కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా ? లేదా అన్నది రెండు రోజులలో స్పష్టత వస్తుందని అమలాపురం ఎంపీ జి.వి.హర్షకుమార్ వెల్లడించారు. కిరణ్తో మాదాపూర్లో ఆదివారం జరిగిన భేటీ అనంతరం హర్షకుమార్ విలేకర్లతో మాట్లాడారు. కొత్త పార్టీ ఏర్పాటుపై ఈ భేటీలో చర్చించినట్లు చెప్పారు. విభజన సమయంలో కొత్త పార్టీ రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని తాము కిరణ్ను కోరినట్లు వెల్లడించారు. ఇదే అంశంపై సోమవారం కూడా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కిరణ్ సమావేశమై చర్చించనున్నట్లు తెలిపారు. అనంతరం పార్టీ ఏర్పాటుపై కిరణ్ నిర్ణయం తీసుకుంటారని హర్షకుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి మరోసారి తాము కిరణ్తో సమావేశమయ్యే అవకాశం ఉందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తుది వరకు పోరాడామని హర్షకుమార్ వెల్లడించారు. రాష్ట్ర విభజనపై కేంద్రం అనుసరించిన వైఖరికి నిరసనగా కిరణ్ కుమార్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ విభజనను నిరసిస్తూ పలువురు సీమాంధ్ర ఎంపీలు యూపీఏ ప్రభుత్వం పై స్పీకర్ అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో సదరు ఎంపీలను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. అయితే కిరణ్ కొత్త పార్టీ పెడతారని గతం నుంచి ఊహాగానాలు ఊపందుకున్నాయి. అందులోభాగంగా ఆదివారం ఉదయం కిరణ్ తనకు అత్యంత సన్నిహితుని నివాసంలో కొత్త పార్టీపై బహిష్కృత ఎంపీలతో సమావేశమై చర్చించారు. ఉండవల్లి అరుణ్ కుమార్, సబ్బం హరి, లగడపాటి రాజగోపాల్, సాయి ప్రతాప్, రాయపాటి తదితరులు కిరణ్తో భేటీ అయిన వారిలో ఉన్నారు.
Published Sun, Feb 23 2014 3:42 PM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement