వినతుల పరిష్కారంలో జాప్యంపై కలెక్టర్ ఆగ్రహం
కొత్తవలస: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు అందిన వినతుల పరిష్కారంలో జాప్యంపై కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కొత్తవలస తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. కార్యాలయంలో నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్‌పై సమీక్షించారు. సుమారు 57 వినతుల పెండింగ్‌లో ఉండడంపై తహసీల్దార్ బి.నీలకంఠరావును ప్రశ్నించారు. అర్జీలు పెట్టుకున్న కొంతమంది ఫిర్యాదుదారులను కార్యాలయానికి రప్పించి కలెక్టర్ మాట్లాడారు. కొత్తవలస గ్రామానికి చెందిన గొరపల్లి గణేష్ అర్జీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించి తనకు రావాల్సిన భూమి ఇప్పించాలని ఏళ్లతరబడి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదంటూ వాపోయాడు. దీంతో పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కార్యాలయానికి అర్జీ పెట్టుకున్నట్లు వెల్లడించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ వీలైనంత త్వరలో న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. వినతుల పరిష్కారంలో అలసత్వం వహించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీసీఎల్‌ఏకు నివేదిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. సమీక్ష సమావేశంలో ఆర్డీఓ డి.కీర్తి, సర్వేశాఖ ఎ.డి. కె.వెంకటరమణ, తహసీల్దార్ బి.నీలకంఠరావు, డీటీ పప్పుహరి, ఆర్‌ఐ రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment