విశాఖ స్పోర్ట్స్: ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్1లో నగర క్రీడాకారిణి పారిస్ ఒలింపియన్ జ్యోతి ఎర్రాజీ మరోసారి ఫాస్టెస్ వుమెన్ హార్డిలర్‌గా నిలిచింది. బెంగళూర్‌లోని భారత క్రీడాసంస్థ ఎన్‌ఎస్‌ఎస్‌సీలో శుక్రవారం జరిగిన వుమెన్ హార్డిల్స్ 100 మీటర్ల ఫైనల్‌లో జ్యోతి ఎర్రాజీ 13.07 సెకన్లలోనే పూర్తి చేసి విజేతగా నిలిచింది. భారత అథ్లెటిక్ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో రిలయెన్స్ ఫౌండేషన్‌కి చెందిన ప్రజ్ఞాన్ 13.44 సెకన్లలో, నందిని(తమిళనాడు) 13.78 సెకన్లలో పూర్తి చేసి వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. జాతీయ రికార్డు సైతం 12.78 సెకన్లుగా జ్యోతి పేరిటే ఉంది. 100 మీటర్ల హార్డిల్స్‌లో జ్యోతిని చాలెంజ్ చేసిన నిత్య(తమిళనాడు), మౌమిత(రిలయెన్స్) అసలు ప్రారంభంలోనే హాజరుకాక డీఎన్‌ఎస్‌గా మిగిలిపోయారు. 200 మీటర్ల పరుగులోనూ జ్యోతి 23.36 సెకన్లలో హీట్ పూర్తిచేసి ఫైనల్స్‌కు చేరింది.