ఈ నెలాఖరు నుంచే డిగ్రీ క్లాసులు | TS DOST Phase 3 Counselling on july 06: Telangana | Sakshi
Sakshi News home page

ఈ నెలాఖరు నుంచే డిగ్రీ క్లాసులు

Published Sat, Jul 6 2024 5:32 AM | Last Updated on Sat, Jul 6 2024 5:32 AM

TS DOST Phase 3 Counselling on july 06: Telangana

నేడు మూడోదశ సీట్ల కేటాయింపు

గతంతో పోలిస్తే పెరిగిన అడ్మిషన్లు

మిగతా కౌన్సెలింగ్‌లు వేగవంతం

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెలాఖరు నుంచే డిగ్రీ క్లాసులు ప్రారంభించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఏటా కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆలస్యం కావడంతో డిగ్రీ క్లాసులు ఆగస్టు చివరి­వారం లేదా సెప్టెంబర్‌ మొదటి వారంలో ప్రారంభమ­య్యేవి. దీనివల్ల విద్యా సంవత్సరం ఆలస్యంగా నడుస్తోందనే విమర్శలున్నాయి. డిగ్రీ పూర్తయిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో  కొన్ని కోర్సుల్లో చేరే అవకాశం కొంతమంది విద్యార్థులు కోల్పోతున్నారు.

దీనిని దృష్టిలో ఉంచుకొని సకాలంలో క్లాసులు మొదలు పెట్టాలని నిర్ణయించారు. క్లాసులు త్వరగా నిర్వహించే వెసులుబాటు కల్పించాలని  ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలు కూడా కోరుతున్నాయి. జూలై నెలాఖరులో డిగ్రీ బోధన చేపడితే మే వరకు సిలబస్‌ పూర్తవుతుందని, విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధమ­య్యే అవకాశం లభిస్తుందని వర్సిటీ అధికారులు చెబుతు­న్నారు. కోవిడ్‌ సమయంలో అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమైంది. ఇది గత రెండేళ్లుగా ప్రభావం చూపుతోంది.

ఇప్పటికే లక్షమంది చేరిక
గతంతో పోలిస్తే ఈ ఏడాది మొదటి రెండు కౌన్సెలింగ్‌ల్లో ఎక్కువమంది విద్యార్థులు సీట్లు పొందారు. ఇప్పటివరకు 93,214 మంది డిగ్రీలో చేరారు. నాన్‌–దోస్త్‌ కాలేజీలు, దోస్త్‌ పరిధిలోకి రాని ఇతర కాలేజీల అడ్మిషన్లు కలుపుకుంటే లక్ష సీట్లు భర్తీ అయినట్టు అధికారులు చెబుతున్నారు. రెండుదశ కౌన్సెలింగ్‌ ముగిసే సమయానికి 1,04,784 మంది విద్యార్థులు దోస్త్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. 1,81,769 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చారు. మూడోదశ కౌన్సెలింగ్‌ సీట్లు శనివారం భర్తీ చేస్తారు. ఈ కౌన్సెలింగ్‌కు కొత్తగా 66,976 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. మొదటి, రెండో దశలో సీట్లు రానివారు, వచ్చిన కొత్త గ్రూపుల కోసం ప్రయత్నించే వారు 80,312 మంది ఆప్షన్లు ఇచ్చారు.

ఎక్కువ మంది కామర్స్‌ వైపే..
రాష్ట్రంలో ప్రస్తుతం 3,84,748 డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో కూడా ఎక్కువగా కామర్స్‌ కోర్సులకే ప్రాధాన్యమిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ జరిగిన దోస్త్‌ కౌన్సెలింగ్‌లో కామర్స్‌ కోర్సులో 28,655 మంది చేరారు. ఆర్ట్స్‌లో కేవలం 7,766 మంది మాత్రమే చేరారు. లైఫ్‌సైన్స్‌ కోర్సుకు మంచి స్పందన కనిపిస్తోంది. ఈ విభాగంలో 15,301 మంది చేరారు. ఇంజనీరింగ్‌లో డేటా సైన్స్‌ కోసం విద్యార్థులు పోటీ పడతారు. డిగ్రీలో అదే స్థాయిలో కోర్సు ప్రవేశ పెట్టినా కేవలం 2,502 మంది మాత్రమే చేరారు. డిగ్రీ కోర్సుల్లో చేరుతున్న వారిలో బాలికలే ఎక్కువగా ఉంటున్నారు. ఇప్పటివరకూ 47,867 మంది బాలికలు చేరితే, బాలురు 28,423 మంది మాత్రమే డిగ్రీ సీట్లు పొందారు.

డిగ్రీ క్లాసుల ప్రారంభంపై దృష్టి 
ఈ నెలాఖరు నుంచే డిగ్రీ క్లాసులు మొదలు పెట్టాలని నిర్ణయించాం. వీలైనంత త్వరగా దోస్త్‌ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తాం. దీనివల్ల విద్యార్థుల విద్యా సంవత్సరం త్వరగా పూర్తవుతుంది. డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులు త్వరగా ఆప్షన్లు ఇవ్వడం, సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయడంపై దృష్టి పెట్టాలి. త్వరలోనే మిగతా కౌన్సెలింగ్‌లు పూర్తి చేస్తాం. –  ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి, ఉన్నత విద్యా
మండలి చైర్మన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement