
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి పరీక్షలను ఈసారి షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం కష్టమ య్యేలా కనిపిస్తోంది. కరోనా థర్డ్ వేవ్ వల్ల విద్యా సంస్థల రీ ఓపెనింగ్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసు కోకపోవడం, ప్రత్యక్ష తరగతులు ఆలస్యంగా మొద లవ్వడం, సిలబస్ పూర్తవ్వక పోవడంతో పరీక్షలు కొంత ఆలస్యమయ్యే వీలుందని అధికారులు భావిస్తున్నారు. దీని దృష్ట్యా మార్చిలో కాకుండా ఏప్రిల్ చివరి వారంలో పరీక్షలు నిర్వహించే వీలుందని సంకేతాలు వస్తున్నాయి.
50% సిలబస్ పూర్తి..
వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలల్లో జనవరి చివరి నాటికి 60% సిలబస్ పూర్తవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు 50% పూర్త యినట్టు అధికారులు చెబుతున్నారు. స్కూళ్లు రీ ఓపెన్ చేసినా ఫిబ్రవరి రెండో వారం వరకు క్లాసులు జరిగే అవకాశం కన్పించట్లేదు. సైన్స్, లెక్కలు, సోషల్ స్టడీస్‌లో ముఖ్యమైన చాప్టర్లతో పాటు రివిజన్ పూర్తయితేనే విద్యార్థులు తేలికగా పరీక్షలు రాయగలరు. సిలబస్ పూర్తవక పోవడం, సంక్రాంతి సెలవుల ప్రభావం పరీక్షలపై పడొచ్చని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు.
ఫీజు గడువు ఈ నెల 29నే ముగియాల్సి ఉన్నా..
టెన్త్ పరీక్ష ఫీజు గడువును పొడిగించేందుకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అంగీకరించినట్టు తెలిసింది. వాస్తవానికి జనవరి 29తోనే గడువు ముగుస్తున్నా సంక్రాంతి సెలవులు పొడిగించడంతో టీచర్లు అందుబాటులో ఉండరన్న ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తిపై సానుకూలంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఫీజు గడువును ఫిబ్రవరి మొదటి వారం వరకూ పొడిగించే వీలుంది.
పరీక్షలకు కొంత సమయం అవసరం
గతేడాదితో పోలిస్తే ఈసారి టెన్త్ విద్యార్థుల పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. కాకపోతే స్కూళ్లు ఆలస్యంగా మొదలవడం, సెలవులు పొడిగింపు వల్ల సిలబస్ అనుకున్నమేర పూర్తి కాలేదు. ఇకపై రెగ్యులర్‌గా స్కూళ్లు నడిస్తే ఇది పెద్ద సమస్యేమీ కాదు. కాకపోతే పరీక్షలకు విద్యార్థులకు కొంత సమయం అవసరం. – పి.రాజభాను చంద్రప్రకాశ్
(హెచ్‌ఎంల సంఘం అధ్యక్షుడు)