జనవరి 14న నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం
ఈసారి ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న వారికీ పోటీకి చాన్స్!
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఎన్నికల నిర్వహ ణకు ప్రాథమిక కసరత్తు కూడా కొంత ప్రారంభమైనట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండుగ సమయంలో జనవరి 14న ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేస్తే, ఆ తర్వాత 21 రోజుల్లో (ఫిబ్రవరి మొదటి వారంలో) ఎన్నికలు నిర్వహించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ ఎన్నికలను బ్యాలెట్ పత్రాలతో మూడు విడతల్లో నిర్వహించే విషయంలో మాత్రం ఇప్పటికే ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన అమల్లో ఉండగా... ఈసారి ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్నవారు కూడా పోటీ చేసేందుకు అవకాశం కల్పించనున్నట్టు సమాచారం. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి మండలానికి కనీసం ఐదు గ్రామపంచాయతీలు (ఎంపీటీసీ స్థానాలు) ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. డిసెంబర్ రెండోవారంలో నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాల్లో‡ ఈ రెండు అంశాలపై బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకొనేందుకు పంచాయతీరాజ్‌శాఖ కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం.
బీసీ రిజర్వేషన్లపై మల్లగుల్లాలు
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌పార్టీ హామీ ఇచ్చింది. ప్రస్తుతం గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 22 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. దానిని 42 శాతానికి పెంచడం వల్ల అన్ని రకాల రిజర్వేషన్లు 50 శాతానికి మించుతాయి. దీనివల్ల రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పునకు అడ్డంకిగా మారుతుందన్న అభిప్రా యం కూడా వ్యక్తమవుతోంది. జనాభా మేరకు రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటుచేసి కుల గణనను చేపట్టిన సంగతి విదితమే. తాజా లెక్కలకు అనుగుణంగా బీసీల రిజర్వేషన్ల శాతాన్ని ఖరారు చేస్తూ బీసీ కమిషన్ తుది నిర్ణయం తీసుకోవాలి.
ఆ రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పంపిస్తే.. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీచేస్తుంది. ఈ నోటిఫికేషన్ జారీ అయ్యాక 21 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది. గత జనవరి 31తో సర్పంచ్‌ల పదవీకాలం ముగిసింది. జూలై మొదటివారంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీ, జడ్పీ చైర్‌పర్సన్ల పదవీ కాలం కూడా ముగిసింది. గ్రామపంచాయతీ పాలక మండళ్ల పదవీకాలం ముందుగా ముగిసినందున, ఎన్నికలు కూడా ముందుగా వాటికే నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారని సమాచారం. రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీలు, 538 జడ్పీటీసీలు, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment