మేరా మహబూబ్‌నగర్‌.. మహాన్‌!  | Town of Mahabubnagar is 131 Years Old | Sakshi
Sakshi News home page

మేరా మహబూబ్‌నగర్‌.. మహాన్‌! 

Published Sat, Dec 4 2021 11:44 AM | Last Updated on Sat, Dec 4 2021 12:55 PM

Town of Mahabubnagar is 131 Years Old - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: సర్వమత సహనానికి ప్రతీకగా విలసిల్లిన మహబూబ్‌నగర్‌ పట్టణం ఆవిర్భవించి శనివారం నాటికి 131 ఏళ్లవుతోంది. గంగా జమున తహజీబ్‌కు ఆలవాలంగా ప్రముఖులతో కీర్తింపబడుతున్న ఈ ప్రాంతంలో పాలు, పెరుగు సమృద్ధిగా లభించేవని, చుట్టూర ఉన్న అడవుల్లో పాలుగారే చెట్లు అధికంగా ఉండేవని, అందుకే ఈ పట్టణంలోని కొంత భాగాన్ని చరిత్రలో పాలమూరు, రుక్కమ్మపేట అనే వారని వేర్వేరు కథనాలు ఉన్నాయి. ఈ పట్టణానికి మహబూబ్‌నగర్‌ను ఆసఫ్‌జాహి వంశస్థుడైన ఆరో నిజాం నవాబు మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ బహద్దూర్‌ పేరుతో నామకరణం చేశారు.


                             ఆసఫ్‌జాహి కాలంలో నిర్మించిన ఇప్పటి కలెక్టరేట్‌ భవనం 

ఈ ప్రాంతాన్ని పరిపాలించిన ఆసఫ్‌జాహి రాజులు 1890 డిసెంబర్‌ 4న మహబూబ్‌నగర్‌గా మార్చారని చరిత్రకారులు పేర్కొన్నారు. శాతవాహన, చాళుక్యరాజుల పాలన అనంతరం గోల్కొండ రాజుల పాలన కిందికి వచ్చింది. 1518 నుంచి 1687 వరకు కుతుబ్‌షాహి రాజులు, అప్పటి నుంచి 1948 వరకు ఆసఫ్‌జాహి నవాబులే పాలించారు. చివరకు సెప్టెంబర్‌ 17న నైజాం సారథ్యంలోని హైదారాబాద్‌ రాష్ట్రాన్ని జాతీయ స్రవంతిలో కలిపిన సందర్భంగా ఇక్కడ ఉన్న భవంతులు, భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వివిధ కార్యాలయాలకు వినియోగిస్తోంది. 



నిజాం భవనాలే ప్రభుత్వ కార్యాలయాలు  
నిజాం హయాంలో నిర్మించిన భవనాలను జిల్లా కేంద్రంలో పలు ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగిస్తున్నారు. వాటిలో అత్యధిక భవంతులు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. వాటిలో కలెక్టరేట్‌ సముదాయ భవనం, తహసీల్దార్‌ కార్యాలయం, జిల్లా కోర్టుల సముదాయం, జిల్లా ఎస్పీ కార్యాలయం, మైనర్‌ ఇరిగేషన్‌ ఈఈ ఆఫీస్, ఫారెస్టు ఆఫీసెస్‌ కాంప్లెక్స్, పోస్టల్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయం, ఆర్‌అండ్‌బీ అతిథిగృహం, ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల, డీఈఓ ఆఫీస్, ఆర్‌అండ్‌బీ ఈఈ ఆఫీస్, జిల్లా జైలు, వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్, బ్రాహ్మణవాడిలోని దూద్‌ఖానా, పాత పోస్టల్‌ సూపరింటెండెంట్, షాసాబ్‌గుట్ట హైస్కూల్, మోడల్‌ బేసిక్‌ హైస్కూల్, రైల్వేస్టేషన్‌ తదితర భవనాలు ప్రముఖ చోటును సంపాదించాయి.  

ఫారెస్టు కార్యాలయం కాంప్లెక్సు 

తలమానికం మహబూబ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌  
1920 నుంచే మహబూబ్‌నగర్‌ వరకు వీక్లీ రైలు రాకపోకలు సాగించింది. అప్పట్లో సికింద్రాబాద్‌ నుంచి ఆరేపల్లి వరకు రైలును నడిపేవారు. నిజాం హయాంలో నైజాం గ్యారెంటేడ్‌ స్టేట్‌ రైల్వే ఆధ్వర్యంలో 1923లో  మహబూబ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌ను ప్రారంభించి కర్నూల్‌ వరకు రైళ్లను నడిపారు. అనంతరం నైజాం స్టేట్‌ రైల్వేగా మార్చారు. 1948లో దీనిని కేంద్ర ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంది. మొదట్లో రైళ్లు నీరు, నల్లబొగ్గుతో నడిపేవారు.  స్టేషన్‌ సమీపంలో ప్రత్యేక వాటర్‌ క్యాన్‌ను ఏర్పాటుచేశారు. ఈ స్టేషన్‌కు వచ్చే రైళ్లు దీని ద్వారా నీటిని నింపుకొనేవి. అనంతరం డీజిల్‌ ఇంజిన్లతో రైళ్లను నడిపారు. ప్రస్తుతం నూతన టెక్నాలజీ రావడం ఎలక్ట్రికల్‌ ఇంజిన్ల సాయంతో రైళ్లు నడుస్తున్నాయి. 1993లో ఇక్కడ బ్రాడ్‌గేజ్‌ అందుబాటులోకి వచ్చింది.  

                                   మైనర్‌ ఇరిగేషన్‌ కార్యాలయం  

కులమతాల కలయికయే.. 
కులమతాల కలయికయే మహబూబ్‌నగర్‌ జిల్లా. హమారా మహబూబ్‌నగర్‌ అని చాలా మంది ఆప్యాయంగా పిలుచుకుంటారు. మీర్‌ మహెబూబ్‌అలీఖాన్‌ తన హయాంలో ప్రజా సంక్షేమానికి ఎంతో పాటుపడ్డారు. 14ఏళ్ల నుంచి డిసెంబర్‌ 4న మహబూబ్‌నగర్‌ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నాం. అన్ని మతాల పెద్దలు, మేధావులు, రాజకీయ నాయకులను ఆహ్వానించి ఘనంగా సత్కరిస్తున్నాం.  
– ఎం.ఎ.రహీం, ఆరోనిజాం నవాబ్‌మీర్‌ మహెబూబ్‌అలీ ఖాన్‌ బహదూర్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement