ఏపీఎన్జీవోల సమ్మె కేసు విచారణ సెప్టెంబర్ 16వ తేదీకి వాయిదా పడింది. కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలోని పరిస్థితులను ప్రభుత్వం నియంత్రించలేకుంటే తామే చర్యలు తీసుకుంటామని హైకోర్టు తెలిపింది. గవర్నర్ ఇచ్చే నివేదిక ఆధారంగా నియంత్రణ చర్యలు చేపడుతామని ప్రకటించింది. జీఓ 177 ప్రకారం ఎన్జీఓలపై నో వర్క్-నో పే అమలు చేస్తున్నామని ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. రాష్ట్ర విభజన జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికార నోట్ లేదని హైకోర్టు చీఫ్ జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా వ్యాఖ్యానించారు. విభజన జరిగినా ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. ఉద్యోగుల ప్రాథమిక హక్కులను ఎవరూ హరించలేరన్న గుప్తా... తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేశారు. ఊహాజనితమైన అంశాలపై సమ్మె చేయటం తగదని అన్నారు. విజభన చేస్తున్నట్లు ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా అని ఏపీ ఎన్జీవోలను హైకోర్టు ప్రశ్నించింది.