
ప్రజల ఆకాంక్ష నెరవేర్చేలా ‘స్వర్ణాంధ్ర 2047 విజన్’
బీచ్‌రోడ్డు: క్షేత్రస్థాయి పరిస్థితులు, అవసరాలను పరిగణలోకి తీసుకుని.. నియోజకవర్గ స్థాయి స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మే 15 నాటికి అన్ని పనులను పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాల అధికారులకు వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో నిర్వహించిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో శుక్రవారం ఆయన పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి అంశాలను అవగతం చేసుకుంటూ.. ప్రజల ఆకాంక్షలకు ప్రాధా న్యం ఇస్తూ ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల పరిధిలో పనిచేయాల్సిన అధికారుల బృందాలను ప్రకటించారు. జిల్లాకు కలెక్టర్ చైర్మన్‌గా, నియోజకవర్గానికి డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఇన్‌చార్జిగా, ఆయా జోనల్ లేదా మండల స్థాయిలో జోనల్ కమిషనర్, ఎంపీడీవోలు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారని, ఒక్కో కమిటీలో ఐదుగురు సచివాలయ సిబ్బంది ఉంటారని వెల్లడించారు. వీరంతా కలిసి స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళికకు అనుగుణంగా తాత్కాలిక వార్షిక ప్రణాళికలను తయారు చేయాలని సూచించారు. ఆయా నియోజకవర్గాల్లోని ప్రజల అవసరాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలని, భవిష్యత్ రూపురేఖలు మార్చే విధంగా ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నోడల్ అధికారి, మూడు జిల్లాల ఉన్నత స్థాయి అధికారులు, ఆర్డీవోలు, డిప్యూటీ కలెక్టర్లు, ప్రణాళిక విభాగం అధికారులు, సీపీవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఆదేశం