union budget 2024
ప్రధాన వార్తలు

‘ఏఐ ఏమైనా చేయగలదు’: సత్య నాదెళ్ల వీడియోకి మస్క్ రిప్లై
ఏఐని ఎక్కువగా విశ్వసించే ఎలాన్ మస్క్ (Elon Musk).. ఈసారి వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై విశ్వాసం వ్యక్తం చేశారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన వీడియోను టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ రీషేర్ చేస్తూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని మరింత నొక్కిచెప్పారు. "కృత్రిమ మేధ ప్రతిదాన్ని మెరుగుపరుస్తుంది" అని పేర్కొన్నారు.రైతులు తక్కువ వనరుల వినియోగంతో ఉత్పాదకతను పెంచడానికి కృత్రిమ మేధ ఆధారిత పరిష్కారాలు ఎలా సహాయపడతాయో ఈ వీడియో చూపిస్తుంది. కృత్రిమ మేధ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గణనీయంగా ప్రయోజనం పొందిన భారతదేశంలోని బారామతి సహకార సంఘానికి చెందిన ఒక రైతు ఉదాహరణను సత్య నాదెళ్ల ఉదహరించారు.తక్కువ భూమి ఉన్న రైతులు పంట దిగుబడిలో గణనీయమైన మెరుగుదలను చూశారని, రసాయనాల వాడకం తగ్గిందని, నీటి నిర్వహణ మెరుగైందని చెప్పుకొచ్చారు. జియోస్పేషియల్ డేటా, డ్రోన్లు, ఉపగ్రహాల నుంచి ఉష్ణోగ్రత డేటా, రియల్ టైమ్ సాయిల్ అనాలిసిస్ ద్వారా ఈ సమాచారం మొత్తాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనుసంధానం చేస్తుందని తెలిపారు. రైతులు వారి స్థానిక భాషలో ఈ సమాచారాన్ని పొందవచ్చు.రియల్ టైమ్ అగ్రికల్చర్ డేటాతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మిళితం చేయడం ద్వారా రైతులు మరింత సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవచ్చని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ఇది సుస్థిర వ్యవసాయ పద్ధతులకు దారితీస్తుందని, సామర్థ్యాన్ని పెంచుతుందని వివరించారు.ఆ వీడియో ఇదే.. మీరూ చూసేయండి..A fantastic example of AI's impact on agriculture. pic.twitter.com/nY9o8hHmKJ— Satya Nadella (@satyanadella) February 24, 2025

హైదరాబాద్‌లో టూరిస్ట్ ఇళ్లు.. సకల వసతులు
సాక్షి, సిటీబ్యూరో: వేసవి సెలవుల్లో సేద తీరడానికి పలు కుటుంబాలు పర్యాటక ప్రదేశాలకు వెళ్తుంటాయి. కానీ, అక్కడి వసతి ఎలా? హోటళ్లలో ఉండాలంటే.. కాస్త ఖర్చు ఎక్కువే. నచ్చిన వంట వండుకోలేం. సరైన ఆతిథ్యాన్ని స్వీకరించలేం. వాళ్లు పెట్టినవాటిలో నుంచి ఎంపిక చేసుకొని తినాలి. దీనికి పరిష్కారం చూపించేవే పర్యాటక విడిదులు. స్టార్ హోటళ్లను తలదన్నేలా ఆధునిక వసతులు అందించడమే ఈ టూరిస్ట్ ఇళ్ల ప్రత్యేకత.ఇళ్లు.. హోం స్టేలుగా! భాగ్యనగరం అంటేనే చక్కని ఆతిథ్యానికి చిరునామా. అందుకే విదేశీ పర్యాటకులు ఇక్కడి ఆత్మీయత, ఆతిథ్యానికి ముగ్ధులవుతుంటారు. ఈ ఆనందాన్ని ద్విగుణీకృతం చేసేందుకు పర్యాటక శాఖ హోం స్టే పథకం ప్రవేశపెట్టింది. ఇదే తరహాలో పలు ప్రైవేట్ సంస్థలూ సేవలందిస్తున్నాయి. నగరంలోని గృహ యజమానులు తమ ఇళ్లను అద్దెకు ఇచ్చే బదులుగా ఇలా హోంస్టే సంస్థలతో ఒప్పందం చేసుకుంటున్నారు. ఆకట్టుకునేలా గృహాలను తీర్చిదిద్ది, అన్ని సౌకర్యాలు కల్పించి, పర్యాటకులకు తాత్కాలికంగా కిరాయికి ఇస్తున్నారు.అన్ని రకాల వసతులు.. ఎయిర్ బీఎన్‌బీ, వీఆర్బో, బుకింగ్.కామ్, మేక్ మై ట్రిప్, ట్రావెల్ స్టేషన్, హోమ్ టుగో వంటి సంస్థలు హోం స్టే సేవలను అందిస్తున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాలతోపాటు పర్యాటక ప్రాంతాలు, బీచ్‌లు, తీర్థయాత్రలు అన్నిచోట్లా టూరిస్ట్ ఇళ్లు అందుబాటులో ఉన్నాయి. కిచెన్, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి అన్ని రకాల వసతులు ఈ హోం స్టేలలో ఉంటాయి. సౌకర్యాలను బట్టి అద్దె ఒక రాత్రికి రూ.5 వేల నుంచి ఉంటాయి.ఆయా పర్యాటక ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న హోం స్టేల వివరాలను సంస్థలు తమ వెబ్‌సైట్లలో పొందుపరుస్తున్నాయి. వారికి అనువైన వసతిని వెతుక్కోవచ్చు. ఇందులోనే ధరలను కూడా నిర్ణయిస్తారు. వండి వడ్డించే భోజనం వివరాలు కూడా ఉంటాయి. విమానాశ్రయం నుంచి నేరుగా బస చేసే ఇంటికి వచ్చి ఆతిథ్యాన్ని అందుకోవచ్చు.

ఖజానాకు చేరిన గత బడ్జెట్ కేటాయింపులు
భారత ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌ను కేటాయించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను కొన్ని శాఖలు పూర్తిస్థాయిలో అప్పటి బడ్జెట్ నిధులను ఉపయోగించలేదు. మూలధన పెట్టుబడులు, వస్తువుల కొనుగోళ్లలో జాప్యం కారణంగా కొంతమేర నిధులు బూ తిరిగి ఖజానాకు చేరాయి. ఏయే విభాగాలు ఎంతమేరకు ఇలా నిధులు తిరిగి పంపాయో.. అందుకుగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.కొన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు తమకు కేటాయించిన బడ్జెట్‌ను 2024-25 ఆర్థిక సంవత్సరంలో పూర్తిస్థాయిలో వినియోగించుకోలేదు. కొనుగోలు ప్రక్రియల్లో జాప్యం, ఇతర బ్యూరోక్రాటిక్ అడ్డంకుల కారణంగా రక్షణ మంత్రిత్వ శాఖ రూ.12,500 కోట్లు తిరిగి కేంద్ర ఖజానాకు జమ చేసింది. ప్రభుత్వం కఠినమైన ఆర్థిక విధానాలు, మెరుగైన ఆర్థిక నిర్వహణ పద్ధతుల ద్వారా భారీగా ఖర్చు చేయడాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఖర్చులను ఆదాయ ఉత్పత్తికి అనుగుణంగా ఉండేలా చూసుకుంటున్నాయి. ఇది ఆర్థిక జాప్యాన్ని నివారించడానికి, సమతుల్య బడ్జెట్‌ను నిర్వహించడానికి తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: 100 మంది వాట్సప్ యూజర్లపై స్పైవేర్ దాడి..?మెరుగైన పన్ను వసూలు యంత్రాంగాలు, పన్ను ఎగవేతను అరికట్టడంతో సహా సమర్థమైన ఆదాయ సమీకరణ ప్రయత్నాల వల్ల కొంత బడ్జెట్‌ను మిగిల్చింది. కొన్ని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, విదేశీ ప్రభుత్వాల మద్దతు వల్ల ద్రవ్యలోటును నిర్వహించడానికి, బడ్జెట్ అమలు సజావుగా జరిగేలా చూడటానికి సాయపడిందని నిపుణులు తెలియజేస్తున్నారు. నిధుల రాబడి, ఆర్థిక క్రమశిక్షణ, సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ పట్ల ప్రభుత్వం నిబద్ధతతో ఉందని చెబుతున్నారు.

పంచరంగుల చిత్రం
గమ్యస్థానం: వికసిత భారత్ దారిదీపం: సమష్టి కృషి ఇంధనం: కొత్త తరం సంస్కరణలు స్థూలంగా చెప్పాలంటే 2025–25 కేంద్ర బడ్జెట్లో నిర్మలమ్మ( Nirmala Sitharaman) ఆవిష్కరించిన పంచ రంగుల చిత్రం సారాంశమిదే! మధ్య తరగతి కొనుగోలు శక్తిని, తద్వారా అంతిమంగా ఆర్థిక వృద్ధి రేటును ఇతోధికంగా పెంచడం, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను విస్తృతపరచడమనే మోదీ ప్రభుత్వ లక్ష్యాలను బడ్జెట్లో ఘనంగానే ఆవిష్కరించారు విత్త మంత్రి. ‘‘ఇది సామాన్యుల బడ్జెట్. 2047 నాటికి వికసిత భారత్ కల సాకారం దిశగా ఇదో పెద్ద ముందడుగు’’ అని చెప్పుకున్నారు. పౌరులందరి ప్రగతే (సబ్ కా వికాస్) లక్ష్యంగా పలు పథకాలను, చర్యలను ప్రతిపాదించారు. ‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అన్న తెలుగువారి అడుగుజాడ గురజాడ పంక్తులతో ప్రసంగం మొదలు పెట్టారు. ‘పేదరికం లేని సమాజం, అందరికీ అందుబాటులో ఉండే నాణ్యమైన, పాఠశాల విద్య, వైద్య సదుపాయాలు, నైపుణ్యంతో కూడిన కార్మిక శక్తి–వారికి మెరుగైన ఉపాధి, మహిళల్లో కనీసం 70 శాతం మందికి ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వామ్యం, భారత్‌ను ప్రపంచ ఆహార పాత్రగా తీర్చిదిద్దేలా రైతన్నకు వెన్నుదన్నుగా నిలవడం’ తమ ప్రభుత్వ లక్ష్యాలని పేర్కొన్నారు.వాటి సాధనకు ‘ఆర్థిక వృద్ధి–ఉత్పాదకత, గ్రామీణ స్వావలంబన, వృద్ధి పథంలో సమష్టి అడుగులు, మేకిన్ ఇండియా ద్వారా నిర్మాణ రంగానికి పెద్దపీట, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మరింత తోడ్పాటు, ఉద్యోగిత ఆధారిత వృద్ధి, మానవ వనరులపై భారీ పెట్టుబడులు, రక్షిత ఇంధన సరఫరాలు, ఎగుమతులు, ఇన్నోవేషన్లకు ఇతోధిక ప్రోత్సాహం’... ఇలా పది రంగాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రస్థానంలో వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, పెట్టుబడులు, ఎగుమతులను నాలుగు ప్రధాన చోదక శక్తులుగా పేర్కొన్నారు.పన్నులు, ఇంధన, పట్టణాభివృద్ధి, గనులు, ఆర్థికం, నియంత్రణ... ఈ ఆరు కీలక రంగాల్లో వచ్చే ఐదేళ్ల పరిధిలో భారీ సంస్కరణలను ప్రతిపాదించారు. కాకపోతే లక్ష్యాలను ఘనంగా విధించుకున్న మంత్రి, వాటి సాధనకు ఏం చేయనున్నారనేది మాత్రం ఇదమిత్థంగా చెప్పకుండా పైపై ప్రస్తావనలతోనే సరిపెట్టారు. వేతనజీవికి వ్యక్తిగత వార్షిక ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని ఏకంగా రూ.12 లక్షలకు పెంచేశారు. తద్వారా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మధ్య తరగతిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కొత్త ఆదాయ పన్ను బిల్లును వారంలో ప్రవేశపెడతామని తెలిపారు. పన్నుల రంగంలో భారీ సంస్కరణలకు తెర తీస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. మోదీ సర్కారు మానస పుత్రికలైన స్టార్టప్‌లు, డిజిటల్ ఇండియా తదితరాలకు నామమాత్రపు కేటాయింపులతోనే సరిపెట్టారు.న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం 2025–26 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.50,65,345 కోట్లతో కూడిన పద్దును పార్లమెంటుకు సమర్పించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు 4.4 శాతం ఉండొచ్చని మంత్రి జోస్యం చెప్పారు. జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతానికే పరిమితం కావచ్చన్న అంచనాల నేపథ్యంలో సంక్షేమాన్ని, సంస్కరణలను పరుగులు పెట్టించేలా పలు చర్యలను ప్రతిపాదించారు. 74 నిమిషాల బడ్జెట్ ప్రసంగంలో ఆమె ఏమేం చెప్పారంటే... పరిశ్రమలకు మహర్దశ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)ల్లో పెట్టుబడులను రెట్టింపునకు పైగా పెంచనున్నట్టు మంత్రి వివరించారు. ‘‘ప్రస్తుతం కోటికి పైగా ఎంఎస్‌ఎంఈల ద్వారా 7.5 కోట్ల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. వాటికి ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్లకు పైగా రుణ సదుపాయం అందనుంది. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు రుణ పరిమితి రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు, స్టార్టప్‌లకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెరగనుంది. తయారీ రంగంలో మేకిన్ ఇండియాకు మరింత ప్రాధాన్యం దక్కనుంది’’ అని చెప్పారు. చదువుకు జేజే ఈ ఏడాది మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల్లో 10 వేల అదనపు సీట్లు, ఐఐటీల్లో కనీసం 6,500 అదనపు సీట్లు అందుబాటులోకి రానున్నట్టు విత్త మంత్రి ప్రకటించారు. ‘‘రూ.500 కోట్లతో సాగు, ఆరోగ్యం తదితర రంగాల్లో కృత్రిమ మేధలో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటవుతాయి. భారత్‌నెట్ ప్రాజెక్టు కింద గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటికీ బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం అందుబాటులోకి తేనున్నాం. బాలల్లో శాస్త్రీయ జిజ్ఞాసను పెంపొందించేందుకు సర్కారీ స్కూళ్లలో వచ్చే ఐదేళ్లలో 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబులు ఏర్పాటవుతాయి. ‘భారతీయ భాషా పుస్తక్’ పథకంతో స్థానిక భాషల్లోని ప్రభుత్వ పాఠ్య పుస్తకాలన్నీ డిజిటల్ రూపంలో అందుబాటులోకి వస్తాయి’’ అని తెలిపారు. పట్టణాలకు ప్రాధాన్యం పట్టణాలను గ్రోత్ హబ్‌లుగా తీర్చిదిద్దడానికి రూ.లక్ష కోట్లతో అర్బన్ చాలెంజ్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా అమలు చేసే ప్రతి పథకంలోనూ నాలుగో వంతు నిధులను కేంద్రం అందజేస్తుంది. 2047 కల్లా కనీసం 100 గిగావాట్ల అణు విద్యుదుత్పత్తే లక్ష్యంగా న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. మెడికల్ టూరిజానికి ఊపు మెడికల్ టూరిజంలో భాగంగా రూ.20 వేల కోట్లతో ‘హీల్ ఇన్ ఇండియా’ పథకాన్ని ప్రకటించారు. దేశవ్యాప్తంగా మరో 50 పర్యాటక ప్రాంతాలను స్థానిక ఉపాధి కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు. మరో 120 పట్టణాలను ఉడాన్ పథకం పరిధిలోకి తేవడం ద్వారా వచ్చే పదేళ్లలో మరో 4 కోట్ల మందికి విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెస్తామని మంత్రి చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి సింగిల్ విండో సదుపాయంగా ‘భారత్ ట్రేడ్‌నెట్’ను అందుబాటులోకి తెస్తామన్నారు.సాగుకు పట్టం...వ్యవసాయ రంగానికి పట్టం కట్టేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్మల ప్రకటించారు. ‘‘7.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నాం. అసోంలో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంలో భారీ యూరియా ప్లాంటు ఏర్పాటవనుంది. వ్యవసాయోత్పత్తి, నిల్వ సామర్థ్యం పెంపు తదితర లక్ష్యాలతో రాష్ట్రాల భాగస్వామ్యంతో 100 జిల్లాల్లో ప్రధానమంత్రి ధనధాన్య కృషీ యోజన అమలవనుంది.రూరల్ ప్రాస్పరిటీ అండ్ రెజీలియన్స్ పథకంతో ఈ పథకంతో గ్రామీణ మహిళలు, యువ రైతులు, చిన్న, సన్నకారు రైతులకు బాగా లబ్ధి చేకూరుతుంది. వంట నూనెల ఉత్పత్తి తృణధాన్యాల సాగులో ఆత్మనిర్భరత సాధనకు ప్రాధాన్యమిస్తున్నాం. కూరగాయ లు, పళ్ల సాగుకు సమగ్ర పథకం తేనున్నాం. జన్యు బ్యాంకుల ద్వారా విత్తన నిల్వ సా మర్థ్యం పెంపొందిస్తాం’’ అని వివరించారు.ఇది ప్రజల బడ్జెట్: ప్రధాని మోదీన్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ప్రజల బడ్జెట్‌గా అభివర్ణించారు. ఇది ప్రతి భారతీయుడి కలలను నెరవేరుస్తుందని అన్నారు. బడ్జెట్‌లో తీసుకున్న చర్యలవల్ల ప్రజల మధ్య మరింత డబ్బు చలామణి అవుతుందని, ఆయా రంగాల్లో పెట్టుబడులకు ఊతం ఇస్తుందని, ఇది దేశ అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.మరిన్ని రంగాల్లో యువతకు అవకాశాలు కల్పిస్తున్నామని, దీని ద్వారా ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లవచ్చని అన్నారు. పొదుపు, పెట్టుబడులు, వినియోగం, అభివృద్ధి వంటి అంశాలకు ఈ బడ్జెట్ ఊతం కల్పిస్తుందని చెప్పారు. దేశాభివృద్ధికి దోహదపడేలా బడ్జెట్‌ను రూపొందించినందుకు ఆర్థిక మంత్రి నిర్మలతోపాటు దీని రూపకల్పనలో పాలుపంచుకున్న ఆర్థిక శాఖ బృందాన్ని ప్రధాని అభినందించారు. సాధారణంగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేలా బడ్జెట్‌లు ఉంటాయని, కానీ ఈ సారి అందుకు భిన్నంగా ప్రజల చేతుల్లో డబ్బులు ఎక్కువ చెలామణి అయ్యేలా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని కొనియాడారు.రాష్ట్రాలకు 1.5 లక్షల కోట్ల వడ్డీ రహిత రుణాలున్యూఢిల్లీ: మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రాలకు మద్దతుగా నిలిచేందుకు కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కీలక ప్రకటన చేశారు. వడ్డీ లేకుండా రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేకుండా ఈ రుణాలు కేంద్రం ఇస్తుంది. ఈ నిధులను వివిధ రంగాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఖర్చుచేయాల్సి ఉంటుంది. దేశంలో మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు కేంద్రం 2021లో మొదటి అసెట్ మానిటైజేషన్ వ్యూహాన్ని ప్రకటించింది.తాజా బడ్జెట్‌లో 2025–30 కాలానికి సంబంధించి రెండో అసెట్ మానిటైజేషన్ ప్లాన్‌ను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్లాన్‌లో భాగంగా మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.10 లక్షల కోట్ల మూలధన సహకారం అందిస్తారు. ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ ఫండ్ మద్దతుతో రాష్ట్రాలను కూడా ప్రోత్సహిస్తామని మంత్రి తెలిపారు. బడ్జెట్ హైలైట్స్⇒ కొత్త పన్నువిధానంలో రూ.12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయపు పన్ను ఉండదు. వేతన జీవులకు రూ.75వేల స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి రూ.12.75 లక్షల వరకు పరిమితి ఉంటుంది. దీంతో ప్రభుత్వానికి రూ.లక్ష కోట్ల రెవెన్యూ తగ్గిపోతుంది. ⇒ ఏడు టారిఫ్ రేట్ల తొలగింపు ⇒ 82 టారిఫ్ లైన్లపై ఉన్న సామాజిక సంక్షేమ సర్‌చార్జి రద్దు.⇒ అప్పుల ద్వారా ఆదాయం రూ. 34.96 లక్షల కోట్లు, మొత్తం వ్యయం రూ.50.65 లక్షల కోట్లు ⇒ జీడీపీ రెవెన్యూ లోటు 4.4 శాతం ⇒ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రధాన్‌మంత్రి ధన్ ధాన్య యోజనకృషి యోజన ఏర్పాటు. దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లోని 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం ⇒ కంది, మినుములు, పెసర రైతుల ప్రోత్సాహకం కోసం పప్పుధాన్యాల ఆత్మనిర్భర మిషన్ ఏర్పాటు. దీనిద్వారా నాఫెడ్, ఎన్‌సీపీఎఫ్‌లు రైతులనుంచి వచ్చే నాలుగేళ్లలో పప్పుధాన్యాలను సేకరిస్తాయి. ⇒ కూరగాయలు, పండ్లు పండించే రైతుల కోసం సమగ్ర పథకం ⇒ మఖానా విత్తనాల ఉత్పత్తిని పెంచేందుకు బిహార్‌లో మఖానా బోర్డు స్థాపన. అస్సాంలో ఏడాదికి 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉత్పత్తిచేసే యూరియా ప్లాంట్.ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పేదరికం వంటి సమస్యలతో దేశప్రజలు ఇబ్బంది పడుతుంటే బడ్జెట్‌తో ప్రజలను మోసగించే యత్నం చేశారు. పదేళ్లలో మధ్యతరగతి నుంచి రూ.54.18 లక్షల కోట్లను ఆదాయపు పన్నుకింద వసూలు చేసి, ఇప్పుడు రూ.12 లక్షలు సంపాదించే వారికి మినహాయింపులు ఇస్తోంది. –– ఖర్గే, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడుఅభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడంలో ప్రధాని మోదీ విజన్‌కు ఈ బడ్జెట్ అద్దం పడుతోంది. ప్రధాని ఆలోచనంతా మధ్యతరగతి ప్రజల బాగోగులపైనే. రైతులు మొదలుకొని మధ్యతరగతి ప్రజల వరకు.. అన్ని వర్గాల సంక్షేమంపై ఈ బడ్జెట్ దృష్టిపెట్టింది. –– అమిత్‌షా, కేంద్ర హోం మంత్రిబిహార్ అభివృద్ధికి ఈ బడ్జెట్ ఎంతగానో తోడ్పాటునందిస్తుంది. మఖానా బోర్డ్ ఏర్పాటు, గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు.. రాష్ట్ర భవిష్యత్ అవసరాలను తీరుస్తాయి. పట్నా ఐఐటీని విస్తరించాలన్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో సాంకేతిక విద్యకు ఊతం లభిస్తుంది. –– నితీశ్‌కుమార్, బిహార్ సీఎంకోటీశ్వరులకు రుణాలు మాఫీ చేసే విధానానికి స్వస్తి చెప్పి, అలా ఆదాచేసిన డబ్బులను మధ్యతరగతి ప్రజలు, రైతుల సంక్షేమానికి వాడాలని నేను చేసిన సూచనను బడ్జెట్‌లో పరిగణనలోకి తీసుకోకపోవడం నిరుత్సాహపరిచింది. కోటీశ్వరుల రుణమాఫీ కింద పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని వెచ్చించడం సరికాదు. –– కేజ్రీవాల్, ఆప్ జాతీయ కన్వీనర్‌బడ్జెట్‌లో అంకెలకన్నా, కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో ఎంత మంది మరణించారు, ఎంత మంది గల్లంతు అయ్యారన్న విషయమే నాకు ముఖ్యం. తొక్కిసలాటలో ఎంతమంది మరణించారన్న విషయాన్ని ప్రభుత్వం చెప్పలేకపోతోంది. బాధితులు ఇంకా తమ కుటుంబ సభ్యులకోసం వెతుక్కుంటున్నారు. –– అఖిలేశ్ యాదవ్, ఎస్పీ అధినేత వరుసగా 8వసారిదేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అన్న గురజాడ హితోక్తే మా సర్కారుకు స్ఫూర్తిజీవకోటి వానల కోసం ఎదురు చూసినట్టే పౌరులు సుపరిపాలనను అభిలషిస్తారన్న తిరుక్కురళ్ హితవును పన్ను విధానాల రూపకల్పనలో దృష్టిలో ఉంచుకున్నాంఇది సామాన్యుల బడ్జెట్. 2047 నాటికి వికసిత భారత్ కలను సాకారం చేసుకునే దిశగా ఇదో పెద్ద ముందడుగు– బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

సంస్కరణల మోత.. వృద్ధికి చేయూత!
భారత ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని ఎదుర్కొంటోందని ఆర్థిక సర్వే కుండబద్దలు కొట్టింది. మన ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగానే ఉన్న నేపథ్యంలో తక్షణం ఆర్థిక వ్యవస్థకు చికిత్స చేసి, వృద్ధికి చేయూతనివ్వాలంటే... పెట్టుబడులకు అడ్డంకిగా ఉన్న పలు నియంత్రణలను తొలగించడంతో పాటు భూ, కార్మిక తదితర కీలక సంస్కరణలు అమలు చేయాలని తేల్చిచెప్పింది. మరోపక్క, ప్రజల కొనుగోలు శక్తిని పెంచి, వినిమయం భారీగా పుంజుకునేలా చర్యలు చేపట్టాలని సూచించింది. మరికొద్ది గంటల్లో మోదీ 3.0 సర్కారు కీలక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తరుణంలో 2024–25 ఏడాదికి సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంట్‌కు సమర్పించారు. న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం (2025–26)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.3–6.8 శాతానికి పరిమితం కావచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఈ ఏడాది వృద్ధి 6.4 శాతానికి పడిపోవచ్చని ఇప్పటికే కేంద్రం ముందస్తు అంచనాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇది నాలుగేళ్ల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. కరోనా తర్వాత జీడీపీ వృద్ధి రేటు మళ్లీ ఇంతలా బలహీనపడటం ఇదే తొలిసారి. 2023–24 ఏడాదికి వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదైంది. కాగా, 2024 నాటికి వికసిత భారత్ (అభివృద్ధి చెందిన దేశం)గా అవతరించాలంటే వచ్చే ఒకట్రెండు దశాబ్దాల పాటు జీడీపీ ఏటా 8 శాతం చొప్పున వృద్ధి చెందాల్సిన అవసరం ఉందని సర్వే నొక్కి చెప్పింది. ఈ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించాలంటే పలు రంగాల్లో, ముఖ్యంగా భూ, కార్మిక సంస్కరణలు చేపట్టాలని తెలిపింది. అంతేకాకుండా, జీడీపీలో పెట్టుబడుల శాతాన్ని ఇప్పుడున్న 31 శాతం నుంచి 35 శాతానికి పెంచాల్సిందేనని కూడా పేర్కొంది. తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్, బయో టెక్నాలజీ వంటి వర్ధమాన టెక్నాలజీల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించాలని సూచించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనాల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ 2027–28లో 5 ట్రిలియన్ డాలర్లను, 2029–30లో 6.3 ట్రిలియన్ డాలర్లను తాకే అవకాశం ఉంది. ధరలు దిగొస్తాయి... కొత్త పంట చేతికి రావడం, సీజనల్‌గా కొన్ని కూర గాయల ధరలు తగ్గుముఖం పట్టడంతో ఇక ఆహార ద్రవ్యోల్బణం శాంతించే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. ఆర్‌బీఐ ద్రవ్యోల్బణ లక్ష్యం 4%కి అటుఇటుగానే రిటైల్ ద్రవ్యోల్బణం ఉండొ చ్చని పేర్కొంది. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అంతర్జాతీయంగా కమోడిటీ ధరల సెగ వంటి రిస్కులు పొంచిఉన్నాయని తెలిపింది. 2024 డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 4 నెలల కనిష్టమైన 5.2%కి దిగొచ్చింది. అయితే, కూరగాయల ధరల మంటతో ఆహార ద్రవ్యోల్బణం ఇంకా భారీగానే 8.4%గా నమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు తగ్గుతున్నప్పటికీ, భౌగోళిక రాజకీయ రిసు్కలు ఆందోళనకరంగానే ఉన్నా యని కూడా సర్వే పేర్కొంది.నియంత్రణల సంకెళ్లు తెంచాలి... ‘మౌలిక రంగంలో పెట్టుబడులను పెంచాలంటే వ్యవస్థలో పాతుకుపోయిన నియంత్రణ సంకెళ్లను తెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాలు కూడా వ్యాపారాలకు అడ్డంకులుగా నిలుస్తున్న పలు నిబంధనలను సరళీకరించడంతో పాటు పలు రకాల టారిఫ్‌లలో కోత విధించాలి. దేశంలో నవకల్పనలను ప్రోత్సహించి, చిన్న మధ్య తరహా సంస్థల (ఎస్‌ఎంఈ) రంగానికి దన్నుగా నిలిచేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. జర్మనీ, స్విట్జర్లాండ్, జపాన్, సింగపూర్ తదితర దేశాల ఆర్థిక విజయంలో ఎస్‌ఎంఈలు కీలక పాత్ర పోషించాయి. అధిక నియంత్రణ వల్ల ఇన్నోవేషన్, ఆర్థికవ్యవస్థ చురుకుదనానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. ఈ దిశగా భూ, కార్మిక, తదితర సంస్కరణలు అత్యవసరం’ అని సర్వే పేర్కొంది.సర్వేలో ఇతర ముఖ్యాంశాలు... → దేశంలో సేవల రంగం మంచి పనితీరును కనబరుస్తోంది. తయారీ రంగం మా త్రం కొన్ని ప్రాంతాల్లో సమస్యలు ఎదుర్కొంటోంది. → ప్రపంచ ఆర్థిక అనిశి్చతిని సైతం తట్టుకుని మన ఫైనాన్షియల్ రంగం పురోగమిస్తోంది. బ్యాంకులు లాభాలు మెరుగుపడ్డాయి. రుణాలు, డిపాజిట్ల మధ్య వ్యత్యాసం తగ్గుతోంది. → పెట్టుబడులకు దన్నుగా, పొదుపులను మదుపుగా మార్చడంలో, సంపద సృష్టిలో మన క్యాపిటల్ మార్కెట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2013–14 నుంచి 2023–24 మధ్య ఐపీఓ ద్వారా కంపెనీల లిస్టింగ్‌లు ఆరు రెట్లు పెరిగాయి. ఇప్పుడు స్టాక్ మార్కెట్లకు యువ ఇన్వెస్టర్లే చోదక శక్తిగా నిలుస్తున్నారు. → విదేశాల్లో డిమాండ్ తగ్గడంతో ఎగుమతుల వృద్ధి మందగించింది. మరోపక్క, దేశీయంగా పటిష్ట డిమాండ్‌తో దిగుమతులు పెరిగాయి. రక్షణాత్మక ధోరణులు పెరిగిపోవడంతో ప్రపంచ వాణిజ్య ధోరణులు ఆందోళన కలిగిస్తున్నాయి. మన ఎగుమతులకు పోటీతత్వం పెంచాలంటే వ్యూహాత్మక వాణిజ్య రోడ్‌మ్యాప్ అత్యవసరం. → అధిక ప్రభుత్వ వ్యయం, మెరుగుపడుతున్న వ్యాపార విశ్వాసంతో పెట్టుబడులు మళ్లీ పుంజుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. → సమృద్ధిగా 640 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. ఇది 90 శాతం విదేశీ రుణానికి సమానం, అలాగే దాదాపు 11 నెలల దిగుమతులకు సరిపోతాయి. → వ్యాపారాలకు సానుకూల వాతావరణం కల్పించేలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0లో రాష్ట్రాలు మరింత చొరవ తీసుకోవాలి. క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారంపై ఫోకస్ చేయాలి. → అధిక వృద్ధి పథంలో సాగాలంటే వచ్చే రెండు దశాబ్దాల పాటు మౌలిక రంగంలో పెట్టుబడులను దశలవారీగా పెంచాలి. → కార్పొరేట్ రంగం సామాజిక బాధ్యత విషయంలో మరింతగా దృష్టి సారించాలి. → పప్పు ధాన్యాలు, నూనెగింజలు, టమాటా, ఉల్లి ఉత్పత్తిని పెంచేలా పరిశోధనలు జరగాలి. అన్నిరకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే పంట రకాలను రూపొందించడంతో పాటు పంట దిగుబడి పెంచి, పంట నష్టాలను తగ్గించడంపై దృష్టి పెట్టాలి.వ్యవసాయోత్పత్తి పుంజుకోవడం గ్రామీణ డిమాండ్‌కు దన్నుగా నిలుస్తోంది. ఆహార ధరలు శాంతించే అవకాశం ఉండటం, స్థూల ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉన్న నేపథ్యంలో సమీప భవిష్యత్తులో వృద్ధి మళ్లీ పట్టాలెక్కనుంది. భౌగోళిక రాజకీయ, వాణిజ్య అనిశి్చతులతో పాటు కమోడిటీ ధరల షాక్‌లు మన ఆర్థిక వ్యవస్థకు ప్రధాన అడ్డంకులుగా నిలుస్తున్నాయి. అయినప్పటికీ మనదే ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీ. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే వృద్ధిని పరుగులు పెట్టించాల్సిందే’. – వి. అనంత నాగేశ్వరన్, ప్రధాన ఆర్థిక సలహాదారుపటిష్టమైన దేశీ డిమాండ్, పెట్టుబడులు పుంజుకుంటున్న నేపథ్యంలో వృద్ధి కాస్త మెరుగ్గానే (6.5–6.8%) ఉండొచ్చు. వ్యవసాయ దిగుబడుల జోరు, బలమైన సేవల రంగం వృద్ధికి కీలక చోదకాలు. పాశ్చాత్య దేశాల పాలసీలు, భౌగోళిక–ఆర్థిక అడ్డంకులు సరఫరా వ్యవస్థల రూపురేఖలను మార్చేస్తున్నాయి’. – రుమ్కి మజుందార్, డెలాయిట్ ఇండియా ఎకనమిస్ట్‘భారత్ వృద్ధి రేటు జోరును కొనసాగించాలంటే ప్రపంచ దేశాలతో పోటీతత్వాన్ని పెంచుకోవాల్సిందే. నిర్మాణాత్మక సంస్కరణలు, నియంత్రణల తొలగింపు ద్వారానే ఇది సాధ్యం’ – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్

ఆర్థిక సర్వే
అన్ని చేతులూ కలిస్తేనే తయారీ దిగ్గజంభారత్‌ను అంతర్జాతీయ తయారీ కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం, ప్రైవేటు రంగం, విద్యా సంస్థలు, పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) సంస్థలు, ఆర్థిక సంస్థల మధ్య సమన్వయంతో కూడిన సహకారాత్మక చర్యలు అవసరమని ఆర్థిక సర్వే సూచించింది. నియంత్రణలు సడలించడం, అవసరమైన నైపుణ్యాలు, ఉపాధి కల్పన వ్యూహాలు అమలు చేయడం, ఎంఎస్‌ఎంఈలకు ప్రత్యేకమైన మద్దతు చర్యలతో భారత పరిశ్రమల పోటీతత్వాన్ని పెంచొచ్చని అభిప్రాయపడింది. అప్పుడు అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, సవాళ్లను భారత సంస్థలు ఎదుర్కొని రాణించగలవని వివరించింది. బంగారం తగ్గొచ్చు.. వెండి పెరగొచ్చు బంగారం ధరలు ఈ ఏడాది తగ్గొచ్చని, వెండి ధరలు పెరగొచ్చని ఆర్థిక సర్వే అంచనాలు వెల్లడించింది. ప్రపంచ బ్యాంక్ కమోడిటీ మార్కెట్ అవుట్‌లుక్ 2024 నివేదికను ప్రస్తావిస్తూ. కమోడిటీ ధరలు 2025లో 5.1 శాతం, 2026లో 1.7 శాతం తగ్గుతాయన్న అంచనాలను ప్రస్తావించింది. మెటల్స్, వ్యవసాయ ముడి సరకుల ధరలు స్థిరంగా ఉంటాయని, చమురు ధరలు తగ్గొచ్చని, సహజ వాయువు ధరలు పెరగొచ్చని పేర్కొంది. బంగారం ధరలు తగ్గడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపించొచ్చని తెలిపింది. దేశం దిగుమతి చేసుకునే కమోడిటీల ధరలు తగ్గడం అది సానుకూలమని, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లను తగ్గిస్తుందని అభిప్రాయపడింది. చైనాపై ఆధారపడడాన్ని తగ్గించాలి.. ఈవీల తయారీలో స్వావలంబన ఎలక్ట్రిక్ వాహనాలు, ఎల్రక్టానిక్స్ తయారీలో స్వావలంబన దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే నొక్కి చెప్పింది. ముడి సరుకులు, విడిభాగాల కోసం చైనా తదితర కొన్ని దేశాలపై ఎక్కువగా ఆధారపడడాన్ని తగ్గించాలని, సరఫరా వ్యవస్థలోని రిస్‌్కలను తొలగించే చర్యలు చేపట్టాలని సూచించింది. కీలక విడిభాగాలు, ముడి సరుకులపై అంతర్జాతీయంగా చైనా ఆధిపత్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. సంప్రదాయ వాహనంతో పోల్చి చూసినప్పుడు ఈవీల తయారీలో ఆరు రెట్లు అధికంగా ఖనిజాలను వినియోగించాల్సిన పరిస్థితిని ప్రస్తావించింది. ఈ ఖనిజాల్లో చాలా వరకు మన దగ్గర లభించకపోవడాన్ని గుర్తు చేసింది. ‘‘సోడియం అయాన్, సాలిడ్ స్టేట్ బ్యాటరీలు తదితర అత్యాధునిక బ్యాటరీ సాంకేతిక పరిజ్ఞానాలకు పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) నిధులు పెంచడం ద్వారా స్వావలంబన ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించాలి. ఈ విభాగంలో మేధో హక్కులను సంపాదించుకోవాలి. బ్యాటరీ రీసైక్లింగ్ సదుపాయాలపై పెట్టుబడులు పెట్టాలి. దీనివల్ల భారత ఆటోమొబైల్ రంగానికి దీర్ఘకాల ప్రయోజనాలు ఒనగూరుతాయి’’అని ఆర్థిక సర్వే సూచించింది. మరోవైపు పర్యావరణ అనుకూల ఇంధనాలకు మళ్లే విషయంలోనూ చైనా దిగుమతులపై అధికంగా ఆధారపడడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణలు సడలించడం ద్వారా దేశీ పరిశ్రమకు మద్దతుగా నిలవాలని సూచించింది. పీఎల్‌ఐ, ఫేమ్ పథకాలను ప్రస్తావిస్తూ.. భవిష్యత్తులో ఈవీల అవసరాలను తీర్చే విధానాలపై దృష్టి సారించాలని పేర్కొంది. వారానికి 60 గంటలు మించి పని.. ఆరోగ్యానికి హానికరం.. వారానికి 60 గంటలకు మించి పని చేస్తే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఎకనమిక్ సర్వే పేర్కొంది. ఆఫీస్ డెస్క్ ముందు గంటల తరబడి కూర్చోవడమనేది మానసిక ఆరోగ్యానికి హానికరమని వివరించింది. రోజూ 12 గంటలకు పైగా డెస్క్‌లోనే గడిపే వారు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఉద్యోగి ఉత్పాదకతకు ఆఫీసులో గడిపిన సమయమే కొలమానమని అభిప్రాయం నెలకొన్నప్పటికీ మెరుగైన జీవన విధానాలు, వర్క్‌ప్లేస్ సంస్కృతి, కుటుంబ సంబంధాలు మొదలైనవి కూడా ఉత్పాదకతకు కీలకమని సేపియన్ ల్యాబ్స్ సెంటర్ అధ్యయన నివేదికలో వెల్లడైనట్లు ఆర్థిక సర్వే వివరించింది. వారానికి 70–90 గంటలు పని చేయాలన్న ఇన్ఫీ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఎల్‌అండ్‌టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతున్న తరుణంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. మెరుగుపడిన విమాన కనెక్టివిటీ కొత్త విమానాశ్రయాలు, ఉడాన్ స్కీముతో దేశీయంగా ఎయిర్ కనెక్టివిటీ గణనీయంగా మెరుగుపడినట్లు ఆర్థిక సర్వే తెలిపింది. 2020–25 ఆర్థిక సంవత్సరాల మధ్య నిర్దేశించిన రూ. 91,000 కోట్ల పెట్టుబడి వ్యయాల లక్ష్యంలో ఎయిర్‌పోర్ట్ డెవలపర్లు, ఆపరేటర్లు దాదాపు 91 శాతాన్ని ఖర్చు చేసినట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారత్‌లో ఏవియేషన్ మార్కెట్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని, భారతీయ ఎయిర్‌లైన్స్ భారీ స్థాయిలో కొత్త విమానాలకు ఆర్డర్లిచ్చాయని సర్వే వివరించింది. మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (ఎంఆర్‌వో) పరిశ్రమకు సంబంధించి భారత్‌లో ప్లాంట్లను ఏర్పాటు చేయాలంటూ తయారీ కంపెనీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపింది. రియల్ ఎస్టేట్‌లో బలమైన డిమాండ్ ఆర్థిక స్థిరత్వం, రహదారులు, మెట్రో నెట్‌వర్క్‌ల కల్పన వంటివి దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో డిమాండ్‌ను పెంచినట్టు ఆర్థిక సర్వే నివేదిక వెల్లడించింది. రియల్ ఎస్టేట్ రంగ నియంత్రణ కోసం ‘రెరా’తోపాటు, జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడం ఈ రంగానికి మేలు చేసినట్టు తెలిపింది. 2036 నాటికి ఇళ్లకు డిమాండ్ 9.3 కోట్ల యూనిట్లకు చేరుకుంటుందన్న పలు నివేదికల అంచనాలను ప్రస్తావించింది. 2024 మొదటి ఆరు నెలల్లో ఇళ్ల అమ్మకాలు 11 ఏళ్ల గరిష్టానికి చేరుకోవడాన్ని గుర్తు చేసింది. రెరా రాకతో రియల్‌ఎస్టేట్ రంగంలో మోసాల నుంచి రక్షణ లభించిందని, పారదర్శకత, సకాలంలో ప్రాజెక్టుల పూర్తికి దారి చూపిందని వివరించింది. ఇళ్ల ప్లాన్లకు ఆన్‌లైన్ అనుమతులుతో జాప్యం తగ్గి, పారదర్శకత పెరిగినట్టు తెలిపింది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లకు(రీట్‌లు) ప్రోత్సాహం వాణిజ్య రియల్ ఎస్టేట్‌కు సానుకూలిస్తుందని అభిప్రాయపడింది. 11.6 బిలియన్ డాలర్లకు డేటా సెంటర్ మార్కెట్‌మౌలిక సదుపాయాల విస్తరణ, డిజిటల్ సేవలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా డేటా సెంటర్ మార్కెట్ 2032 నాటికి 11.6 బిలియన్ డాలర్ల స్థాయికి చేరవచ్చని ఎకనమిక్ సర్వే అంచనా వేసింది. 2023లో ఇది 4.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఐటీ, డిజిటల్ సేవల వ్యవస్థ పటిష్టంగా ఉండటం, రియల్ ఎస్టేట్ ధరలు తక్కువగా వల్ల డేటా సెంటర్ల ఏర్పాటు వ్యయాలు చౌకగా ఉండటం భారత్‌కు లాభిస్తుందని పేర్కొంది. డేటా సెంటర్ ఏర్పాటుకు ఆ్రస్టేలియాలో సగటున ప్రతి మెగావాట్‌కు వ్యయాలు 9.17 మిలియన్ డాలర్లుగా, అమెరికాలో 12.73 మిలియన్ డాలర్లుగా ఉండగా భారత్‌లో 6.8 మిలియన్ డాలర్లేనని సర్వే వివరించింది. జీసీసీల్లో ’గ్లోబల్’ ఉద్యోగాలుభారత్‌లో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) అంతర్జాతీయ కార్యకలాపాలకి సంబంధించి నియమించుకునే (గ్లోబల్) ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరగనుందని ఆర్థిక సర్వే తెలిపింది. 2030 నాటికి ఇది నాలుగు రెట్లు పెరిగి 30,000కు చేరుతుందని వివరించింది. ప్రస్తుతం ఈ సంఖ్య 6,500గా ఉంది. గత దశాబ్ద కాలంలో భారత్‌లో జీసీసీ వ్యవస్థ పురోగమించిందని, ప్రోడక్ట్ మేనేజర్లు, ఆర్కిటెక్టుల్లాంటి హై–ఎండ్ ఇంజినీరింగ్ ఉద్యోగాలను కూడా టెక్ నిపుణులు దక్కించుకుంటున్నారని సర్వే తెలిపింది. 2019లో 1,430గా ఉన్న జీసీసీల సంఖ్య 2024 నాటికి 1,700కు పెరిగిందని, వీటిల్లో దాదాపు 19 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని పేర్కొంది.ఏఐతో ఉద్యోగాలకు రిస్కే కృత్రిమ మేథతో (ఏఐ) ఎంట్రీ స్థాయి ఉద్యోగాలకు ముప్పు ఉంటుందని, ముఖ్యంగా జీవనోపాధి కోసం ఉద్యోగాల మీదే ఎక్కువగా ఆధారపడే భారత్‌లాంటి దేశాల్లో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని ఆర్థిక సర్వే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సరైన ప్రణాళికలు లేకుండా ఉద్యోగుల స్థానాన్ని ఏఐతో భర్తీ చేసేందుకు కంపెనీలు తొందరపడటం శ్రేయస్కరం కాదని ఐఎంఎఫ్ నివేదికను ఉటంకిస్తూ, సూచించింది. ఒకవేళ అలా చేసిన పక్షంలో ఉపాధి కోల్పోయిన వర్కర్లకు తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం స్వయంగా జోక్యం చేసుకుని, కార్పొరేట్ల లాభాలపై మరింతగా పన్నులు విధించడం, ఇతరత్రా పాలసీపరమైన చర్యలు తీసుకునే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని వివరించింది. ఎఫ్‌డీలకు అన్ని అడ్డంకులు తొలగాలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) భారత్ మరింతగా ఆకర్షించేందుకు వీలుగా అన్ని అవరోధాలను తొలగించాలని, పన్నుల పరమైన నిలకడను తీసుకురావాలని ఆర్థిక సర్వే సూచించింది. సమీప కాలంలో వడ్డీ రేట్లు, ద్రవ్యల్బోణ ఒత్తిళ్లు, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితులు ఉన్నా కానీ, దీర్ఘకాలానికి భారత్ ఎఫ్‌డీలకు అనుకూల కేంద్రంగా కొనసాగుతుందని అభిప్రాయపడింది. బలమైన దేశ ఆర్థిక మూలాలు, ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణాత్మక సంస్కరణలు, కన్జ్యూమర్ మార్కెట్ వృద్ధి సానుకూలతలుగా పేర్కొంది. ఇప్పటికే చాలా రంగాల్లో ఎఫ్‌డీలను ఆటోమేటిక్ మార్గంలో అనుమతిస్తున్నట్టు తెలిపింది. డిజిటల్ కనెక్టివిటీకి 5జీ దన్నుదేశవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో 5జీ సర్విసులను ప్రవేశపెట్టడంతో పాటు టెలికం మౌలిక సదుపాయాలను, యూజర్ అనుభూతిని మెరుగుపర్చేందుకు నియంత్రణ సంస్థ తీసుకుంటున్న చర్యలతో డిజిటల్ కనెక్టివిటీ మెరుగుపడినట్లు ఆర్థిక సర్వే తెలిపింది. ప్రస్తుతం 783 జిల్లాలకు గాను 779 జిల్లాల్లో 5జీ సేవలు అందుబాటులో ఉన్నట్లు వివరించింది. భారత్ నెట్ ప్రాజెక్టు కింద 2024 డిసెంబర్ నాటికి 6.92 లక్షల కి.మీ. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్‌సీ) వేసినట్లు పేర్కొంది.