దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఆలయంలో బాంబు పెట్టామని, అది పేలుతుందని గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేశారు. దాంతో భక్తులను అక్కడినుంచి ఖాళీ చేయించి బాంబు స్క్వాడ్ను పిలిపించి తనిఖీలు చేశారు. ఆకతాయి వ్యక్తి 7863656157 నెంబర్ నుంచి 100కు ఫోన్ చేసి బాంబు పెట్టినట్లు తెలిపాడు. తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఎటువంటి బాంబు దొరకపోవడంతో ఊపరి పీల్చుకున్నారు. తరచూ ఆకతాయిలు, పోలీసుల్ని ఆటపట్టించడానికి ఇటువంటి కాల్స్ చేస్తూ వారి సహనాన్ని పరీక్షిస్తున్నారు. అయితే ఇంతకుముందు పలుమార్లు ఈ ప్రాంతంలో బాంబు పేలుళ్లు జరగడం లేదా ఇక్కడ బాంబులను గుర్తించడం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 2002 సంవత్సరంలో తొలిసారిగా ఆలయం సమీపంలో బాంబు పేలుడు జరిగింది. 2007 సంవత్సరంలో బాంబు అమర్చారు గానీ, అది పేలకముందే ఓ పోలీసు కానిస్టేబుల్ దాన్ని గుర్తించడంతో ప్రమాదం తప్పింది. తాజాగా 2013 సంవత్సరంలో దిల్సుఖ్ నగర్ ప్రాంతంలోనే ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న ఎ-1 మిర్చి సెంటర్, వెంకటాద్రి థియేటర్ ఎదురుగా గల బస్ స్టాపు వద్ద కొద్దిపాటి తీవ్రతతో బాంబులు పేలాయి. మరోసారి ఇప్పుడు ఆలయానికి బాంబు బెదిరింపు రావడం గమనార్హం.