Heatwave conditions
-
ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చల్లని కబురు
ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మే నెల రాకతో ఎండలు మరింత ముదరడంతో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు.ఈ తరుణంలో తూర్పు ప్రాంతంలో ఉరుములతో కూడిన గాలివాన కారణంగా రానున్న మూడు రోజుల ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్లలో వేడిగాలులు తగ్గుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం తెలిపింది.రానున్న మూడు రోజుల పాటు వేడిగాలులు ఈ మూడు రాష్ట్రాల్లో కొనసాగుతాయని ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో రాబోయే నాలుగు రోజుల పాటు ఇలాంటి వేడి వాతావరణం కొనసాగుతుందని వెల్లడించారు. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కోస్తా కర్ణాటకలో వడగాలులు వీస్తాయని ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. -
భానుడి భగభగ: మరో ఐదు రోజులు హీట్‌వేవ్
న్యూఢిల్లీ: రానున్న ఐదు రోజుల పాటు తూర్పు, దక్షిణ భారతాల్లో హీట్‌వేవ్ కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. పశ్చిమబెంగాల్, ఒడిషా తీర ప్రాంతాలతో పాటు సిక్కిమ్, కర్ణాటకలో భానుడు నిప్పులు కురిపించనున్నట్లు ఐఎండీ వెల్లడించింది.బీహార్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, రాయలసీమ, తెలంగాణలోనూ హీట్‌వేవ్ ప్రభావం ఉంటుందని తెలిపింది. పశ్చిమబెంగాల్‌కు మాత్రం ఐఎండీ రెడ్అలర్ట్ ఇచ్చింది. అన్ని వయసుల వారు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరింది. అయితే దేశంలోని ఈశాన్య ప్రాంతాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. -
తెలంగాణలో మూడురోజులు వడగాలులు.. వాతావరణశాఖ హెచ్చరిక
కాస్తా తగ్గుముఖం పట్టాయనుకున్న ఉష్ణోగ్రతలు.. ఒక్కసారిగా మండిపోతున్నాయి. చల్లబడిందనుకున్న వాతావరణం మళ్లీ.. నిప్పులు వర్షం గుమ్మరిస్తుంది. వాతావరణ శాఖ ముందస్తుగానే హెచ్చరించినట్లు భానుడు భగభగ మండుతున్నాడు. అయితే రానున్న రోజుల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అవకాశముందని, 50 డిగ్రీల వరకు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలో వచ్చే మూడురోజులు వడగాలులు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాబోయే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీస్తాయని పేర్కొంది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీస్తాయని చెప్పింది. అలాగే రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అవకాశం ఉందని వివరించింది. -
కంపెనీలకు కలిసొచ్చిన కాలం: హీటెక్కిన రూం ఏసీ మార్కెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రూమ్ ఎయిర్ కండీషనర్ల (ఏసీ) మార్కెట్ వేడెక్కింది. వేసవి ముందే రావడం ఇందుకు కారణం. భానుడి ప్రతాపంతో కస్టమర్లు ఏసీలు, రిఫ్రిజిరేటర్ల కోసం ఎలక్ట్రానిక్స్ షాపులకు క్యూ కడుతున్నారు. ఒకప్పుడు లగ్జరీగా భావించిన ఈ ఉపకరణాలు ఇప్పుడు తప్పనిసరి జాబితాలోకి వచ్చి చేరాయని కంపెనీలు అంటున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏసీలు, రిఫ్రిజిరేటర్ల విపణి కొత్త రికార్డులు నమోదు చేయడం ఖాయమని తయారీ సంస్థలు ధీమాగా ఉన్నాయి. హైదరాబాద్ విషయానికి వస్తే 2022 ఫిబ్రవరిలో ఈ నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్. ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఏకంగా 35.6 డిగ్రీల సెల్సియస్ నమోదైందంటే వేసవి ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆల్ టైమ్ హైలో విక్రయాలు.. దేశంలో రూమ్ ఏసీ మార్కెట్ విస్తృతి 5-7 శాతం మాత్రమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 80 లక్షల యూనిట్లు అమ్ముడవుతాయన్న అంచనాలు ఉన్నాయి. 2023-24లో పరిశ్రమ ఏకంగా ఒక కోటి యూనిట్ల మార్కును చేరుకుంటుందని బ్లూ స్టార్ చెబుతోంది. ఇదే జరిగితే భారత రూమ్ ఏసీ మార్కెట్ ఆల్ టైమ్ హై రికార్డులు నమోదు చేసినట్టు అవుతుంది. 2029 నాటికి పరిశ్రమ 4 కోట్ల యూనిట్లను తాకుతుందని డైకిన్ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే కంపెనీలు ఈ సీజన్లో విక్రేతల వద్ద 25 శాతం అధికంగా సరుకు నిల్వ చేశాయి. అంతేగాక తయారీ సామర్థ్యమూ అమ్మకాల తగ్గట్టుగా పెంచుకున్నాయి. భారీగా డిమాండ్ ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో ప్రకటనల బడ్జెట్లనూ అధికం చేశాయని జాన్రైస్ అడ్వర్టైజింగ్, బ్రాండింగ్ డైరెక్టర్ సుమన్ గద్దె తెలిపారు. భారీ అంచనాలతో.. కంపెనీలు ఈ సీజన్లో భారీ అంచనాలతో రెడీ అవుతున్నాయి. 2023 శ్రేణి మోడళ్లతో కస్టమర్లను ఆకట్టుకోవడానికి కసరత్తు చేస్తున్నాయి. బ్లూ స్టార్ ఏకంగా 75 మోడళ్లను రంగంలోకి దింపింది. రూమ్ ఏసీ రంగంలో విలువ పరంగా కంపెనీకి ప్రస్తుతం 13.5 శాతం వాటా ఉంది. 2025 మార్చి నాటికి దీనిని 15 శాతానికి చేర్చాలని లక్ష్యంగా చేసుకుంది. శామ్సంగ్ ఈ సీజన్ కోసం విండ్ ఫ్రీ సిరీస్‌తోపాటు మరో 38 మోడళ్లను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది వేసవి తీవ్రంగా, మరింత ఎక్కువ కాలం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏసీ మార్కెట్ బలమైన డిమాండ్‌తో 30 శాతం వృద్ధి చెందవచ్చని గోద్రెజ్ అప్లయాన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండింతల అమ్మకాలను ఆశిస్తున్నట్టు వెల్లడించారు. రెండంకెల వృద్ధి లక్ష్యంగా చేసుకున్నట్టు హాయర్ ప్రకటించింది. -
చేద్దామా? చద్దామా?
సెకనుకు సుమారు 13.3 హిరోషిమా అణ్వాయుధాలు లేదా రోజుకు 11,50,000 అణ్వాయుధాలు పడితే ఎలా ఉంటుంది? ప్రస్తుతం భూగోళం ఎదుర్కొంటున్న సమస్య ఇంత తీవ్రంగా ఉంది. ఈ మంటలు పుట్టించే వేడికి ఏ దేశమూ మినహాయింపు కాదు. చల్లటి ప్రాంతాలుగా పేరొందిన యూరోపియన్ దేశాలు సైతం ఎండలకు మాడిపోతున్నాయి. ఇంకోవైపు కనీవినీ ఎరుగని స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. వాతావరణం అదుపు తప్పిందన్నది నిజం. ఎప్పటికో అనుకున్నది ఇప్పటికే వచ్చేసింది. కొందరు నమ్ముతున్నట్టు ఏ కొత్త టెక్నాలజీనో వచ్చి అమాంతం సమస్యను పరిష్కరించలేదు. ప్రభుత్వాల స్థాయిలో, వ్యక్తిగత స్థాయిలో చర్యలు మొదలుకావాలి. లేదంటే, ‘వాతావరణ ఆత్మహత్యలే’ శరణ్యం. విపరీత వాతావరణం పుణ్యమా అని గత వారంలో స్పెయిన్, పోర్చుగల్‌లలో వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చు. బ్రిటన్‌లోనైతే రికార్డులు బద్దలు కొడుతూ 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించేశారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరస్ ఈ వడగాడ్పులను సామూహిక ఆత్మహత్యలకు ఏమాత్రం తీసిపోని పరిణామమని హెచ్చరించారు. వాతావరణ మార్పుల మీద జరిగిన రెండు రోజుల సమావేశంలో 40 దేశాలకు చెందిన మంత్రులతో మాట్లాడుతూ... ‘‘మానవాళిలో సగం ఇప్పటికే వరదలు, కరవులు, తుపాన్లు, కార్చిర్చుల ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ ప్రమాదం నుంచి ఏ దేశానికీ మినహాయింపు లేదు. అయినా మనం శిలాజ ఇంధనాల వ్యసనాన్ని కొనసాగి స్తున్నాం. ఇప్పుడు మన ముందు ఒక అవకాశం ఉంది. కలిసికట్టుగా సమస్యను అధిగమించే ప్రయత్నం చేద్దామా? లేక అందరమూ కలిసికట్టుగా ఆత్మహత్య చేసుకుందామా? నిర్ణయం మన చేతుల్లోనే ఉంది’’ అని వ్యాఖ్యానించారు. ప్రకృతి వైపరీత్యాల ప్రకోపం పతాక స్థాయికి చేరిన ఈ తరుణంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి హెచ్చరిక అనూహ్యమేమీ కాదు. ఎవరో అన్నట్లు... ఇవి వాతావరణ మార్పులు కాదు, ‘వాతావరణ ఆత్మహత్యలు’. యూరప్, ఉత్తర అమెరికాల్లో చాలా భాగాల్లో కార్చిచ్చులు కలవరపెడుతున్నాయి. ఇంకోవైపు భారత్‌లో కనీవినీ ఎరుగని స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. ధ్రువ ప్రాంతాల్లో ఏటికేడాదీ కుంచించుకుపోతున్న మంచు! అదే సమ యంలో ఆఫ్రికాలోని పలు ప్రాంతాల్లో కరవు పరిస్థితులు! ఇవన్నీ చూస్తే ప్రపంచ వాతావరణం అదుపు తప్పినట్లే కనిపిస్తోంది. వాతా వరణ మార్పుల ప్రభావం ఎలా ఉంటుందో తెలిసినప్పటికీ... ఎప్పుడో వస్తున్నాయనుకున్నవి ఇప్పుడే వచ్చేస్తూండటం, జరుగు తున్న నష్టం తీవ్రంగా ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఒహాయో యూనివర్సిటీ మాజీ గణిత శాస్త్రవేత్త ఇలియట్ జాకబ్సన్‘వాచింగ్ ద వరల్డ్ గో బై’ పేరుతో ఓ లెక్క చెప్పారు. ‘‘ఈ గ్రహంపై సెకనుకు 13.3 హిరోషిమా అణు బాంబులు పేలితే పుట్టేంత వేడి పుడుతోంది. అంటే రోజుకు 11,50,000 అణు బాంబులంత వేడన్నమాట’’ అని విస్పష్టంగా పేర్కొన్నారు. సముద్ర జలాల ఉష్ణోగ్రతలు కూడా సెకనుకు 12 హిరోషిమా అణుబాంబుల స్థాయిలో పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. తలుచుకుంటేనే భయం పుట్టే స్థాయి. అయినా సరే, మనం కలిసికట్టుగా పనిచేసేం దుకు సిద్ధంగా లేము. అందుకేనేమో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి కూడా ప్రభుత్వాలు చెప్పేదొకటీ, చేసేది ఇంకోటీ అని నిష్టూరమాడారు. పచ్చిగా మాట్లాడాల్సి వస్తే దేశాలన్నీ అబద్ధాలు చెబుతున్నాయన్నారు. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ తాజా నివేదిక విడుదలైన సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఈ శతాబ్దాంతానికి భూమి సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ పెరగకూడదనుకుంటే... 2022 నాటికి కర్బన ఉద్గారాలు పతాకస్థాయికి చేరాలని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఇంకోలా చెప్పాలంటే, 2023 నుంచి ఉద్గారాలు గణనీయంగా తగ్గాలే తప్ప మరి పెరగకూడదన్నమాట. అయితే వాస్తవ పరిస్థితులు దీనికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. కానీ సమయమేమో మించిపోతోంది. హెచ్చరికలు బేఖాతరు... వాతావరణం మనకిప్పటికే అన్ని రకాల హెచ్చరికలు చేస్తున్నా అన్నీ బేఖాతరవుతున్నాయి. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, ఆర్థిక వేత్తలు, శాస్త్రవేత్తలు, మీడియా ప్రతినిధులు కూడా నిమ్మకు నీరెత్తి నట్లు వ్యవహరిస్తున్నారు. సమాజాన్ని ప్రభావితం చేయగల వీరు ఇస్తున్న సందేశమేమిటి? ఏం ఫర్వాలేదు; కొత్త కొత్త టెక్నాలజీ లొస్తున్నాయి; వాతావరణ సమస్యలకు ఇవి సమాధానం చెబుతాయి; అందోళన అనవసరం అని! ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత ప్రకృతి వైపరీ త్యాలకూ వాతావరణ మార్పుల ప్రభావానికీ సంబంధం లేదని కూడా కథనాలు వెలువడుతున్నాయి! అంతేకాకుండా... ఆర్థికాభివృద్ధి పేరుతో ప్రకృతి వనరుల విధ్వంసాన్ని కూడా కొందరు సమర్థించుకుంటున్నారు. ఈ రకమైన ఆర్థిక విధానాలకు ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శిలాజ ఇంధనాలను త్యజించాలన్న డిమాండ్ పెరుగుతోంది కూడా. ప్రధాన స్రవంతిలోని ఆర్థికవేత్తలకు భిన్నంగా ఆలోచిస్తున్న బ్రిటిష్ మంత్రి జాక్ గోల్డ్ స్మిత్ ఒక ట్వీట్ చేస్తూ... ‘‘యూరప్ మొత్తమ్మీద కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. ఉష్ణోగ్రతల రికార్డులు బద్ధలవు తున్నాయి. అడవులు, పర్యావరణ వ్యవస్థలు కూడా రికార్డు వేగంతో నశించిపోతున్నాయి. అయినా పర్యావరణ పరిరక్షణకు డబ్బులు ఖర్చు చేయడం ఏమంత లాభదాయకం కాదనే రాజకీయ నేతలు మళ్లీ పదవులకు ఎన్నికవుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ –కీ మూన్ గతంలో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, వాతావరణ విధ్వంసానికి కారణమవుతున్న ఆర్థిక విధానాలను చక్కదిద్దే నాయకత్వపు అవసరం ఇప్పుడు ఎంతైనా ఉందని చెప్పడం ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఈ సమస్యకు పరిష్కారం కూడా ఇదేననీ, రాజకీయ నేతలు ఈ గట్టి నిర్ణయం తీసుకోలేకపోతున్నారనీ నా నమ్మకం కూడా. అభివృద్ధికి సూచిక స్థూల జాతీయోత్పత్తి అన్న వ్యామోహం నుంచి బయటపడనంత వరకూ వాతావరణ సమస్య లకు పరిష్కారం లభించనట్లే. మనకిష్టమైనా, కాకపోయినా సరే... ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం సమాజంలో అంతరాలను పెంచిం దన్నది మాత్రం నిజం. అంతేకాకుండా... పర్యావరణ సమస్యలను తెచ్చిపెట్టిందీ, ప్రపంచం అంతరించిపోయే స్థితికి చేర్చింది కూడా ఇవే. కాబట్టి ఆర్థిక వ్యవస్థ సమూల ప్రక్షాళన తక్షణావసరం. ప్రస్తుత అస్తవ్యస్త వ్యవహారం ఇకపై ఎంతో కాలం కొనసాగే అవకాశాలు లేవు. బహుశా ప్రస్తుతం వీస్తున్న వడగాడ్పులు ఓ షాక్ థెరపీనేమో. మానవాళి మేల్కొనేందుకు అవసరమైనదే కావచ్చు. నిర్మాణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాల్సిన అవసరాన్ని గుర్తుచేసే సందర్భమూ ఇదే. ఎందుకంటే, ఇది పోతే ఇంకోటి ఉందిలే అని భూమి గురించి అనుకోలేము కదా! కర్బన ఉద్గారాలకు, వాతావరణ సమస్యలకు, సంపద సృష్టికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందన్నది నిర్వివాదాంశం. ఆర్థికాభివృద్ధి ఎంత ఎక్కువైతే, అంతేస్థాయిలో కర్బన ఉద్గారాలూ పెరుగుతాయి. స్థూలజాతీయోత్పత్తిని పెంచు కోవాలన్న తపనలో భూమి వేడి కూడా పెరిగిపోతోంది. ఈ నేపథ్యం లోనే మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీకి చెందిన డాక్టర్ హెర్మన్ డాలీ ‘స్టెడీ స్టేట్ ఎకానమీ’కి మద్దతిచ్చారు. ‘‘ప్రతి రాజకీయ నాయ కుడూ వృద్ధికి అనుకూలంగా ఉన్నాడు. అర్థం చేసుకోదగ్గ విషయమే. కానీ అసలు ప్రశ్నకు సమాధానం మాత్రం దాటవేస్తారు’’ అని ఆయన పేర్కొన్నారు. అయితే, వృద్ధి మనల్ని నిజంగానే ధనవంతులను చేస్తోందా? లేక లాభాలకంటే ఖర్చుల్ని ఎక్కువ చేస్తోందా? అన్నది కూడా ఆలోచించాలి. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థను సమర్థిస్తున్న వారు సమాధానమివ్వాల్సిన ప్రశ్న కూడా ఇదే. ఆర్థికవేత్తల ఆలోచనలు ఎలా ఉన్నా, సామాన్యుల వ్యవహారశైలిలోనూ కొన్ని మార్పులు అని వార్యం. వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల ప్రభా వాన్ని తగ్గించుకోవచ్చు. వాతావరణ సమస్య మనం సృష్టించింది కాకపోయినా, ఇప్పటివరకూ కొనసాగడంలో మాత్రం మనవంతు భాగస్వామ్యం తప్పకుండా ఉంది. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
Europe Heatwave: వేడి పుడుతోంది...
ఇది కనివిని ఎరుగని పరిస్థితి. నిత్యం చల్లగా, హాయిగా ఉంటాయని పేరుపడ్డ ప్రాంతాలు కూడా ఇప్పుడు చండభానుడి దెబ్బకు చేతులెత్తేస్తున్నాయి. నిన్నటి దాకా వేసవిలో ఉష్ణపవనాల తాకిడికి భారత్ లాంటి అనేక దేశాలు అల్లాడితే, నేడు ఐరోపా ఖండం వంతు. కొద్దిరోజులుగా స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్ తదితర ప్రాంతాల్లో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు పాత రికార్డులను బద్దలుకొట్టి, కొత్త చరిత్ర రాస్తున్నాయి. అయిదేళ్ళ క్రితం దాకా జూలైలో సగటున 20 డిగ్రీల సెల్సియస్ ఉండే బ్రిటన్‌లో ఇప్పుడది 40 దాటేసింది. ఉడుకెత్తిస్తున్న ఈ ఉష్ణపవనాలు ఇక తరచూ తప్పవట. కనీసం మరో 40 ఏళ్ళ పాటు 2060ల వరకు ఈ ధోరణి కొనసాగుతుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరిక. రెండు నెలల క్రితం ఫ్రాన్స్‌లో మునుపెన్నడూ లేనంత అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన మే నెల ఎదురైంది. మళ్ళీ గత నెల కూడా ఫ్రాన్స్ నిప్పులకొలిమి అయింది. ఈసారి ఉష్ణపవనాలు స్పెయిన్, ఇటలీ సహా అనేక దేశాలను అల్లాడించాయి. ఈ నెలలో పోలండ్, తూర్పు ఐరోపాలోని ఇతర ప్రాంతాలు అత్యధిక ఉష్ణోగ్రత బారినపడ్డాయి. జూలై 19న బ్రిటన్‌లో కనివిని ఎరుగని ఉష్ణతాపం కనిపించింది. ప్రసిద్ధ లండన్ హీత్రూ విమానాశ్రయంలో భానుప్రతాపం 40 డిగ్రీలు దాటేసింది. ఇప్పటికే ఐరోపాలో అల్లాడుతున్న ప్రజానీకానికి మరో రెండు నెలలైతే కానీ వేసవి ముగియదని గుర్తొచ్చినప్పుడల్లా గుండె గుభేలుమంటోంది. భరించలేని వేడి, ఉక్కపోతల బాధ అలా ఉంటే, వేడిగాలుల దెబ్బకు ఫ్రాన్స్, గ్రీస్, పోర్చుగల్, స్పెయిన్ – ఇలా అనేక ప్రాంతాల్లో కార్చిచ్చులు రేగడం మరో పెనుసమస్యయింది. వేలకొద్దీ ఎక రాల భూమి, పంట అగ్నికీలలకు ఆహుతి అవుతున్నాయి. మంటల్ని అదుపులో ఉంచడం అగ్ని ప్రమాద నివారక బృందాలకు నిత్యపోరాటమైంది. మంటలతో పాటు దట్టమైన పొగ ఉక్కిరిబిక్కిరి చేస్తుండడంతో వేలాదిగా ప్రజల్ని అక్కడ నుంచి ఖాళీ చేయిస్తున్న పరిస్థితి. క్రూరమైన ఎండల తాకిడికి చెలరేగిన మంటలతో లండన్‌లో అగ్నిప్రమాద నివారక బృందాలు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మునుపెన్నడూ లేనంత బిజీగా మొన్న మంగళవారం గడిపాయట. ఇంతటి ఎండలను తట్టుకొనేలా నిర్మించకపోవడంతో బ్రిటన్‌లో రోడ్లు, రైలు పట్టాలు, తీగలు, సిగ్నలింగ్ వ్యవస్థలు దెబ్బతిని, రవాణా వ్యవస్థకు ఆటంకాలు ఎదురయ్యాయి. స్కూళ్ళు, ఆఫీసులు మూతబడ్డాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అమెరికాలోనూ వేడిగాలులు విలయం సృష్టిస్తున్నాయి. అక్కడ శరవేగంతో వృద్ధి చెందుతున్న నగరాల్లో కోటికి పైగా జనాభా ఉక్కపోతతో మగ్గిపోతున్నారు. టెక్సస్, క్యాలిఫోర్నియా, అలాస్కా – ఇలా కనీసం 13 రాష్ట్రాల్లో దాదాపు వంద కార్చిచ్చుల్లో 30 లక్షలకు పైగా ఎకరాలు బూడిదయ్యాయి. వాతావరణ సంక్షోభ రీత్యా దేశంలో తక్షణం ‘జాతీయ వాతావరణ ఎమర్జెన్సీ’ని ప్రకటించాలని బుధవారం పలువురు సెనేటర్లు సైతం కోరాల్సి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు ఎమర్జెన్సీ ప్రకటి స్తారో, లేదో కానీ, యమ అర్జెంటుగా కొత్త చర్యలకు దిగక తప్పదు. పునరుద్ధరణీయ ఇంధన విధా నాలనూ, పర్యావరణ అనుకూల రవాణా పద్ధతులనూ అనుసరించేలా సత్వర ఆదేశాలిస్తేనే ఫలితం. ఈ దుష్పరిణామాల పాపంలో ప్రపంచ దేశాలన్నిటికీ వాటా ఉంది. కర్బన ఉద్గారాలను తగ్గించుకోవాలన్న లక్ష్యంలో ఇప్పటికీ అమెరికా, చైనా సహా అగ్ర రాజ్యాలు వెనుకబడే ఉన్నాయి. వర్ధమాన దేశాలకు లక్ష్యాలు పెట్టడమే తప్ప, స్వయంగా పెద్దన్నలు చేస్తున్నది తక్కువే. గత రెండే ళ్ళుగా బ్రిటన్‌లో ఆగస్ట్ వాతావరణం మారి, కూలర్లు, ఏసీలు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. రోడ్లు కుంగి, ఇంటి గాజు పైకప్పులు కరిగిపోతూ నిత్యం 40 – 45 డిగ్రీలుండే సూడాన్ లాగా బ్రిటన్ మండిపోతుంటే, వాతావరణంపై అత్యవసర సమావేశానికి హాజరు కాకుండా, ప్రభుత్వ ఖర్చుతో వీడ్కోలు విందు ఇచ్చే పనిలో ఆ దేశ ప్రధాని ఉన్నారంటే ఎంత దౌర్భాగ్యం? ఉప ప్రధాని ఏమో విషయ తీవ్రతను వదిలేసి, ‘ఎండల్ని ఎంజాయ్ చేయండి’ అన్నారంటే ఇంకేమనాలి? ఆసియా, ఆఫ్రికా, ఐరోపాల్లో ప్రమాదస్థాయిని మించి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సంగతిని ‘నాసా’ సైతం తాజాగా ధ్రువీకరించింది. గ్రీన్హౌస్ వాయువుల విడుదలతో మన పుడమి ఇంటిని మనమే నాశనం చేసుకుంటున్నామని ఐరాస ప్రపంచ వాతావరణ సంస్థ నెత్తీనోరూ బాదు కుంటోంది. ఏటేటా పెరుగుతున్న ఈ ఉష్ణపవనాలతో లండన్, ఢిల్లీ సహా ప్రపంచంలో కనీసం 10 ప్రధాన నగరాల్లో భవిష్యత్తులో తాగడానికి చుక్కయినా భూగర్భ జలాలు లేకుండా పోతాయని ఓ తాజా నివేదిక. ‘డే జీరో’ అని ప్రస్తావించే ఆ రోజు ఎంతో దూరంలో లేదట. మరో మూడేళ్ళలోనే ఈజిప్ట్ రాజధాని కైరోలో, పాతికేళ్ళలో లండన్‌లో ఇలాంటి పరిస్థితి వస్తుందట. 2018లోనే కేప్ టౌన్ నగరంలో ఇలా పరిస్థితి పీకల మీదకొచ్చింది. చివరకు ‘డే జీరో’ను నివారించేందుకు ఆ నగరంలో నీటి వినియోగాన్ని సగానికి తగ్గిస్తూ, అత్యవసర చర్యలు అమలుచేయాల్సి వచ్చింది. ఇవన్నీ గమనించైనా చేతులు కాలక ముందే తెలివితెచ్చుకోవడం ప్రపంచ దేశాలకు మేలు. భూగోళం వేడెక్కుతోంది. కార్చిచ్చుల దెబ్బకు ఫ్రాన్స్‌లో వేలమంది ఇల్లూవాకిలి పోయిన వేళ, ఆ వేడి పాశ్చాత్య ప్రపంచానికీ తెలిసొస్తోంది. ఇకనైనా దేశాలన్నీ సమష్టిగా కదిలితే మంచిది. త్రికరణశుద్ధిగాæపర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టకపోతే, రాబోయే రోజుల్లో చండప్రచండ తాపం ఎవరినీ వదిలిపెట్టదు. అందరి సరదా తీర్చేస్తుంది. పారాహుషార్! -
ఈ ఏడాది వేసవి బాధించదు: ఐఎండీ
న్యూఢిల్లీ: ఈ ఏడాది వేసవి అంతగా బాధించే అవకాశాల్లేవని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఉత్తర భారతంలో గరిష్ట స్థాయి ఉష్ట్రోగతలు తక్కువగానే నమోదవుతాయని మంగళవారం వెల్లడించింది. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, బిహార్లలో మార్చి నుంచి మే వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతాయని తెలిపింది. తూర్పు, ఈశాన్య, ఉత్తర భారతం, గంగా నది మైదాన ప్రాంతాల్లో వడ గాడ్పులు సాధారణం కంటే తక్కువగానే ఉంటాయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్రో చెప్పారు. పశ్చిమ, వాయవ్య భారతాన్ని ఈ వేసవిలో వడగాడ్పులు బాధిస్తాయని, కానీ ఉత్తర భారతంలో అంతగా ఉండవని తెలిపారు. -
అక్కడ బయటికి వస్తే అంతే..
పట్నా : ఉత్తరాదిలో భానుడి భగభగలకు జనం విలవిలలాడుతున్నారు. బిహార్‌లో వేసవి తాపానికి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. వడగాడ్పులతో బిహార్‌లో ఇప్పటివరకూ 117 మంది మరణించారు. మండే ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతుండటంతో గయ జిల్లాలో మేజిస్ర్టేట్ అభిషేక్ సింగ్ 144 సెక్షన్ విధించారు. ప్రజలు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఇండ్లలోనే ఉండాలని అధికారులు ఆదేశించారు. ఈ సమయంలో నిర్మాణ పనులపై కూడా జిల్లా యంత్రంగా నిషేధం విధించింది. ఇక గత 48 గంటల్లో కేవలం ఔరంగాబాద్‌లో 60 మంది మరణించగా, ముంగర్‌లో అయిదుగురు మృత్యువాతన పడ్డారు. గయంలో వడగాడ్పులకు 35 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. ఎండ తీవ్రతతో ఉపాధి పనుల సమయాలను కూడా సవరించారు. ఉదయం 10.30 గంటల తర్వాత ఎలాంటి పనులు చేపట్టరాదని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలకు సెలవలను ఈనెల 22 వరకూ పొడిగించారు. కాగా మృతుల కుటుంబాలకు రూ 4 లక్షల పరిహారం అందచేయనున్నట్టు బిహార్ సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు. అత్యవసర పనులైతేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని, ఎండబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
మండుతున్న తెలంగాణ
హైదరాబాద్: తెలంగాణ నిప్పుల కొలిమిలా మండుతోంది. భానుడి ప్రతాపానికి తట్టుకోలేక ఇప్పటివరకు 35మంది మృతి చెందారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదయ్యాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రానున్నమరో ఐదు రోజుల వరకు ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగే అవకాశముంది. రానున్నమరో రెండు రోజుల పాటు వడగాల్పుల ప్రభావం రాష్ట్ర వాప్తంగా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు సమాచారాన్ని తన వెబ్ సైట్ లో పొందుపరిచింది. అత్యధిక ఉష్ణోగ్రత నిజామాబాద్ లో నమోదైంది. మండుతున్న ఎండలు, తల్లిదండ్రుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు ముందుగానే ఈనెల 16 నుంచి వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది.