
రికార్డులనే మార్చేశారు...!
● పాత గెజిట్‌లో ఒక పేరు.. తాజాగా మరో పేరుతో ఆదేశాలు ● నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ నిర్ణయం ● రూ. 200 కోట్ల విలువైన భూమిలో చక్రం తిప్పిన కూటమి నేత ● ప్రతిఫలంగా ఆయన చేతికి ఎకరంన్నర భూమి ● భారీగా నగదు చేతులు మారినట్టు ఆరోపణలు ● ఎండాడలోని 14–1 సర్వే నంబరులోని 5.10 ఎకరాల్లో చిత్ర విచిత్రాలు
ఈ ఫొటోలో ఉన్నది అదే ఎండాడలోని అదే సర్వే నంబరు...14–1లోని 5.10 ఎకరాల భూమిని వై. బాలిరెడ్డికి అసైన్ చేశారని.. దీనిని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నామని, అందువల్ల రిజిస్ట్రేషన్లు చేయాలంటూ తాజాగా కలెక్టర్ జిల్లా రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఫొటోలో ఉన్నది కలెక్టర్ గెజిట్ నోటిఫికేషన్. ఇందులో ఎండాడలోని 14/1 సర్వే నంబరులో 5.10 ఎకరాల బూమి చెట్టిపల్లి సీతారామయ్య అసైనీగా ఉన్నారు. అయితే ఇది ప్రభుత్వ భూమి కావడం వల్ల నిషేధిత జాబితాలో ఉందని... అందువల్ల రిజిస్ట్రేషన్లు చేయవద్దంటూ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి గతంలో కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
అదేంటి చెట్టిపల్లి సీతారామయ్య పేరు కాస్తా బాలిరెడ్డిగా ఎలా మారిందనే అనుమానం వచ్చిందా? అనుమానాలేమీ అక్కర్లేదని... బాలిరెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్లను కూడా అనుమతించాలని కొద్దిరోజుల క్రితం జిల్లా ఉన్నతాధికారులు తేల్చిచెప్పారు. మొత్తం రికార్డుల్లోని పేరు ఎలా మారిపోయిందనే సందేహం మీకు అక్కరలేదు. ఎందుకంటే ఈ వ్యవహారంలో విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ఒకరు చక్రం తిప్పడమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రతిఫలంగా సదరు నేతకు ఎకరంన్నర పొలం దక్కనుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ వ్యవహారంలో భారీగా నగదు చేతులు మారిందనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మొదట్లో అసైనీగా పేర్కొన్న చెట్టిపల్లి సీతారామయ్య కుటుంబ సభ్యులు ఏమీ మాట్లాడకుండా.. న్యాయపరంగా ముందుకెళ్లకుండా వాటాలు కూడా మాట్లాడేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా రూ. 200 కోట్ల విలువైన ఈ భూమి వ్యవహారంపై లోతైన విచారణ చేస్తే మొత్తం వ్యవహారం బయటపడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రికార్డులనే మార్చేశారు...!