మొలచింతలపల్లి ఘటనలో కొత్త కోణం | - | Sakshi
Sakshi News home page

మొలచింతలపల్లి ఘటనలో కొత్త కోణం

Published Mon, Jun 24 2024 12:24 AM | Last Updated on Mon, Jun 24 2024 12:24 AM

మొలచింతలపల్లి ఘటనలో కొత్త కోణం

సాక్షి, నాగర్‌కర్నూల్‌/ కొల్లాపూర్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం మొలచింతలపల్లిలో చెంచు మహిళ కాట్రాజు ఈశ్వరమ్మపై పాశవిక దాడి ఘటనలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఈశ్వరమ్మపై అదే గ్రామానికి చెందిన బండి వెంకటేష్‌, శివ కుటుంబీకులు దాడి ఘటనతో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఆమె చిన్నమామ నాగన్నను హత్య చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 3న కాట్రాజు నాగన్న(56) అనుమానాస్పద రీతిలో మరణించగా.. పోస్టుమార్టం నిర్వహించకుండానే అంత్యక్రియలు జరిపారు. నాగన్న మృతిచెందిన తీరుపై కుటుంబీకులకు అనుమానాలు ఉన్నప్పటికీ వారి భూమిని కౌలు చేస్తున్న వెంకటేశ్‌ కుటుంబ సభ్యులు గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించేలా వారిపై ఒత్తిడి చేశారని చెబుతున్నారు. తాజాగా ఈశ్వరమ్మపై అమానుష దాడి నేపథ్యంలో నాగన్నను హత్య చేశారన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఆమైపె జరిగిన దాడి విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడం, రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు వారికి మద్దతుగా నిలుస్తుండడంతో నాగన్న కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించేందుకు ముందుకు వచ్చారు. ఎస్పీ కార్యాలయానికి వెళ్లి నాగన్న మృతిపై విచారణ జరపాలని పోలీసు అధికారులను కోరారు. ఆదివారం మొలచింతలపల్లికి వచ్చిన జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోతు హుస్సేన్‌నాయక్‌కు వివరాలు వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని హుస్సేన్‌నాయక్‌ నాగర్‌కర్నూల్‌ డీఎస్పీ శ్రీనివాస్‌యాదవ్‌ను ఆదేశించారు. దాడి, హత్య రెండు ఘటనలు యాధృశ్చికంగా జరిగినవి కావని, భూమికి కోసం జరిగాయని చెంచులు ఆరోపిస్తున్నారు.

ఆరు నెలల క్రితం..

మొలచింతలపల్లి గ్రామం భ్రమరాంబ కాలనీకి చెందిన కాట్రాజు వీరస్వామి, నాగన్న అలియాస్‌ నాగడు అన్నదమ్ములు. చింతలచెరువు సమీపంలోని సర్వే నం.171లో వంశపారంపర్యంగా వచ్చిన భూమి చెరో 2.5 ఎకరాలు ఉంది. వీరస్వామి భాగానికి వచ్చిన భూమిని అదే గ్రామానికి చెందిన బండి వెంకటేష్‌ కుటుంబీకులు గత కొన్నేళ్లుగా కౌలుకు తీసుకొని సేద్యం చేస్తున్నారు. వీరస్వామి కుమారుడు ఈదన్న ఆయన భార్య ఈశ్వరమ్మలను వెంకటేష్‌ కుటుంబీకులు ఏడాదికి రూ.30 వేలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకొని జీతం పెట్టుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ తమ సొంత పొలంలోనే జీతగాళ్లుగా పనిచేస్తూ వచ్చారు. పొలం పనిలేనప్పుడు వెంకటేష్‌ కుటుంబీకులు నిర్వహించే అక్రమ ఇసుక దందాలో ఇసుక ఫిల్టర్‌ పనులకు వెళ్లేవారు. ఇంటి వద్ద పనులు కూడా చేసేవారు. వీరస్వామికి చెందిన వ్యవసాయ పొలానికి చిలుకల చెరువు నుంచి నీటి వసతి ఉండడంతో ఎలాగైనా ఆ భూమిని కొనుగోలు చేయాలని వెంకటేష్‌, శివ భావించారు. ఆరు నెలల క్రితం 2.5 ఎకరాల భూమిని రూ.4.50 లక్షలకు కొనుగోలు చేసేందుకు బేరం కుదుర్చుకున్నారు. బయటి మార్కెట్‌లో ఆ భూమి ధర రూ.25– 30 లక్షల వరకు పలుకుతుంది. ఈ విషయం తెలుసుకున్న నాగన్న కుటుంబీకులు భూ విక్రయానికి అడ్డుపడ్డారు. దీంతో బండి వెంకటేష్‌ కుటుంబీకులకు, నాగన్న కుటుంబీకులకు మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే జూన్‌ 3న నాగన్న రాయరాసుల పెంటలో ఉండే తన బావ గురువన్న వద్దకు వెళ్లి తిరిగిరాలేదు. రాయరాసుల పెంట సమీపంలోనే ఓ బండ వద్ద నాగన్న చనిపోవడం, అతని ఒంటిపై గాయాలు ఉండటంతో ఎవరో చంపేసి ఉంటారన్న అనుమానంతో పోలీసులకు చెప్పి పోస్టుమార్టం చేయించాలని కుటుంబీకులు భావించారు. అయితే ఆయన అనారోగ్యంతో మరణించాడని, పోస్టుమార్టం వద్దని వెంకటేశ్‌ తమను సముదాయించినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నాగన్నను భూమి కోసమే వెంకటేష్‌, శివ కుటుంబీకులే హత్య చేశారని ఆరోపిస్తున్నారు. వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని, పోలీసులే రక్షణ కల్పించాలని, భూములు కాపాడాలని కోరారు.

గతంలోనూ దాడి..

చెంచు మహిళ ఈశ్వరమ్మపై గతంలోనూ నిందితులు దాడికి పాల్పడినట్లు తెలిసింది. ఈశ్వరమ్మను కొడుతూ కారం చల్లుతున్న వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ఈశ్వరమ్మ చిన్న మామ నాగన్న కూడా కనిపిస్తుండటంతో గతంలో ఆమెను కొడుతున్న సందర్భంలో సదరు వీడియో తీసినట్లు తెలుస్తోంది. ఈశ్వరమ్మపై పలుమార్లు దాడులకు పాల్పడిన నిందితుల కుటుంబ సభ్యులు అందరిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు.

చెంచు మహిళపై దాడికి ముందే ఆమె చిన్నమామ నాగన్న

అనుమానాస్పద మృతి

ఈశ్వరమ్మ భూమిని తక్కువ ధరకే కొనుగోలుకు వెంకటేష్‌ కుటుంబీకుల యత్నం

భూమి విక్రయానికి

అడ్డుపడిన నాగన్న

మృతదేహానికి పోస్టుమార్టం

నిర్వహించకుండా దగ్గరుండి

అంత్యక్రియలు చేయించిన వైనం

తాజాగా దాడి నేపథ్యంలో హత్య చేశారన్న అనుమానాలు.. విచారణ జరపాలని ఎస్పీకి ఫిర్యాదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement