ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : విమానయాన, రక్షణ రంగాల్లో భారతదేశం అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా అవతరిస్తోంది. విమానయాన రంగంలో అతివేగంగా ఎదుగుతున్న దేశాల్లో భారత్ మూడోస్థానంలో ఉంది. మిలటరీ ఆధునీకరణకు వచ్చే ఐదేళ్లలో రూ.9.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో రక్షణరంగంలో స్వయం సమృద్ధి సాధించడం లక్ష్యంగా ప్రైవేటు పెట్టుబడులకు దారులు తెరవడంతో అనేక విదేశీ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్స్ (ఓఈ ఎం) భారతీయ కంపెనీలతో వ్యూహాత్మక భాగ స్వామ్యం కుదుర్చుకుంటున్నాయి. మరోవైపు విమానయాన, రక్షణ రంగాల్లో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని... వీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ ప్రభు త్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడుల ఆకర్షణకు అవసరమైన విధానాలు, మౌలిక వసతులు, శిక్షణ వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఏరోస్పేస్ యూనివర్సిటీ...
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో పేరొందిన పలు అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రానికి రావడంతో తెలంగాణ ‘ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్’గా రూపు దిద్దుకుంటోంది. లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్, సాఫ్రాన్, టాటా, ప్రాట్ విట్నీ, జీఈ, కొలిన్స్ ఏరోస్పేస్, ఐఏఐ, థేల్స్, ఆదాని, రఫేల్ వంటి సంస్థలు రాష్ట్రం లో ఇప్పటికే భారీ పెట్టుబడులు పెట్టాయి. వివిధ ఏరోస్పేస్ పార్కుల్లో స్థలం కేటాయింపు, టీఎస్‌ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే పారిశ్రామిక అనుమతులు, రూ.200 కోట్లకు పైబడిన పెట్టుబడులతో వచ్చే కంపెనీలకు రాయితీలు తదితరాలపై ప్రత్యేక ఏరోస్పేస్, డిఫెన్స్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. విమానయాన, రక్షణ పరికరాల ఉత్పత్తులకు అవసరమైన మానవ వనరులను అందించేందుకు ప్రపంచస్థాయి నైపుణ్య శిక్షణ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ప్రఖ్యాత శిక్షణ సంస్థలు ఎంబ్రీ రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ (యూఎస్), క్రేన్‌ఫీల్డ్ యూనివర్సిటీ (యూకే), ఏరో క్యాంపస్ అక్వెంటైన్ (ఫ్రాన్స్) భాగస్వామ్యంతో అందరికీ అందుబాటులో ఉండే ఫీజుతో ఏరోస్పేస్, డిఫెన్స్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. వీటితో పాటు తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా కొత్త పరిశ్రమల్లో పనిచేసే సిబ్బందికి శిక్షణ ఇస్తారు. ఇదిలా ఉంటే ప్రపంచస్థాయి ఏరోస్పేస్ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఆవిష్కరణలు.. స్టార్టప్‌లకు ప్రోత్సాహం
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో ఆవిష్కరణలు, స్టార్టప్‌ల వాతావరణం ప్రోత్సహించేలా పరిశ్రమల శాఖ ప్రణాళికలు సిద్దం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ టెక్నాలజీ ఇంక్యుబేటర్ ‘టీ హబ్’అమెరికాకు చెంది న బోయింగ్, ప్రాట్ విట్నీ, కొలిన్స్‌ఏరోస్పేస్‌వంటి వంటి సంస్థలతో స్టార్టప్‌ల కోసం భాగస్వామ్యం కుదుర్చుకుంది. అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్ ‘టీ వర్క్స్’లో దేశీయ ఏరోస్పేస్, డిఫెన్స్ హార్డ్‌వేర్ స్టార్టప్‌లు పురుడు పోసుకునే అవకాశం ఉంది.
మరో రెండు ఏరోస్పేస్ పార్కులు
మౌలికవసతుల పరంగా చూస్తే రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు ఏరోస్పేస్ పార్కులతో పాటు, రెండు హార్డ్‌వేర్ పార్కులు, 50 జనరల్ ఇంజనీరింగ్ పార్కులు ఉన్నాయి. వీటితో పాటు పలు ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు, హార్డ్‌వేర్ పార్కులు, టెక్నాలజీ పార్కులు, ఎస్‌ఈజెడ్‌లు కూడా ఏవియేషన్, డిఫెన్స్ రంగాల అవసరాలను తీరుస్తున్నాయి. ఈ రంగంలో వస్తున్న డిమాండ్‌ను తట్టుకునేందుకు మరో రెండు ఏరోస్పేస్, డిఫెన్స్ పార్కులను ఏర్పాటు చేయాలని రాష్ట ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్రంలో విమాన, రక్షణ రంగ పరిశ్రమలు
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో
పెద్ద కంపెనీలు 25
ఎంఎస్‌ఎంఈలు 1,000 పైగా
Comments
Please login to add a commentAdd a comment