degree classes
-
ఈ నెలాఖరు నుంచే డిగ్రీ క్లాసులు
సాక్షి, హైదరాబాద్: ఈ నెలాఖరు నుంచే డిగ్రీ క్లాసులు ప్రారంభించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఏటా కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో డిగ్రీ క్లాసులు ఆగస్టు చివరివారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యేవి. దీనివల్ల విద్యా సంవత్సరం ఆలస్యంగా నడుస్తోందనే విమర్శలున్నాయి. డిగ్రీ పూర్తయిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో కొన్ని కోర్సుల్లో చేరే అవకాశం కొంతమంది విద్యార్థులు కోల్పోతున్నారు.దీనిని దృష్టిలో ఉంచుకొని సకాలంలో క్లాసులు మొదలు పెట్టాలని నిర్ణయించారు. క్లాసులు త్వరగా నిర్వహించే వెసులుబాటు కల్పించాలని ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు కూడా కోరుతున్నాయి. జూలై నెలాఖరులో డిగ్రీ బోధన చేపడితే మే వరకు సిలబస్ పూర్తవుతుందని, విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అవకాశం లభిస్తుందని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. కోవిడ్ సమయంలో అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమైంది. ఇది గత రెండేళ్లుగా ప్రభావం చూపుతోంది.ఇప్పటికే లక్షమంది చేరికగతంతో పోలిస్తే ఈ ఏడాది మొదటి రెండు కౌన్సెలింగ్‌ల్లో ఎక్కువమంది విద్యార్థులు సీట్లు పొందారు. ఇప్పటివరకు 93,214 మంది డిగ్రీలో చేరారు. నాన్–దోస్త్ కాలేజీలు, దోస్త్ పరిధిలోకి రాని ఇతర కాలేజీల అడ్మిషన్లు కలుపుకుంటే లక్ష సీట్లు భర్తీ అయినట్టు అధికారులు చెబుతున్నారు. రెండుదశ కౌన్సెలింగ్ ముగిసే సమయానికి 1,04,784 మంది విద్యార్థులు దోస్త్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 1,81,769 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. మూడోదశ కౌన్సెలింగ్ సీట్లు శనివారం భర్తీ చేస్తారు. ఈ కౌన్సెలింగ్‌కు కొత్తగా 66,976 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మొదటి, రెండో దశలో సీట్లు రానివారు, వచ్చిన కొత్త గ్రూపుల కోసం ప్రయత్నించే వారు 80,312 మంది ఆప్షన్లు ఇచ్చారు.ఎక్కువ మంది కామర్స్ వైపే..రాష్ట్రంలో ప్రస్తుతం 3,84,748 డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో కూడా ఎక్కువగా కామర్స్ కోర్సులకే ప్రాధాన్యమిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ జరిగిన దోస్త్ కౌన్సెలింగ్‌లో కామర్స్ కోర్సులో 28,655 మంది చేరారు. ఆర్ట్స్‌లో కేవలం 7,766 మంది మాత్రమే చేరారు. లైఫ్‌సైన్స్ కోర్సుకు మంచి స్పందన కనిపిస్తోంది. ఈ విభాగంలో 15,301 మంది చేరారు. ఇంజనీరింగ్‌లో డేటా సైన్స్ కోసం విద్యార్థులు పోటీ పడతారు. డిగ్రీలో అదే స్థాయిలో కోర్సు ప్రవేశ పెట్టినా కేవలం 2,502 మంది మాత్రమే చేరారు. డిగ్రీ కోర్సుల్లో చేరుతున్న వారిలో బాలికలే ఎక్కువగా ఉంటున్నారు. ఇప్పటివరకూ 47,867 మంది బాలికలు చేరితే, బాలురు 28,423 మంది మాత్రమే డిగ్రీ సీట్లు పొందారు.డిగ్రీ క్లాసుల ప్రారంభంపై దృష్టి ఈ నెలాఖరు నుంచే డిగ్రీ క్లాసులు మొదలు పెట్టాలని నిర్ణయించాం. వీలైనంత త్వరగా దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తాం. దీనివల్ల విద్యార్థుల విద్యా సంవత్సరం త్వరగా పూర్తవుతుంది. డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులు త్వరగా ఆప్షన్లు ఇవ్వడం, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంపై దృష్టి పెట్టాలి. త్వరలోనే మిగతా కౌన్సెలింగ్‌లు పూర్తి చేస్తాం. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
తెలంగాణ: వెబ్సైట్లో ఇంటర్ మెమోలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థుల మార్కుల మెమోలను వెబ్సైట్లో పొందిపర్చినట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ తెలిపారు. విద్యార్థులు https://tsbie.cgg.gov.in/ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. మెమోల్లో సందేహాలుంటే కాలేజీల ప్రిన్సిపల్, మెయిల్ (helpdeskie@telangana.gov.in) లేదా వెబ్సైట్ (http://bigrs.telangana.gov.in/) ద్వారా ఈ నెల 10లోపు సంప్రదించాలన్నారు. సెప్టెంబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ ఒకటి నుంచి డిగ్రీ(యూజీ) తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. డిగ్రీ ప్రవేశాలు, తరగతుల నిర్వహణపై ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో గురువారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ లింబాద్రి, కార్యదర్శి శ్రీనివాసరావుతో పాటు కళాశాల విద్యా కమిషనర్ నవీన్‌మిట్టల్, ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, పాలమూరు, అంబేడ్కర్ విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్లు పాల్గొన్నారు. 2021–22 విద్యా సంవత్సరంలో డిగ్రీ కాలేజీల్లో బోధన పనిదినాలను 180 రోజులుగా అధికారులు నిర్ణయించారు. మొదటి సెమిస్టర్‌కు 90 రోజులు, రెండో సెమిస్టర్‌కు 90 రోజుల పాటు బోధన, అభ్యసన కార్యక్రమాలు సాగుతాయి. వచ్చే ఏడాది జనవరి/ఫిబ్రవరిలో మొదటి సెమిస్టర్ పరీక్షలు, జూన్/జూలైలో రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు. -
ఇంజనీరింగ్‌లో ముందు ఆన్లైనే
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆన్లైన్ బోధనకు అధికారులు మొగ్గుచూపుతున్నారు. ప్రథమ సంవత్సరం మినహా మిగతా సంవత్సరాల వారికి వచ్చే నెల 17వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై ఉన్నత, సాంకేతిక విద్యాశాఖలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగా జేఎన్ టీయూ, ఓయూ రిజిస్ట్రార్లతోనూ ఉన్నతాధికారులు శుక్రవారం చర్చించారు. వచ్చేనెల నుంచి తరగతులను ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే జేఎన్టీయూ కరోనా నేపథ్యంలో అనుసరించాల్సిన విద్యా బోధన ప్రణాళికపై ఓ నివేదికను సిద్ధం చేసింది. దానిని కూడా అధికారులు పరిశీలించారు. దాని అమలుకు అవసర మైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముందుగా కాలేజీలు విద్యార్థులకు వెబి నార్లు నిర్వహించాలని నిర్ణయించారు. వాటిని ఇప్పుటి నుంచే ప్రారంభిస్తే విద్యార్థులు అలవాటు పడతారని, ఏమైనా లోటుపాట్లు ఉన్నా తెలుస్తాయని, వీటిని సవరించుకొని ఆగస్టు 17వ తేదీనుంచి రెగ్యులర్ తరగతులను ఆన్లైన్లో నిర్వíహించవచ్చన్న నిర్ణయానికి వచ్చారు. అయితే ఆన్లైన్ తరగతులను ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లోనే అమలు చేయడం సాధ్యం అవుతుందన్న భావనకు వచ్చారు. ఇక సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో రికార్డెడ్ వీడియో పాఠాలను బోధించాలన్న నిర్ణయానికి వచ్చారు. ముఖ్యంగా టీశాట్, దూరదర్శన్ వంటి చానళ్ల ద్వారా, మరోవైపు యూట్యూబ్ చానళ్ల ద్వారా వీటిని ప్రసారం చేస్తే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్న అభిప్రాయానికి వచ్చారు. సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో ఎక్కువ మంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే ఉన్నందున ఆన్లైన్ బోధన సాధ్యం కాదన్న భావనకు వచ్చారు. అందుకే వీడియో పాఠాలను రూపొందించి యూట్యూబ్‌లో అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. వీలైన వారు వింటారని, మరోవైపు స్వయం పోర్టల్‌లో ఉన్న పాఠాలను కూడా వింటారన్న భావనకు వచ్చారు. అలాగే టీశాట్, దూరదర్శన్ ఛానెళ్ల ద్వారా ప్రసారం చేస్తే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందని నిర్ణయించారు. ఇలా సాంకేతిక విద్యా కోర్సుల్లో ఆన్లైన్ బోధనను, సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో వీడియో పాఠాలను రెండు మూడు నెలలపాటు నిర్వహించనున్నారు. అప్పటికీ కరోనా పూర్తి స్థాయిలో అదుపులోకి రాకపోతే కొన్నాళ్లు ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్లైన్లో బోధనను కొనసాగించనున్నారు. భౌతికదూరం పాటించేలా విద్యార్థులను విభజించి షిప్ట్ పద్దతుల్లో తరగతులు కొనసాగించడం లేదా రోజు విడిచి రోజు (ఒక రోజు ఆన్లైన్, ఒక రోజు ఆఫ్‌లైన్) పద్ధతుల్లో బోధనను కొనసాగించనున్నారు. కరోనా అదుపులోకి వచ్చాకే విద్యార్థులు అందరికీ రెగ్యులర్ తరగతులు నిర్వహించే అవకాశం ఉంటుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. -
13 నుంచి డిగ్రీ తరగతులు పునఃప్రారంభం
అనంతపురం (బుక్కరాయసముద్రం) : అనంతపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఈనెల 13 నుంచి తరగతులు పునః ప్రారంభం అవుతాయని ప్రిన్సిపల్ రంగస్వామి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 19 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. 19 నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్ జరగనున్నట్లు చెప్పారు.