ఆంధ్రప్రదేశ్ మినహా తాము మరేది కోరుకోవడం లేదని సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నాయకులు మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఉన్న అన్ని అవకాశాల్ని వాడుకుంటామని మంత్రి శైలజానాథ్ ప్రకటించారు. ఈ మేరకు మరోసారి చేసిన తీర్మానాన్నిఅధిష్టానానికి ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. శుక్రవారమిక్కడ సమావేశం అయిన సీమాంధ్ర ప్రాంత నేతలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మరోసారి తీర్మానం చేశారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ ఊహాగానాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాగా ఈ రోజు ఉదయం ఏపీ భవన్‌లో దాదాపు 2 గంటల సేపు సీమాంధ్ర నాయకుల సమావేశం జరిగింది. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో తొలిసారి కేంద్ర మంత్రులు పళ్లంరాజు, కావూరి సాంబశివరావు, జె.డి.శీలం, చిరంజీవి కూడా పాల్గొన్నారు. ఎంపీలు లగడపాటి, సాయిప్రతాప్, ఉండవల్లి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన రాష్ట్ర మంత్రులంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులుగా... అధిష్టానానికి దగ్గర ఉన్న కేంద్ర మంత్రులు సీమాంధ్ర ప్రాంత ప్రజలు, నాయకుల మనోభావాల్ని పార్టీ పెద్దలు, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తేవాలని ఈ సమావేశం విజ్ఞప్తి చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలపై మాట్లాడుతూ అది రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న వాళ్ల కమిట్‌మెంట్‌కు నిదర్శనమని శైలజానాథ్ అన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన కసరత్తు ఢిల్లీలో తారాస్థాయికి చేరినట్టు కనిపిస్తోంది. ఏపీ భవన్‌లో సీమాంధ్ర నాయకులు సమావేశం సాగుతుండగానే.... వార్ రూమ్‌లో కాంగ్రెస్ ఉన్నతస్థాయి నాయకులు భేటీ అయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్, ఆజాద్ పాల్గొన్న ఈ సమావేశానికి సీఎం కిరణ్, డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. ముగ్గురు నాయకులతో కాంగ్రెస్ అగ్రనేతలు వేర్వేరుగా మాట్లాడారు. సీఎం కిరణ్‌తో దాదాపు 45 నిమిషాలు, బొత్స సత్యనారాయణతో కూడా దాదాపు 45 నిమిషాలు చర్చలు జరిపారు.
Published Fri, Jul 26 2013 3:38 PM | Last Updated on Thu, Mar 21 2024 8:30 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement