సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో వరదల కారణంగా తలెత్తే నష్ట నివారణకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని కేంద్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖ కార్యదర్శి, జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ కార్యదర్శితో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాల కారణంగా తరచుగా వచ్చే వరదలు వస్తున్నాయని, వీటిని అరికట్టడానికి నివారణ చర్యలు తీసుకునేలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్‌ఎస్ అర్జున్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. ఇదే అంశంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, అయితే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిందని చెప్పారు. తెలంగాణలో కాళేశ్వరం, ఏపీలో పోలవరం నిర్మాణం కారణంగా మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, పెద్దపల్లి, కొమురం భీం జిల్లాల్లోని పలు ప్రాంతాలు ముంపునకు గురై ఆస్తి, పంట నష్టం వాటిల్లిందన్నారు.
కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా జరుగుతోందని వెల్లడించారు. అయినా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో జరిగిన నష్టాన్ని లెక్కించడం, బాధితులకు నష్టపరిహారం చెల్లించడం, మంచిర్యాల, భద్రాచలం పట్టణాల వద్ద తగిన రక్షణ గోడలు నిర్మించడం.. వంటి చర్యలు చేపట్టడం కోసం ఓ కమిటీని వేసేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment