్నట్టు రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌లో తెలిపింది. 

మహిళా రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్‌ కూడా.. 
రాష్ట్ర పోలీసుశాఖలోని సివిల్, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ విభాగాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. గత నియామకాల తరహాలోనే.. ఈసారి కూడా సివిల్‌ విభాగంలో 33శాతం, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌లో 10శాతం మహిళా రిజర్వేషన్‌ వర్తిస్తుందని పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది. ఇక ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన ఎకనామికల్లీ వీకర్‌ సెక్షన్‌ (ఈడబ్ల్యూఎస్‌) కోటా కింద 10శాతం రిజర్వేషన్‌ సైతం అమలవుతుంది.  
– స్పోర్ట్స్, ఎన్‌సీసీ, పోలీస్‌ ఉద్యోగుల పిల్లలు, జైళ్లశాఖ ఉద్యోగుల పిల్లలు, ఎస్పీఎఫ్‌ ఉద్యోగుల పిలలు, హోంగార్డులకు స్పెషల్‌ కేటగిరీ కింద రిజర్వేషన్‌ ఉన్నట్టు బోర్డు తెలిపింది. 
– ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించి విడాకులు పొందిన మహిళలు, భర్తను కోల్పోయిన మహిళలకు 40 ఏళ్ల వరకు వయో పరిమితి సడలింపు ఉంటుందని ప్రకటించింది.

ఆయా పోస్టులకు.. విద్యార్హతలివీ.. 
– సబ్‌ ఇన్‌స్పెక్టర్, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్, డిప్యూటీ జైలర్‌ పోస్టులకు కనీసం డిగ్రీ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి. 
– పోలీస్‌ కానిస్టేబుల్, ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్, ఫైర్‌ మన్, జైలు వార్డర్‌ పోస్టులకు ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 
– ఐటీ, కమ్యూనికేషన్‌ విభాగంలో ఎస్సై పోస్టులకు.. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ (బీటెక్‌) ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌–కంప్యూటర్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో పట్టా పొంది ఉండాలి. 
– పోలీస్‌ ట్రాన్స్‌పోర్టు విభాగంలో ఎస్సై పోస్టులకు ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ లేదా మెకానికల్‌ ఇంజనీరింగ్‌ లేదా ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా కోర్సు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

– అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎస్సై) ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరోకు దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా కంప్యూటర్‌ సైన్స్‌ లేదా కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ లేదా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఒక సబ్జెక్టుగా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
– ఐటీ, కమ్యూనికేషన్‌ విభాగంలో పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు.. పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు ఐటీఐలో ఎలక్ట్రానిక్స్, మెకానికల్‌ లేదా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ–ఎలక్ట్రానిక్‌ సిస్టమ్‌ మెయింటెనెన్స్‌ లేదా కంప్యూటర్‌ ఆపరేటర్‌–ప్రొగ్రామింగ్‌ అసిస్టెంట్‌ లేదా మెకానిక్‌ కన్సూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ లేదా ఎలక్ట్రీషియన్‌ లేదా ఒకేషనల్‌ ఇంటర్మీడియట్, డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
– పోలీస్‌ కానిస్టేబుల్‌ మెకానిక్‌ పోస్టుల కోసం.. పదో తరగతితోపాటు ఐటీఐలో వైర్‌మన్‌ లేదా మెకానిక్‌ మోటార్‌ వెహికిల్‌ లేదా మెకానిక్‌ డీజిల్‌ లేదా ఫిట్టర్‌గా సర్టిఫికెట్‌ కోర్సు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
– పోలీస్‌ ట్రాన్స్‌పోర్టులో డ్రైవర్‌ పోస్టుల కోసం.. ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన కోర్సు పూర్తిచేసి.. ఐటీఐలో ఆటో ఎలక్ట్రీషియన్‌ లేదా మెకానిక్‌ మోటార్‌ లేదా మెకానిక్‌ డీజిల్‌ లేదా ఫిట్టర్‌ కోర్సు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇక టెక్నికల్‌ క్వాలిఫికేషన్‌ విభాగంలో తప్పనిసరిగా లైట్‌ మోటార్‌ వెహికిల్‌ లైసెన్స్‌తో బ్యాడ్జ్‌ నంబర్‌ కలిగి ఉండాలి. లేదా హెవీ మోటార్‌ వెహికల్‌ లైసెన్స్‌ కలిగి, రెండేళ్ల పాటు డ్రైవింగ్‌ చేసిన అనుభవం ఉండాలి. 
 
ఎంపిక విధానమిదీ.. 
పోలీసు నియామక ప్రక్రియలో ముందుగా ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహిస్తారు. 200 మార్కులకు నిర్వహించే ఈ రాతపరీక్షలో.. అర్థమెటిక్, రీజనింగ్‌/మెంటల్‌ ఎబిలిటీకి 100 మార్కులు, జనరల్‌ స్టడీస్‌కు 100 మార్కులు ఉంటాయి. కనీసం 30శాతం మార్కులు సాధించినవారే తర్వాతి దశలోని.. ఫిజికల్‌ ఎఫిషియన్సీ, దేహ దారుడ్య పరీక్షలకు అర్హులు అవుతారు. వీటిలోనూ అర్హత పొందినవారు తుది రాత పరీక్ష రాయాల్సి ఉంటుంది. 
– పురుష అభ్యర్థులకు 1,600 మీటర్ల పరుగు పరీక్ష నిర్వహిస్తారు. దీనిని 7 నిమిషాల 15 సెకండ్లలో పూర్తిచేయాలి. ఎక్స్‌సర్వీస్‌మన్‌ కేటగిరీవారు 9 నిమిషాల 30 సెకండ్లలో పూర్తిచేయవచ్చు. మహిళా అభ్యర్థులకు 800 మీటర్ల పరుగు పరీక్ష ఉంటుంది. వారు 5 నిమిషాల 20 సెకండ్ల పూర్తి చేయాలి. 
– పరుగు పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారి ఫిజికల్‌ ఎఫిషియెన్సీ పరిశీలిస్తారు. 

– కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు.. ఓసీ, బీసీ పురుష అభ్యర్థులు 167.6 సెంటీమీటర్ల ఎత్తు, మహిళా అభ్యర్థులు 152.5 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ పురుష అభ్యర్థులు 160 సెంటీమీటర్లు, మహిళలు 150 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. 
– కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు.. లాంగ్‌ జంప్‌లో పురుషులు 4 మీటర్లు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు 3.50 మీటర్లు, మహిళలు 2.50 మీటర్లు కనీస దూరాన్ని సాధించాలి.. షాట్‌పుట్‌లో పురుషులు, ఎక్స్‌సర్వీస్‌మన్‌ 7.26 కేజీల బరువును 6 మీటర్ల దూరం విసరాలి. మహిళా అభ్యర్థులు 4 కేజీల బరువును 4 మీటర్లు విసరాల్సి ఉంటుంది. 
– దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారంతా తుది రాతపరీక్ష రాయాల్సి ఉంటుంది. 
– సివిల్‌ కానిస్టేబుల్, ఫైర్‌మన్, వార్డర్‌ (పురుష, మహిళ) అభ్యర్థులు 200 మార్కులకు.. ఏఆర్‌ కానిస్టేబుల్, టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్, ఎస్పీఎఫ్‌ విభాగాల అభ్యర్థులు 100 మార్కులకు పరీక్ష రాయల్సి ఉంటుంది. ఓసీ కేటగిరీ 40 శాతం, బీసీ 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ 30శాతం కనీస మార్కులు సాధించాలి. 
– సివిల్‌ ఎస్సై, ఫైర్‌ ఆఫీసర్, డిప్యూటీ జైలర్‌ అభ్యర్థులు.. 4 పేపర్లలో 600 మార్కులకు పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో ఓసీ అభ్యర్థులు 40శాతం, బీసీలు 35శాతం, ఎస్సీ,ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మన్‌ అభ్యర్థులు 30శాతం కనీస మార్కులు సాధించాలి. 
– ఏఆర్‌ ఎస్సై, టీఎస్‌ఎస్‌పీ ఎస్సై, ఎస్పీఎఫ్‌ ఎస్సై అభ్యర్థులు 400 మార్కులకు నాలుగు పరీక్షలు రాయల్సి ఉంటుంది. ఓసీలు 40శాతం, బీసీ 35, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌మన్‌ కనీసం 30శాతం మార్కులు సాధించాలి. 

ఈ వార్త కూడా చదవండి: పీకే అన్నీ వదులుకుని కాంగ్రెస్‌ కార్యకర్తలా పనిచేస్తారు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement