
రోడ్డు మీద ఎలాంటి ఘటనలు జరుగుతున్నా.. కళ్లు మూసుకుంటున్నాడు మనిషి..
సాక్షి, సంగారెడ్డి: బిజీ లైఫ్.. మనిషి కళ్లకు గంతలు కట్టేసింది. సాయానికి ప్రయత్నిస్తే.. లేనిపోని సమస్యలు మెడకు చుట్టుకుంటాయేమోనని వెనుకంజ వేస్తున్నారు కొందరు. ఈ క్రమంలో కనీస సాయాన్ని కూడా బాధ్యతగా స్వీకరించడం లేదు. తాజాగా.. జిల్లాలోని రామచంద్రాపురం అశోక్‌నగర్ జరిగిన ఓ ఘటన చర్చనీయాంశంగా మారింది.
నడిరోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చింది ఓ యువతి. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా హఠాత్తుగా ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. రోడ్డు మీద పడిపోయి విలవిలలాడిందామె. అటుగా వెళ్తున్న కొందరు పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయారు. కాసేపటికి ఆమె అవస్థను గమనించిన కొందరు షాపుల వాళ్లు.. అట్టముక్కలు అడ్డుపెట్టి అక్కడే ఆమెకు ప్రసవం చేశారు. ప్రసవం అనంతరం తల్లీబిడ్డలకు కొంత డబ్బుసాయం అందించి పఠాన్‌చెరువు ఏరియా ఆసుపత్రికి ఆటోలో తరలించారు.
ఆ యువతిని ఇస్నాపూర్‌కు చెందిన బబితగా గుర్తించారు. స్థానికులు సకాలంలో స్పందించడంతోనే ఆ తల్లీబిడ్డకు గండం తప్పిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.