గ్రీన్ కెమిస్ట్రీ రంగంలో అధిక ఉద్యోగావకాశాలు
విజయనగరం అర్బన్:
గ్రీన్ కెమిస్ట్రీ రంగంలో ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉంటాయని, ఆ దిశగా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీవీ కట్టిమణి అన్నారు. వర్సిటీ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘గ్రీన్ అండ్ సస్టైనబుల్ కెమిస్ట్రీ’ అనే అంశంపై రెండురోజుల పాటు నిర్వహించే జాతీయ సదస్సును ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా నైపుణ్యం, పరిశోధన ఆధారిత ఆవిష్కరణ సవాళ్ల పరిష్కారానికి వర్సిటీ కట్టుబడి ఉందన్నారు. ప్రపంచ స్థాయిలో గల వివిధ పర్యావరణ సవాళ్లను పరిష్కరించేందుకు కెమిస్ట్రీలో కొత్త పద్ధతులను అన్వేషించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. సాయి ఫార్మాస్యూటికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర్ బీవీ శశిధర్, హైదరాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అఖిల కుమార్ సాహూ మాట్లాడుతూ పర్యావరణ అనుకూల రసాయన ప్రక్రియల ప్రాముఖ్యత, స్థిరమైన పారిశ్రామిక పద్ధతుల అవసరం, గ్రీన్ కెమిస్ట్రీలో తాజా పరిశోధన ధోరణులను వివరించారు. వివిధ యూనివర్సిటీల నుంచి వచ్చిన ప్రొఫెసర్ జి.సత్యనారాయణ (ఐఐటీ హైదరాబాద్), డాక్టర్ రాంబాబు దండేలా (ఐసీటీ భువనేశ్వర్), డాక్టర్ యాదగిరి డొంగారి (రూర్కీ ఐఐటీ), డాక్టర్ తిరుపతి బార్గా (ఐఐఎస్‌ఈఆర్ బెర్హంపూర్), ప్రొఫెసర్ రాజశేఖర్‌రెడ్డి (వీఐటీ వెల్లూరు) పాల్గొని రసాయనిక శాస్త్ర రంగంలోని ఉద్యోగ అవకాశాలను, నూతన పోకడలు, పరిశోధనాంశాలు, నైపుణ్యాన్ని ప్రెజెంటేషన్ చేశారు. సెమినార్ కన్వీనర్, రసాయనిక శాస్త్ర విభాగధిపతి ప్రొఫెసర్ ఎం.శరత్‌చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో సెమినార్ కో కన్వీనర్స్ డాక్టర్ సురేష్‌బాబు, డాక్టర్ పడాల కిషోర్, రిజిస్ట్రార్, డీన్స్‌లు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథులను సత్కరించారు.
గిరిజన వర్సిటీ వీసీ ప్రొఫెసర్
టి.వి.కట్టిమణి
Comments
Please login to add a commentAdd a comment