
‘కృష్ణ’ను కుంకీ శిక్షణకు పంపించండి
ఆరిలోవ: ఇందిరా గాంధీ జూ పార్కులో కృష్ణ అనే మగ ఏనుగును కుంకీ శిక్షణకు పంపించేందుకు చర్యలు చేపట్టాలని జూ క్యూరేటర్ జి.మంగమ్మను ఏపీ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(పీసీసీఎఫ్) అజయ్ కుమార్ నాయక్ ఆదేశించారు. జూ పార్కులో కృష్ణ కొన్ని దశాబ్దాలుగా సందర్శకులకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం కె.పవన్ కల్యాణ్ జూ పర్యటన నేపథ్యంలో అదనపు పీసీసీఎఫ్‌లు శాంతిప్రియ పాండే, రాహుల్ పాండేలతో కలసి మంగళవారం ఇక్కడకు చేరుకున్నారు. అయితే పవన్ కల్యాణ్ పర్యటన రద్దవడంతో, ఆయన జూ పార్కు ఎదురుగా ఉన్న ఎకో టూరిజం పార్కు కంబాలకొండను సందర్శించారు. అలాగే జూలో వన్యప్రాణులు, వాటి ఎన్‌క్లోజర్లు, ఆస్పత్రి, అభివృద్ధి పనులు, సిద్ధమైన పలు ఎన్‌క్లోజర్లు, సందర్శకులకు కల్పిస్తున్న సౌకర్యాలు పరిశీలించారు. వన్యప్రాణులకు అందు తున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు గురించి ఆరా తీశారు. జూలో అడవి కుక్కల పునరుత్పత్తి కేంద్రం అభివృద్ధిని పరిశీలించి జూ అధికారులను అభినందించారు. వన్యప్రాణుల ఎన్‌క్లోజర్ల వద్ద ఫొటోలు దిగా రు. కంబాలకొండలో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించి, వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం జూ లవర్స్ డే పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ నాయక్ మాట్లాడుతూ వన్యప్రాణులకు అందించే వైద్య సేవలపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. కృష్ణను ఏనుగుల క్యాంప్‌లో కుంకీ శిక్షణకు పంపించే ఏర్పాట్లు చేయాలన్నా రు. అడవుల నుంచి జనావాసాలు, పొలాల్లోకి చొరబ డి పంటలు నాశనం చేస్తున్న ఏనుగుల గుంపులను తిరిగి అడవుల్లో తరలించే విధంగా దీనికి శిక్షణ ఇస్తారన్నారు. విశాఖ సీఎఫ్ బి.ఎం.మైదీన్, పలువురు డీఎఫ్‌వోలు పాల్గొన్నారు.
జూ క్యూరేటర్‌కు పీసీసీఎఫ్ ఆదేశం
అదనపు పీసీసీఎఫ్‌లతో జూ పరిశీలన