
అట్టహాసంగా అగ్నిమాపక వారోత్సవాలు
అల్లిపురం: జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా అగ్నిమాపక అధికారి ఎస్.రేణుకయ్య ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన ఆయన, అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేణుకయ్య మాట్లాడుతూ, వారోత్సవాల్లో ప్రజలకు అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. అనంతరం అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్, అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు. అగ్నిమాపక శకటాల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. డాబాగార్డెన్స్, అంబేడ్కర్ సర్కిల్, సంగం శరత్ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, ఆశీలమెట్ట, సౌత్ జైలురోడ్డు, జగదాంబ, టర్నల్ చౌల్ట్రీ మీదుగా సూర్యాబాగ్‌కు ర్యాలీ చేరుకుంది. వారోత్సవాల సందర్భంగా వారం రోజుల పాటు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఎఫ్‌ఓ పి.సింహాచలం, అగ్నిమాపక సిబ్బంది వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.