
అక్కిరెడ్డిపాలెం: చెప్పిన మాట వింటుంది. చెప్పిన పని చేస్తుంది.. తన యజమానికి సహాయకారిగా ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యుడిలా మెలుగుతుంది. బయట ఫుడ్ అస్సలు తినదు. ఇంట్లో వండిన ఆహారమే తీసుకుంటుంది. నిత్యం ప్రశాంతంగా ఉంటుంది. అందరిపై ప్రేమానురాగాలు కురిపిస్తుంది..అందుకే ప్లూటో అంత స్పెషల్.. ఇంతకీ ప్లూటో ఎవరో చెప్పలేదు కదూ.. ప్లూటో అందమైన జూలున్న శునకం.. బెంగళూరులో జన్మిచ్చింది. అక్కిరెడ్డిపాలెంలో ఉంటున్న దాసరి ఖుషీ కుమార్ ఇంట్లో దర్జాగా జీవిస్తోంది. ప్లూటో తన యజమానితో కలిసి 300 మీటర్ల పరిధిలో బుట్టలో పాలబాటిల్ పెట్టుకుని ఖాతాదారుల ఇంటింటికీ వెళ్లి అందజేస్తోంది. ఈ వెరీవెరీ స్పెషల్ ప్లూటో గురించి తెలుసుకుందాం.
జీవీఎంసీ 69వ వార్డు రెడ్డి తుంగ్లాంలో నివాసం ఉంటున్న దాసరి అనూరాధ కుమారుడు ఖుషీ కుమార్‌కు కుక్కలంటే ప్రాణం. గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన మగజాతి కుక్క (ప్లూటో)ను బెంగళూరులో 45 రోజుల వయసుండగా రూ.25 వేలకు కొనుగోలు చేశాడు. ఇది పెరుగుతున్న క్రమంలో ఖుషీకుమార్ ప్లూటోలోని కొన్ని లక్షణాలను గమనించాడు. దీంతో ఓ ట్రైనర్ సాయంతో శిక్షణ ఇప్పించాడు. ఖుషీ కుమార్ పాన్ షాప్ నిర్వహిస్తున్నాడు. పాడిపశువులు ఉండడంతో పాల విక్రయాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో యజమానికి ప్లూటో సహాయకారిగా ఉంటుంది. బుట్టలో పాల బాటిల్ నోట కరుచుకుని యజమానితో కలిసి ఖాతాదారులకు అందజేస్తోంది. ఖాతాదారుడి ఇంటి ముందు అరిచి పిలుస్తుంది. పాల బుట్టను అందజేసి రెండు కాళ్లు ఎత్తి నమస్కరిస్తుంది. తిరిగి ఖాళీ బుట్టను యజమానికి ఇస్తుంది.
డాగ్స్ షోలో అవార్డులు
గతేడాది జరిగిన డాగ్ షోలో రన్నింగ్‌లో ఫ్లూటో ప్రథమ స్థానం సాధించింది. యజమాని చెప్పిన మాటలను తూ.చ తప్పకుండా అనుసరించడంతో గేమ్‌లో ప్రథమ బహుమతి గెలుచుకుంది. ఈ సమయంలో పోలీస్ కుక్కలకు శిక్షణ ఇచ్చే టీం సభ్యుడు ప్రశంసలు అందుకుంది.
ఏటా పుట్టినరోజు వేడుకలు
ప్లూటో వచ్చిన దగ్గర నుంచి ఖుషీ కుమార్, కుమార్తె దివ్యలు ఎంతో ఆనందంగా ఉంటున్నారు. కుటుంబ సభ్యులతో కలిసే ప్లూటో భోజనం చేస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు మాత్రం పెడీ గ్రీ పెడతామని యజమాని అనూరాధ తెలిపారు. ప్రస్తుతం ప్లూటో వయసు రెండేళ్ల మూడు నెలలు. ఏటా ప్లూటో పుట్టినరోజును ఘనంగా నిర్వహిస్తామని.. డాక్టర్ల పర్యవేక్షణ, ఆరోగ్యకరమైన ఆహారం ఇస్తుంటామన్నారు. ఇతరులు ఏం పెట్టినా తిరస్కరిస్తుందని.. ఎవరైనా దాడులు చేసుకుంటున్నా వారిని వారిస్తుందన్నారు.

వెరీ వెరీ స్పెషల్