చతికిలబడి | - | Sakshi

చతికిలబడి

Apr 13 2025 1:39 AM | Updated on Apr 13 2025 1:39 AM

చతికిలబడి

చతికిలబడి

సర్కారు కళాశాలలు

ఇంటర్‌ ఫలితాల్లో జిల్లా ఆఖరి స్థానం ఫస్టియర్‌లో 34, సెకండియర్‌లో 55 శాతం ఉత్తీర్ణత

హైస్కూల్‌ ప్లస్‌లో దారుణమైన ఫలితాలు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల నిర్వీర్యమే లక్ష్యమా..?

విశాఖ విద్య: ఇంటర్‌ ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు డీలాపడ్డాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరంలోనూ రాష్ట్రంలోనే అట్టడుగు స్థానంలో విశాఖ జిల్లా నిలిచింది. ఫస్టియర్‌లో కేవలం 34 శాతం, సెకండియర్‌లో 55 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జిల్లా ఆఖరి స్థానంలో నిలవడం చూస్తుంటే.. ఫలితాలు రాబట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని అర్థమవుతుంది. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో అధ్యాపకుల ఖాళీల భర్తీపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. రేషనలైజేషన్‌ పేరుతో ఉన్న పోస్టులను కుదించేసింది. కాలేజీల్లో చదువులు ఎలా సాగుతున్నాయనేది క్షేత్రస్థాయిలో సమీక్షలు కూడా లేవు. ప్రభుత్వ కాలేజీలను నిర్వీర్యం చేసి, తద్వారా ప్రైవేటు విద్యా సంస్థలకు మేలు చేకూర్చాలన్న కూటమి ప్రభుత్వ విధానాలకు ప్రతిరూపమే ప్రస్తుత ఇంటర్మీడియెట్‌ ఫలితాలు అని విద్యారంగ నిపుణులు అంటున్నారు. బోధన సిబ్బంది కొరత వల్ల తరగతులు సక్రమంగా నిర్వహించకపోవడంతో విద్యార్థులు పాస్‌ కాలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు.

ఘోరమైన ఫలితాలు

ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో జిల్లాలోని అన్ని యాజమాన్యాలు కలుపుకొని 79 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో నాల్గో స్థానంలో నిలిచింది. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఫస్టియర్‌లో 34 శాతం ఉత్తీర్ణత మాత్రమే రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. డాక్టర్‌ వీఎస్‌ కృష్ణా కాలేజీలో అతి తక్కువగా 16 శాతం మంది విద్యార్థులే పాసవ్వడం గమనార్హం. మల్కాపురం, పెందుర్తి, మధురవాడ, ఇస్లాంపేట, భీమునిపట్నం కాలేజీల్లోనూ 34 శాతం కంటే తక్కువగా ఫలితాలు వచ్చాయి. సెకండియర్‌లో జిల్లాలోని అన్ని యాజమాన్యాల ఉత్తీర్ణత సగటు 87 శాతంతో రాష్ట్ర సూచికలో ఆరో స్థానంలో నిలిచింది. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 55 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పెందుర్తి, డాక్టర్‌ వీఎస్‌ కృష్ణా కాలేజీ, మల్కాపురం, ఇస్లాంపేట, ఆనందపురం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 50 శాతంలోపు ఉత్తీర్ణత సాధించగా, ఆనందపురం కాలేజీలో అయితే అతి తక్కువగా 25 శాతం మంది విద్యార్థులే ఉత్తీర్ణత కావడం గమనార్హం. మొత్తంగా ప్రథమ, ద్వితీయ ఇంటర్‌లో జిల్లా అట్టడుగు స్థానంలో నిలిచింది.

ఆ కాలేజీల్లో ప్రైవేటు వ్యాపారాలు

జిల్లాలోని భీమునిపట్నం, ఆనందపురం, మధురవాడ వంటి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోని కొంతమంది అధ్యాపకులు చదువులను పూర్తిగా గాలికొదిలేశారనే విమర్శలు మొదటనుంచీ ఉన్నాయి. ఇక్కడి అధ్యాపకులు రెగ్యులర్‌ విద్యార్థులకు చదువులు చెప్పటం మానేసి, ఓపెన్‌ స్కూళ్లలో టెన్త్‌, ఇంటర్‌ అడ్మిషన్లపైనే ఎక్కువగా ఫోకస్‌ పెడుతూ.. ప్రైవేటు సంపాదన వైపు మొగ్గు చూపుతున్న కారణంగానే.. ఇక్కడ సరైన ఫలితాలు రావటం లేదనే ప్రచారం ఉంది.

హైస్కూల్‌ ప్లస్‌లోనూ అంతంతమాత్రమే..

బాలికలకు ఉన్నత విద్యను చేరువలోకి తీసుకురావాలనే సంకల్పంతో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైస్కూల్‌ ప్లస్‌ ల్లోనూ ఫలితాలు ఆశాజనకంగా లేవు. జిల్లాలోని 6 హైస్కూల్‌ ప్లస్‌ ల్లో ఫస్టియర్‌లో 18.23 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గోపాలపట్నంలో 43 మందికి ముగ్గురు, గంగవరంలో 31 మందికి నలుగురు, ములగాడలో 21మందికి ముగ్గురు మాత్రమే పాసయ్యారు. సెకండియర్‌లో 34.43 శాతం మంది ఉత్తీర్ణత నమోదైంది. రాంపురంలో అతి తక్కువగా ఉత్తీర్ణత శాతం నమోదు కావడం గమనార్హం. హైస్కూల్‌ ప్లస్‌లను మూసివేయాలనే ఉద్దేశంతోనే వీటి గురించి కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదని.. అందుకనే ఇలాంటి ఫలితాలు వచ్చాయని విద్యారంగ నిపుణులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement