మినిష్టర్‌ రాముడు | - | Sakshi
Sakshi News home page

మినిష్టర్‌ రాముడు

Published Thu, Jun 13 2024 12:38 AM | Last Updated on Thu, Jun 13 2024 7:01 AM

-

రాయచోటి ఎమ్మెల్యే రామ్‌ప్రసాద్‌రెడ్డిని వరించిన మంత్రి పదవి

ఎమ్మెల్యే కావాలన్న ఇరవై ఏళ్ల చిరకాలవాంఛ నెరవేరిన సమయం

పైగా మంత్రి హోదా దక్కడంతో డబుల్‌ ధమాకా

నియోజకవర్గానికి తొలిసారి దక్కిన మంత్రి పదవి

కడప, రాజంపేట, తిరుపతి, చిత్తూరు లోకసభ స్థానాల పరిధిలో ఏకై క మంత్రి

సాక్షి ప్రతినిధి, కడప : ఆయన ఎమ్మెల్యే కావాలన్న చిరకాలవాంఛ తీరింది. ఇరువై ఏళ్లుగా నిరీక్షణకు ఫలితం దక్కింది. ఆపై ఏకంగా మంత్రి హోదా వరించడంతో డబుల్‌ ధమాకా వచ్చినట్లయింది. వెరసి ఇప్పటివరకు రాయచోటి నియోజకవర్గ చరిత్రలో మంత్రి పదవి దక్కించుకున్న తొలి ఎమ్మెల్యే అయ్యాడు. దీంతో ఇప్పటివరకు ‘రాముడూ’అంటూ ఆయనను ముద్దుపేరుతో పిలిచేవారంతా ఇకపై ‘మినిష్టర్‌ రాముడు’ అని సంబోధిస్తున్నారు.

రాజకీయ నేపథ్యం
రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలానికి చెందిన మండిపల్లి రామ్‌ప్రసాద్‌ రెడ్డి తండ్రి నాగిరెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా 1991లో రోడ్డుప్రమాదంలో మృతిచెందాడు. దీంతో 1992లో జరిగిన ఉప ఎన్నికల్లో నాగిరెడ్డి సోదరుడి కుమారుడైన నారాయణరెడ్డి కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి గెలుపొందారు. తర్వాత 1994లో మళ్లీ గెలిచి 1999 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తల్లి సుశీలమ్మ ఎంపీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. అక్క మిన్నంరెడ్డి శ్రీలతారెడ్డి 2004లో ఎమ్మెల్యేగా పోటీచేసి 3600 ఓట్ల స్వల్పతేడాతో ఓడిపోయారు.

ఎమ్మెల్యే టికెట్‌ ఖరారయ్యాక..
మండిపల్లి ప్రసాద్‌రెడ్డికి 2004లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాయచోటి ఎమ్మెల్యే టికెట్‌ అనధికారికంగా ఖరారయ్యింది. అప్పట్లో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అభయం దక్కింది. తీరా చూస్తే అప్పటికి ఎమ్మెల్యే అభ్యర్థికి ఉండాల్సిన కనీస వయస్సు రామ్‌ప్రసాద్‌రెడ్డికి లేదు. దీంతో ఆయన సోదరి శ్రీలతారెడ్డికి ఎమ్మెల్యే టికెట్‌ దక్కింది. ఆమె స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. తర్వాత 2009 సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడ్డారు. మారిన పరిిస్థితుల నేపధ్యంలో 2012 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014లో సమైక్యాంధ్ర (మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ) తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. 2019లో మరోమారు ప్రధాన పార్టీల టికెట్‌ ఆశించి భంగపడ్డారు. చివరికి 2024లో ఎన్‌డీఎ కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిత్వం అనూహ్యంగా మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డికి దక్కింది. 2004లో లభించాల్సిన కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ మిస్‌ కావడం, ఇరవై ఏళ్ల తర్వాత టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా విజయం సాధించడం విశేషంగా చెప్పుకోవచ్చు.

ఎమ్మెల్యే, మంత్రిగా డబుల్‌ ధమాకా
రాయచోటి ఎమ్మెల్యేగా పోటీచేసిన రామ్‌ప్రసాద్‌రెడ్డికి మరోమారు ఓటమి తప్పదని విశ్లేషకులు అంచనావేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించి, విశేష అభివృద్ధి చేపట్టడం, ముస్లిం మైనార్టీ ఓటర్లు గణనీయంగా ఉండటంతో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థికి ఓటమి తప్పదని భావించారు. అనూహ్యంగా అక్కడి నుంచి స్వల్ప మెజార్టీ 2,485 ఓట్ల ఆధిక్యతతో టీడీపీ అభ్యర్థిగా మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి గెలుపొందారు. 2004 నుంచి ఎమ్మెల్యేగిరి ఆశిస్తూ వచ్చిన ఆయనకు 2024లో కోరిక నెరవేరింది. రాముడు ఎమ్మెల్యే అయ్యారని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుండగా, అంతలోనే అనూహ్యంగా మంత్రి పదవి వరించింది. దీంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

18వ ఎమ్మెల్యేగామండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి
రాయచోటి : మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డికి రాష్ట్ర క్యాబినేట్‌లో చోటు దక్కడం రాయచోటి రాజకీయ చరిత్రలో చెరగని అధ్యాయంగా నిలిచింది. ఎమ్మెల్యేగా తొలిసారిగా గెలవడం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినేట్‌లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రాయచోటి వాసుల కల నెరవేరినట్‌లైంది. రాయచోటి అసెంబ్లీ స్థానికి 18వ ఎమ్మెల్యేగా మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి ఎన్నికయ్యారు. కాగా రాయచోటి నియోజకవర్గంలో 2004 నుంచి ఎమ్మెల్యే కావాలన్న కోరికతో రాంప్రసాద్‌ రెడ్డి 20 సంవత్సరాలపాటు నిరంతర రాజకీయ పోరాటం చేశారు. నేరుగా మంత్రి హోదాలో శాసనసభలో అడుగుపెట్టడం ఆయన కష్టానికి, పోరాటానికి దక్కిన అదృష్టఫలం.

రాయచోటికి తొలిసారి మంత్రిపదవి
రాయచోటి నియోజకవర్గ చరిత్రలో తొలిసారి మంత్రియోగం దక్కింది. ఇప్పటి వరకూ మహామహులు ఎమ్మెల్యేలుగా కొనసాగినా, వారికి అలాంటి అదృష్టం పట్టలేదు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై న రామ్‌ప్రసాద్‌రెడ్డికి (42) పిన్నవయస్సులోనే ఈ అవకాశం లభించింది. వై.ఆదినారాయణరెడ్డి, హబీబుల్లా, మండిపల్లి నాగిరెడ్డి, పాలకొండ్రాయుడు, మండిపల్లి నారాయణరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డిలాంటి నాయకులు పలు పర్యాయాలు ఎమ్మెల్యేలుగా ఎన్నికై నా వారెవ్వరికి లభించని అవకాశం రామ్‌ప్రసాద్‌రెడ్డికి దక్కింది. కాగా ప్రస్తుత మంత్రివర్గంలో చంద్రబాబును ముఖ్యమంత్రిగా మినహాయిస్తే రాజంపేట, కడప, చిత్తూరు, తిరుపతి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఏకై క మంత్రిగా రామ్‌ప్రసాద్‌రెడ్డి ఉండటం విశేషం.

పేరు : మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి

విద్యార్హత : బీడీఎస్‌ (డిస్‌కంటిన్యూ)

జననం : 19–03–1980

తండ్రి : మండిపల్లి నాగిరెడ్డి,

మాజీ ఎమ్మెల్యే

(1985–89, 1989–91)

తల్లి : మండిపల్లి సుశీలమ్మ,

మాజీ ఎంపీపీ

కవల సోదరుడు : డాక్టర్‌ మండిపల్లి

లక్ష్మీప్రసాద్‌ రెడ్డి

(బెంగళూరులో స్థిరపడ్డారు)

వదిన : సౌమ్యరెడ్డి

అక్క : మిన్నంరెడ్డి శ్రీలతారెడ్డి,

మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి

చెల్లెలు : శ్రీవిద్య

సతీమణి : హరితారెడ్డి

సంతానం : 1. నిశ్చల్‌ నాగిరెడ్డి

2. నాగ వైష్ణవిరెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement