కొత్తగా 5 చోట్ల ఏర్పాటుకు సన్నాహాలు
పోచంపల్లి, గద్వాల సహా ఇతర ఉత్పత్తుల విక్రయాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో తయారయ్యే నేత వస్త్రాలను పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోనూ విక్రయించేందుకు తెలంగాణ చేనేత సహకార సంస్థ (టెస్కో) సన్నాహాలు చేస్తోంది. సంస్థ కార్యకలాపాల విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఏపీలోనూ కొత్తగా ఐదు ప్రదర్శన, విక్రయశాలలు (షోరూంలు) ఏర్పాటు చేయనుంది. మరోవైపు ఆన్‌లైన్ విక్రయాలకు వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని మరిన్ని విభిన్న డిజైన్లు, ఉత్పత్తులను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. తద్వారా నేత రంగంపై ఆధారపడిన కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని టెస్కో వర్గాలు చెబుతున్నాయి.
దక్షిణాదిలో విక్రయాలపై కూడా దృష్టి
టెస్కో పరిధిలో దేశవ్యాప్తంగా 32 షోరూమ్‌లు ఉన్నాయి. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తొమ్మిది, రాష్ట్రంలోని ఇతర చోట్ల 15 షోరూమ్‌లు ఉన్నాయి. ఏపీ పునర్విభజనకు ముందు ఉమ్మడి చేనేత సహకార సంస్థ ఆప్కో పరిధిలో ఉన్న మరో ఎనిమిది షోరూమ్‌లు కూడా టెస్కో పరిధిలోకి వచ్చాయి. టెస్కో ఆధ్వర్యంలో ప్రస్తుతం న్యూఢిల్లీలో 3, ముంబైలో 2, కోల్‌కతా, ఔరంగాబాద్, కాన్పూర్‌లో ఒక్కో షోరూమ్ ఉంది.
రాష్ట్రం బయట ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రమే టెస్కో షోరూమ్‌లు ఉండటంతో దక్షిణాదిపై దృష్టి సారించి అందుకు అనుగుణంగా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. టెస్కో అధికారుల బృందం ఇప్పటికే ఏపీలోని విజయవాడ, నెల్లూరు, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నంలో పరిశీలించి షోరూమ్‌ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను ఎంపిక చేసింది. తమిళనాడు, కర్ణాటకలోనూ తెలంగాణ వస్త్రోత్పత్తును విక్రయించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఏడు క్లస్టర్లలో వస్త్రోత్పత్తులు
ప్రస్తుతం తెలంగాణలో ఏడు చేనేత క్లస్టర్లు గద్వాల, నారాయణపేట, పోచంపల్లి, సిద్దిపేట, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్‌లో నేత కార్మికులు వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నారు. గద్వాలలో కాటన్, సిల్క్, సీకో, పైటాన్, నారాయణపేటలో కాటన్, సిల్క్, పోచంపల్లిలో టై అండ్ డై, కాటన్, సిల్క్ డ్రస్ మెటిరీయల్, పట్టుచీరలు, డ్రస్ మెటీరియల్స్, ఇక్కత్ ఉత్పత్తులు ఉన్నాయి. సిద్దిపేటలో గొల్లభామ, వరంగల్ ఢర్రీస్, కరీంనగర్ లుంగీలు, టవల్స్, మహబూబ్‌నగర్ ఊలు ఉత్పత్తులకు పేరొందాయి. మహదేవ్‌పూర్‌లో తయారయ్యే టస్సర్ సిల్క్‌కు మంచి ఆదరణ ఉంది. ప్రస్తుతం టెస్కో షోరూమ్‌లలో 233 రకాల విభిన్న వస్త్రోత్పత్తులకు సంబంధించి ఏటా రూ.30 కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నాయి.
ఆన్‌లైన్ విక్రయాలపై టెస్కో దృష్టి
టెస్కో అనుసరిస్తున్న ‘ఈ–మార్కెటింగ్’కు ఆదరణ పెరుగుతుండటంతో ఆన్‌లైన్ విక్రయాలపైనా టెస్కో దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా ఏటా సగటున రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఉత్పత్తులు అమ్మకం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ వస్త్ర ఉత్పత్తులన్నింటినీ ఆన్‌లైన్‌లో విక్రయించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment