
కాస్తా తగ్గుముఖం పట్టాయనుకున్న ఉష్ణోగ్రతలు.. ఒక్కసారిగా మండిపోతున్నాయి. చల్లబడిందనుకున్న వాతావరణం మళ్లీ.. నిప్పులు వర్షం గుమ్మరిస్తుంది. వాతావరణ శాఖ ముందస్తుగానే హెచ్చరించినట్లు భానుడు భగభగ మండుతున్నాడు. అయితే రానున్న రోజుల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అవకాశముందని, 50 డిగ్రీల వరకు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలో వచ్చే మూడురోజులు వడగాలులు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాబోయే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీస్తాయని పేర్కొంది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీస్తాయని చెప్పింది. అలాగే రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అవకాశం ఉందని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment