గోదావరి పుష్కరాల్లో చోటుచేసుకున్న దుర్ఘటన నేపథ్యంలో ఎవరిపై వేటువేస్తారనే అంశం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. 27 మంది ప్రాణాలు కోల్పోయిన ఘోర దుర్ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబుదే బాధ్యత అంటూ సామాన్య జనంతో పాటు ప్రతిపక్షం, మిత్రపక్షం అనే తేడా లేకుండా అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ విమర్శల నుంచి బయట పడేందుకు తమను బాధ్యులను చేసేందుకు పావులు కదుపుతున్నారని రెవెన్యూ, పోలీసు అధికారులే కాకుండా కొందరు మంత్రులూ భయపడుతున్నారని తెలుస్తోంది. బుధవారం రాజమండ్రిలో బసచేసిన ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, రఘునాథ్‌రెడ్డి, దేవినేని ఉమా, మృణాళిని మధ్య ఈ అంశం చర్చకు వచ్చిందని అత్యంత విశ్వసనీయ సమాచారం. పోలీసు, రెవెన్యూ శాఖల్లో ఉన్నతస్థాయిలో ఒకరిద్దరు, జిల్లాస్థాయిలో నలుగురైదుగురు అధికారులను, పరిస్థితులను బట్టి ఒకరిద్దరు మంత్రులను బాధ్యులను చేసే భారీ స్కెచ్ నడుస్తోంది. తనకు అనుకూలమైన పత్రికల్లో బాధ్యతంతా తమపై నెట్టేసేలా కథనాలు రాయించడం ఇందులో భాగమేనని అధికార వర్గాలు నొచ్చుకుంటున్నాయి. పుష్కర ఏర్పాట్లు ప్రారంభమైన దగ్గర నుంచి సీఎం తను నమ్మినబంటులైన మంత్రులు యనమల, నారాయణలకు పుష్కర కమిటీలో కీలక బాధ్యతలు అప్పగించారు. బీజేపీకి చెందిన దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావును సభ్యుడిగా తీసుకున్నా నామ్‌కే వాస్తేగా చేశారు. ఈ విషయాన్ని బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణే స్వయంగా చెప్పుకొచ్చారు. లోపాలన్నీ తమ దగ్గరే పెట్టుకొని పుష్కరాలు అట్టహాసంగా జరిగి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారనే ప్రచార ఆర్బాటం కోసం పుష్కరఘాట్‌లో జాతీయ, అంతర్జాతీయ ఇంగ్లిషు చానల్స్‌కు లఘుచిత్రాలు చిత్రీకరించేందుకు అనుమతించడం, కేవలం పుష్కరఘాట్‌కే భక్తులను తరలివచ్చేలా చేయడంతోనే ఈ దుర్ఘటన జరిగింది. తీరా ఇప్పుడు తప్పంతా తమదన్నట్టు వ్యవహరిస్తున్నారని అధికారులు మండిపడుతున్నారు.
Published Thu, Jul 16 2015 10:44 AM | Last Updated on Wed, Mar 20 2024 1:45 PM
Advertisement
Advertisement
Advertisement