ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలి

Published Sun, Jun 23 2024 12:40 AM | Last Updated on Sun, Jun 23 2024 12:40 AM

ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలి

వనపర్తి: జిల్లాలో అవకాశం ఉన్న ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు ప్రయత్నించాలని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో విద్య, వైద్యం, విద్యుత్‌, నీటిపారుదల శాఖలపై సంబంధిత అధికారులతో కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలని, ఉపాధ్యాయులు సకాలంలో విధులకు హాజరుకావాలని, విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ ఉండాలని సూచించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు సకాలంలో అందించాలని, అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి పనులు త్వరితగతిన, నాణ్యతగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ, ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా 2017–18 తర్వాత మంజూరైన, నిర్మాణం పూర్తికాని సబ్‌స్టేషన్ల వివరాలు అడిగి తెలుసుకొని సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. మొత్తం 13 సబ్‌స్టేషన్లు మంజూరుకాగా.. ఆరింటి పనులు కొనసాగుతున్నాయని, నాలుగు పనులు టెండరు దశలో ఉన్నాయని, ఇంకా రెండు స్థలం అప్పగించే దశలో ఉన్నాయని, మరొకటి కోర్టు కేసు కారణంగా పెండింగ్‌లో ఉన్నాయని, త్వరలోనే పూర్తి నివేదిక అందిస్తామని వివరించారు. జిల్లావ్యాప్తంగా గృహజ్యోతి పథకం 63 వేల మంది వినియోగదారులకే వర్తించిందని.. మిగతా వారి పరిస్థితి ఏమిటని మంత్రి ప్రశ్నించారు. ప్రజాపాలన దరఖాస్తుల్లో సమస్యల కారణంగా కొందరికి వర్తించలేదని చెప్పారు. సాగునీటి కాల్వల్లో జమ్ము, పూడిక తొలగింపునకు డీ షిల్టింగ్‌ ప్రక్రియ చేపట్టాలన్నారు. జిల్లాలో 70 మినీ లిఫ్ట్‌ల మోటార్లు పని చేయడం లేదని.. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖలపై ప్రణాళికాబద్ధంగా సమీక్షలు నిర్వహించి సమస్యలు పరిష్కరించడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా పాలనకు సహకారం అందించాలని మంత్రి, ఎమ్మెల్యే కలెక్టర్‌కు సూచించారు.

వైద్యాధికారులు నిర్లక్ష్యం వీడాలి : ఎమ్మెల్యే

అత్యవసర సమయాల్లో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే వారిని రెఫర్‌ చేసే సంస్కృతికి వైద్యాధికారులు స్వస్తి పలకాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సూచించారు. వైద్యులు, సిబ్బంది ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా నాణ్యమైన వైద్యసేవలందించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత, శిశు మరణాలపై ఆరా తీశారు. జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో నిరుపయోగంగా ఉన్న విలువైన పరికరాలను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంచిత్‌ గంగ్వార్‌, ఎం.నగేష్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పి.మహేష్‌, వైస్‌ చైర్మన్‌ పి.కృష్ణ, ఎంపీపీ కిచ్చారెడ్డి, ఆయా శాఖల అఽధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement