పారిశ్రామికవేత్తలతో కాకి గోవిందరెడ్డి వాగ్వాదం
విశాఖపట్నం: కాకి గోవిందరెడ్డి వివాదస్పద కార్పొరేటర్. 69వ వార్డు నుంచి ఎన్నికైన ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేయడం..బెదిరింపులకు పాల్పడడం నైజం. తాజాగా ఆటోనగర్‌లో ఐలా చైర్మన్ కె.సత్యనారాయణరెడ్డి (రఘు)పై అసభ్య పదజాలంతో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో కాకిగోవిందరెడ్డి ఆయన అనుచరులపై పారిశ్రామిక వేత్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు ఇలా... శుక్రవారం రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్‌నాఽథ్ చేతుల మీదుగా రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగాల్సి ఉంది. మంత్రితో ప్రారంభోత్సవం చేయాల్సిన శిలాఫలకానికి పక్కనే మరో శిలాఫలకాన్ని ఇంజినీరింగ్ అధికారులు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి అటు పారిశ్రామిక వేత్తలు, ఇటు కార్పొరేటర్ కాకి గోవింద రెడ్డి, అతని అనుచరులు హాజరయ్యారు. తన అనుమతి లేకుండా శిలాఫలకం ఎలా ఏర్పాటు చేస్తారని కాకి గోవిందరెడ్డి వాగ్వాదానికి దిగాడు. ఐలా చైర్మన్ కె.సత్యనారాయణ రెడ్డి (రఘు)పై అసభ్య పదజాలంతో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. పలువురు పారిశ్రామిక వేత్తలు కార్పొరేటర్ వర్గాన్ని నిలువరించేందుకు యత్నించారు. జరిగిన ఘటనతో అవమానకరంగా భావించిన పారిశ్రామిక వేత్తలు మూకుమ్మడిగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరగకముందే వెళ్లిపోయారు.
కార్పొరేటర్‌తో పాటు అతని అనుచరుల తోపులాటలో ఇద్దరు పారిశ్రామివేత్తలకు స్వల్పగాయాలయ్యాయని ఐలా చైర్మన్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. తాము ఎప్పుడూ గ్రామస్తుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఆర్‌ఓబీ పనుల ప్రారంభాన్ని త్వరతగతిన చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని, ఒక ప్రజా ప్రతినిధిగా కార్పొరేటర్ ఈ విధంగా ప్రవర్తించడం దారుణమని ఐలా చైర్మన్ రఘుతో పాటు పారిశ్రామిక వేత్తలు, ఐలా ప్రతినిధులు మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఐలా ప్రతినిధులు గాజువాక పోలీసు స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని సీఐ శ్రీనివాసరావుకు చెప్పారు. దీంతో కాకి గోవిందరెడ్డిని పోలీసు స్టేషన్‌కు పిలిపించి ఐలా ప్రతినిధులకు క్షమాపణలు చెప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment