నేడు జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ జారీ చేసే అవకాశం
చివరి అంకానికి చేరిన కాళేశ్వరం బరాజ్‌లపై విచారణ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ చివరి అంకానికి చేరింది. ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్న జస్టిస్ చంద్రఘోష్ మంగళవారం నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను పునఃప్రారంభించనున్నారు. ఇప్పటికే ఆయన పలు దఫాలుగా క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించగా, ఇదే తుది విడత క్రాస్ ఎగ్జామినేషన్ కావొచ్చని అధికారవర్గాలు తెలిపాయి. గత క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరుకాలేకపోయిన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావును ఈ దఫాలో కమిషన్ ప్రశ్నించనుంది. దీంతో అధికారుల వంతు పూర్తికానుంది. బరాజ్‌ల నిర్మాణ సంస్థల ప్రతినిధులతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆడిట్ నిర్వహించిన కాగ్ అధికారులను సైతం కమిషన్ ఇదే దఫాలో ప్రశ్నించనుంది. అనంతరం చివర్లో మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, నాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను క్రాస్ ఎగ్జామినేషన్ కోసం కమిషన్ పిలిచే అవకాశం ఉంది.
సోమవారం వీరికి కమిషన్ కార్యాలయం నుంచి సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సంబంధమున్న నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్‌సీలు, ఇతర కీలక ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లతో పాటు ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను ఇప్పటికే కమిషన్ ప్రశ్నించింది. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బరాజ్ లొకేషన్‌ను మార్చడంతో పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణ స్థలాల ఎంపిక, ఇతర అంశాల్లో కేసీఆర్, హరీశ్‌రావు కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఇప్పటికే పలువురు ఇంజనీర్లు, మాజీ ఇంజనీర్లు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కమిషన్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. వీరందరి నుంచి సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా కేసీఆర్, హరీశ్‌రావును కమిషన్ ప్రశ్నించనుంది. కమిషన్ గడువు ఫిబవ్రరితో పూర్తికానుండగా, ఆలోపే ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment