ఉమ్మడి విజయనగరం జిల్లాకు ఎనలేని మేలు జలయజ్ఞంతో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు జీవకళ
తోటపల్లి ప్రాజెక్టు పనులకు నాంది వినూత్నంగా జంఝావతి ప్రాజెక్టు రూపశిల్పి
తారకరామతీర్థ సాగర్‌కు కదలిక వెనుకబడిన జిల్లాలకు వైఎస్సార్ హయాం ఓ స్వర్ణయుగం
నేడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి
ప్రతి అడుగులో ఆలోచన..ముఖంలో చిరు మందహాసంతో కూడిన దర్పం..ఆహార్యంలో రాజసం..నమ్మిన ప్రజలకు దిక్సూచి.. అభాగ్యులకు ఆపన్నహస్తం..అన్నార్తులకు భరోసా..అభివృద్ధికి చిరునామా..అనారోగ్య బాధితులకు ఆరోగ్య శ్రీ, 108, 104 సేవలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు జలయజ్ఞం, పేదవాడికి గూడు ఈ మాటలన్నీ ఎవరి నోట వినిపించినా ఠక్కున గుర్తొచ్చే పేరు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. తన పరిపాలన కాలంలో ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకున్న ఆయన నాటికీ..నేటికీ ప్రజల గుండెల్లో మహారాజులా కొలువై ఉన్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి. ఆయన పాలన కాలంలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు అందించిన సేవలు ఒకసారి మననం చేసుకుంటే..
సాక్షి ప్రతినిధి, విజయనగరం: కరువు, పేదరికం, కటిక సమస్యలు తాళలేక పొట్ట చేతబట్టుకుని ఉపాధి కోసం వలసపోయే జనం..ఇదీ సరిగ్గా ఇరవయ్యేళ్ల క్రితం వరకూ ఉమ్మడి విజయనగరం జిల్లా ముఖచిత్రం! అలాంటి నేపథ్యంలో 2003లో ప్రతిపక్షనేతగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్ర కీలక మలుపు. ఇక్కడి ప్రజల కష్టాలను కళ్లారా చూసిన ఆయన చలించిపోయారు. 2004 మే నెలలో తాను అధికారం చేపట్టింది మొదలు 2009 సెప్టెంబరులో అకాల మరణం వరకూ ముఖ్యమంత్రిగా ప్రతి పథకంలోనూ, అభివృద్ధి పనుల్లోనూ ఈ ప్రాంతానికి పెద్దపీట వేస్తూనే ఉన్నారు. నాటి ఆయన కృషి తాలూకా ఫలాలు ఇప్పుడు ప్రజలకు అందుతున్నాయి.
తదుపరి ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా మళ్లీ ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం అదే పంథాను కొనసాగించారు. ఇప్పుడు ఖరీఫ్ వచ్చేసరికి సాగునీరు అందుతోంది. ప్రగతిపథం వైపు ఉమ్మడి విజయనగరం జిల్లా వడివడిగా అడుగులు వేస్తోంది. వలసలు దాదాపుగా తగ్గిపోయాయి. బయటి ప్రాంతాలవారే ఇక్కడికొచ్చి స్థిరపడేలా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి.
జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కలను సాకారం చేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తన తుది శ్వాస వరకూ ప్రజాసేవలోనే గడిపిన ఆ మహామనిషి జయంతి నేడు (సోమవారం, జూలై 8). ఆయనను స్మరించుకోవడానికి ఊరూవాడా ప్రజలు సిద్ధమవుతున్నారు. వైఎస్సార్ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ రీజినల్ డిప్యూటీ కో ఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పార్టీ క్యాడర్‌ను కోరారు.
జేఎన్‌టీయూ వైఎస్సార్ పుణ్యమే...
ఉమ్మడి విజయనగరం జిల్లాలో నేడు సాంకేతిక విద్యకు దిక్సూచిగా ఉన్న జేఎన్‌టీయూ–జీవీ విశ్వవిద్యాలయానికి పునాదిరాయి వేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. 2007లో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటైంది. దీన్ని ఎప్పటికై నా యూనివర్సిటీని చేయాలనే ముందుచూపుతోనే 80 ఎకరాల విశాలమైన స్థలాన్ని కేటాయించారు. ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ అయ్యింది.
మాతాశిశుసంరక్షణకు ప్రాధాన్యం..
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే బొబ్బిలి సీహెచ్‌సీలో రూ.44.30 లక్షలతో సీమాంక్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఆయన ప్రారంభించిన భవనంలోనే నాటి నుంచి గర్భిణులు, బాలింతలకు వైద్యసేవలు అందుతున్నాయి.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి పునాది....
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ఉద్దేశించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు, వంగర మండలంలోని మడ్డువలస ప్రాజెక్టు లైనింగ్ పనులు, పాచిపెంట మండలంలోని పెద్దగెడ్డ ప్రాజెక్టు, నాగావళి ఉపనది జంఝావతి నుంచి రాష్ట్రానికి వచ్చే 4 టీఎంసీల వాటా నీరు వినియోగించుకునేందుకు వీలుగా 1976వ సంవత్సరంలో జంఝావతి ప్రాజెక్టు నిర్మాణం వంటి ఎన్నో పనులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాలోపూర్తయినవే.
వైఎస్సార్‌కు స్మృతివనం..
పాలకొండ మండలం ఎం.సింగుపురం గ్రామ ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం చూపించిన వైఎస్ రాజశేఖరరెడ్డిని ఒక దైవంలా ఆరాధిస్తున్నారు. 2006లో ముఖ్యమంత్రి హాదాలో ఇక్కడ ప్రజాపఽథం కార్యక్రమానికి వైఎస్సార్ వచ్చారు. ఆయన మరణానంతరం ఇక్కడ వైఎస్సార్ స్మృతివనాన్ని గ్రామస్తులు నిర్మించారు.
చీపురుపల్లి అభివృద్ధికి ఆద్యుడు
చీపురుపల్లి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులకు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నాంది పలికారు. ఆయన క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ చొరవతో రూ.83 కోట్లతో ఇందిరమ్మ సుజలధార పథకం చేపట్టడం ద్వారా తాగునీటి ఇబ్బందులు తొలగించారు. చీపురుపల్లికి ఆ మహానేత వైఎస్సార్ హయాంలో మంజూరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల నేడు ఆదర్శ డిగ్రీ కళాశాలగా కొనసాగుతోంది.
‘గిరి’జన గ్రామాల్లో వెలుగు
వేపాడ మండలం కరకవలస పంచాయతీ పరిధిలోని గిరిశిఖర గ్రామమైన మారిక గ్రామానికి తొలిసారిగా 2006లో విద్యుత్ సదుపాయం కల్పించిందీ నాటి రాజశేఖరరెడ్డి మాత్రమే. ఆ గ్రామానికి బీటీ రోడ్డుకు నిధులు కేటాయించిందీ ఆయనే. జామి మండలంలో మూతపడి ఉన్న భీమసింగి చక్కెర కర్మాగారాన్ని తెరిపించి చెరుకు రైతుల జీవితాల్లో తీపి నింపారు. రాజన్న మరణానంతరం మళ్లీ ఆ ఫ్యాక్టరీ మూతపడింది.
తోటపల్లితో మూడు జిల్లాల్లో ప్రగతి...
విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రగతికి మూలకారకంగా తోటపల్లి ప్రాజెక్టు ఉంది. వాస్తవానికి ఇప్పుడు ప్రాజెక్టు ఉన్న తోటపల్లి ప్రాంతానికి దిగువన నాగావళి నదిపై బ్యారేజీ ఉండేది. 64 వేల ఎకరాలకు సాగునీరు అందించే దీన్ని బ్రిటిష్ వారి హయాంలో నిర్మించారు. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రాజెక్టును నిర్మిస్తానంటూ 2003 సంవత్సరంలో చంద్రబాబు ఎన్నికలకు కొద్దిరోజుల ముందు హడావుడిగా శంకుస్థాపన చేసేశారు. తర్వాత దాని ఊసే తేలేదు. 2004వ సంవత్సరంలో అధికారం చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలనా అనుమతులు ఇచ్చారు.
దాదాపు 2 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు అందించే ఈప్రాజెక్టు నిర్మాణానికి రూ.450.23 కోట్లు నిధులు మంజూరు చేశారు. పల్లెబాట కార్యక్రమంలో భాగంగా 2004 అక్టోబరు 17వ తేదీన ఆయనే స్వయంగా వచ్చి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఆయన హయాంలోనే భూసేకరణ, పునరావాసం పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టు పనులు కూడా 81 శాతం అయిపోయాయి. ఆయన అకాల మరణం తర్వాత ముఖ్యమంత్రులైన వారెవ్వరూ పెండింగ్ పనులపై దృష్టిపెట్టలేదు. మళ్లీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే పెండింగ్ పనుల్లో కదలిక వచ్చింది. ఆధునికీకరణకు, హెడ్ వర్క్‌లను పూర్తి చేయడానికి నిధులు కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment