
ప్రేమించిన అమ్మాయి కోసం వైజాగ్ వచ్చేవాడిని
హిట్ 3 ట్రైలర్ రిలీజ్ వేడుకలో హీరో నాని
సీతమ్మధార: పెళ్లికి ముందు ఓ అమ్మాయిని కలిసేందుకు వైజాగ్ వచ్చేవాడిని.. అంటూ నేచురల్ స్టార్ నాని తన పర్సనల్ సీక్రెట్ బయటపెట్టారు. ఆయన లీడ్ రోల్‌లో దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్– 3 సినిమా ట్రైలర్‌ను నగరంలోని సంగం థియేటర్‌లో సోమవారం రిలీజ్ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న నాని సినిమాతో పాటు పలు విషయాలు పంచుకున్నారు. ‘నా పెళ్లికి ముందు దాదాపు 15 ఏళ్ల క్రితం ఇక్కడికి ఓ అమ్మాయిని కలవడానికి వచ్చేవాడిని, తర్వాత ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను. నాకు వైజాగ్‌తో స్పెషల్ బాండ్ ఏర్పడింది. అప్పుడైనా, ఇప్పుడైనా వైజాగ్‌కు వచ్చింది ప్రేమ కోసమే. వేరే ఎక్కడికి వెళ్లినా నన్ను వాళ్లు అన్న లేదా తమ్ముడిలా చూస్తారు. కానీ వైజాగ్ వచ్చినప్పుడు మాత్రం అల్లుడిలాగే చూస్తారు’.. అంటూ నాని తన భార్య గురించి, వైజాగ్‌తో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు. ఇక ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హిట్– 3 అనేది కొత్త జానర్. ఇందులో మనకు అలవాటు లేని కొత్త టోన్ ఉంటుంది. కొత్త ప్రయత్నాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారనడానికి వంద ఉదాహరణలు ఉన్నాయని, మే 1న మనమంతా గెలుస్తామన్న నమ్మకం ఉందన్నారు. అనంతరం సినిమాలో డైలాగ్‌తో నాని అభిమానులను అలరించారు.