హైదరాబాద్ శాంతిభద్రతలు గవర్నర్ చేతిలో? | Law and order of hyderabad to be in the hands of governor | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 8 2013 7:03 AM | Last Updated on Thu, Mar 21 2024 6:35 PM

విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండే సమయంలో హైదరాబాద్ శాంతిభద్రతల పర్యవేక్షణ బాధ్యతను గవర్నర్‌కు అప్పగించాలని కేంద్ర హోంశాఖ ప్రతిపాదించిందా? అంతేగాక నగరానికి సంబంధించిన భూ వ్యవహారాలు, మున్సిపల్ పరిపాలన, ఉన్నత విద్య విభాగాలను కూడా ఆ పదేళ్ల పాటు గవర్నర్ చేతిలోనే ఉంచాలని సూచించిందా? విభజన విధి విధానాలపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందానికి సమర్పించిన నివేదికలో హోం శాఖ ఈ మేరకు పేర్కొన్నట్టు హస్తిన రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే నేతృత్వంలో జీవోఎం గురువారం ఢిల్లీలో మూడోసారి సమావేశమైంది. శాంతిభద్రతలు, పోలీసు విభాగం విభజన తదితర అంశాలపై ఐపీఎస్ అధికారి విజయ్‌కుమార్ నేతృత్వంలో ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ ఇచ్చిన నివేదికతో పాటు పలు శాఖల నుంచి అందిన నివేదికలను జీవోఎం పరిశీలించినట్టు తెలుస్తోంది. కేంద్ర హోం శాఖ రూపొందించిన నివేదికను ప్రధానంగా సమీక్షించినట్టుచెబుతున్నారు. అధికార వర్గాల సమాచారం మేరకు.. టాస్క్‌ఫోర్స్ తన నివేదికలో పేర్కొన్న పలు సూచనలు, సిఫార్సులను హోం శాఖ యథాతథంగా తన నివేదికలో చేర్చింది. ప్రధానంగా హైదరాబాద్‌లో సీమాంధ్రుల భద్రత, వారి ప్రయోజనాల పరిరక్షణ మీదే శాఖ దృష్టి సారించిందని, అంతేగాక రాజధానిలోని సీమాంధ్ర పోలీస్ అధికారులను విభజన తర్వాత కూడా కొనసాగించాలని సూచించిందని అంటున్నారు. ‘‘పోలీసు, ఇంటలిజెన్స్ వ్యవస్థలను విభజన తర్వాత కూడా కొంతకాలం పాటు విభజించకుండా ఉమ్మడిగా వినియోగించుకోవాలి. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న సీమాంధ్ర ఉద్యోగుల లెక్కలు తీశామని, తర్వాత వారి సంగతి తేలుస్తామని ఒక ప్రాంతం నేతలు చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు హైదరాబాద్‌లోని సీమాంధ్రుల్లో ఆందోళన రేకెత్తించాయి. బెదిరింపుల నేపథ్యంలో తక్కువ ధరలకే ఆస్తులమ్ముకుని వెళ్లిపోవాల్సి వస్తుందేమోనని వారిలో ఆందోళన నెలకొని ఉంది. వారికి అన్ని విధాలా అండగా నిలుస్తామనే భరోసా ఇవ్వాలి. హైదరాబాద్‌తో పాటు ఇతర తెలంగాణ జిల్లాల్లోని సీమాంధ్ర ఉద్యోగులు అక్కడే కొనసాగే అవకాశం కల్పించాలి. ప్రత్యేకించి సచివాలయం, తెలంగాణ జిల్లాల్లో వారిని సర్వీసు పూర్తయ్యేదాకా కొనసాగనివ్వాలి. సీమాంధ్రలోని తెలంగాణ ఉద్యోగులకూ ఇదే మాదిరి అవకాశమివ్వాలి. తెలంగాణలోని ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న సీమాంధ్రులను బలవంతంగా పంపించే చర్యలను నిరోధించడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్రధానమైన విద్య, వైద్య సంస్థలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నందున పదేళ్ల దాకా వాటిలో సీమాంధ్ర విద్యార్థులను స్థానికులుగానే పరిగణించాలి. సినీ తదితర రంగాల ప్రముఖులు ఏ రాష్ట్రంలో ఉన్నా వారి భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. కృష్ణా జలాలను రాయలసీమకు నిరాకరిస్తే అక్కడి ప్రాజెక్టులకు నీళ్లందే అవకాశం లేదు. కాబట్టి ప్రస్తుతమున్న ఆయకట్టు పరిరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు అవసరం’’ అని హోం శాఖ నివేదికలో పేర్కొన్నట్టు చెబుతున్నారు. అయితే అధికార వర్గాలు మాత్రం వీటిని ధ్రువీకరించడం లేదు. కాకపోతే హైదరాబాద్‌పై తీసుకునే నిర్ణయాన్ని బిల్లులో పొందుపరుస్తామని జీవోఎం భేటీకి ముందు విలేకరులతో పిచ్చాపాటి సందర్భంగా షిండే వెల్లడించారు! నెలాఖరులోపు జీవోఎం పని పూర్తి చేస్తుందన్న ఆయన, సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ అంశాన్ని జీవోఎంలో చర్చిస్తామని కూడా వివరించారు. బిల్లును సరైన సమయంలో రాష్ట్ర అసెంబ్లీకి పంపేలా చూస్తామన్నారు. కాకపోతే హైదరాబాద్ శాంతిభద్రతలు తదితరాలను గవర్నర్ చేతిలో ఉంచడం వంటి కీలకాంశాలపై పై మాత్రం భేటీకి ముందు, అనంతరం మీడియాతో మాట్లాడిన రెండుసార్లూ షిండే ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. ఇక వరుస భేటీలు... రాష్ట్ర విభజన ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జీవోఎం నిర్ణయించింది. అందులో భాగంగా నవంబర్ 11న కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో, 18న రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతో సమావేశమవుతుంది. నవంబర్ 12, 13 తేదీల్లో రాష్ట్రంలోని 8 గుర్తింపు పొందిన పార్టీలతో జీవోఎం విడి విడిగా భేటీ అవుతుంది. భేటీ అనంతరం మీడియాకు షిండే ఈ మేరకు వెల్లడించారు. ‘‘8 పార్టీలకు 12, 13 తేదీల్లో సమయమిచ్చాం. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు నాయకులు రావచ్చు. ఒక్కరు వస్తే మంచిది. ఇద్దరికీ కలిపి 20 నిమిషాలు కేటాయించాం. 18న రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతో భేటీ అవుతాం’’ అని వివరించారు. జీవోఎంకు 18 వేల వినతులు, సూచనలు, సలహాలతో పాటు పలు శాఖల నుంచి నివేదికలు కూడా అందాయన్నారు. గంటంపావు పాటు జరిగిన జీవోఎం భేటీలో మంత్రులు చిదంబరం, వీరప్ప మొయిలీ, జైరాం రమేశ్, నారాయణసామి పాల్గొన్నారు. విదేశీ పర్యటన వల్ల గులాంనబీ ఆజాద్, అనారోగ్య కారణాలతో ఎ.కె.ఆంటోనీ రాలేకపోయారు. ఇప్పటికే అన్ని ప్రధాన శాఖలనుంచి గణాంకాలతో కూడిన నివేదికలు తెప్పించుకున్న జీవోఎం... అధికారులు, పార్టీలు, మంత్రులతో భేటీల అనంతరం మరో రెండుమార్లు సమావేశమై నవంబర్ మూడు లేదా నాలుగో వారంలో పని ముగించే అవకాశం కనిపిస్తోంది. తమకందిన సూచనలను అంశాలు, శాఖలవారీగా విభజించి, క్రోడీకరించేలా మంత్రిత్వ శాఖల కార్యదర్శులకు జీవోఎం అప్పగించింది. టాస్క్‌ఫోర్స్ కమిటీ రూపొందించిన 29 పేజీల నివేదికను జీవోఎం ముందు షిండే ఉంచారు. విభజనతో తలెత్తే సమస్యల పరిష్కారానికి మార్గాలు, ఆస్తులు-అప్పుల పంపకాలు, జల వనరులు, విద్యుత్ పంపిణీ లెక్కలు, ఉద్యోగుల సమస్యలు, 371-డి అధికరణం తదితరాలపై వివరణాత్మక నివేదికలు తీసుకోవడంతో పాటు తమకందిన వినతిపత్రాల్లో సంధించిన ప్రశ్నలు, వ్యక్తం చేసిన అనుమానాలకు సమాధానాలు రూపొందించాలని కేంద్ర శాఖల కార్యదర్శులకు సూచించాలని నిర్ణయించారు. అపవాదు భయంతోనే అన్ని పార్టీలకూ పిలుపు! విభజనను వ్యతిరేకిస్తున్న వైఎస్సార్‌సీపీ, సీపీఎం పార్టీలు జీవోఎంను బహిష్కరించాలని నిర్ణయించడం, టీడీపీ గోడ మీద పిల్లి తరహాలో ఎటూ తేల్చకపోవడం, మిగతా 5 పార్టీలు తమ విధానానికి అనుగుణంగా స్పందించి జీవోఎంకు నివేదికలివ్వడం తెలిసిందే. దాంతో ఆ ఐదు పార్టీలతోనే భేటీ కావాలని జీవోఎం తొలుత భావించింది. అయితే విభజన ప్రక్రియలో కొన్ని పార్టీలను విస్మరించి ముందుకెళ్లారనే అపవాదు రాకుండా ఉండేందుకు అన్ని పార్టీలనూ పిలవాలని నిర్ణయించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement