రేపటి నుంచే నామినేషన్లు | nominations in telangana from 2nd april | Sakshi
Sakshi News home page

Published Tue, Apr 1 2014 7:40 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

రాష్ట్రంలో లోక్సభ, శాసనసభ ఎన్నికలకు సంబంధించి తొలిదశ నోటిఫికేషన్‌ రేపు ఉదయం 10 గంటలకు వెలువడుతుందని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్‌లాల్ చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగే చివరి ఎన్నికలు ఇవి. రెండు దశలలో ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. తొలి దశలో తెలంగాణలో, రెండవ దశలో సీమాంధ్రలో ఎన్నికలు నిర్వహిస్తారు. రేపటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందన్నారు. ఉదయం 10 నుంచి 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. తెలంగాణలోని ఏజెన్సీ పరిధిలో ఉన్న 11 శాసనసభ నియోజకవర్గాలలో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని తెలిపారు. సిర్పూర్‌, అసిఫాబాద్‌, ఖానాపూర్‌, చెన్నూర్‌, మంథని, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్‌, ములుగు, భద్రాచలం, బెల్లంపల్లి నియోజకవర్గాలలో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకే పోలింగ్‌ నిర్వహిస్తారు. మిగిలిన 108 స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. నామినేషన్ల సెక్యూరిటీ డిపాజిట్‌ 10 వేల రూపాయలని, ఎస్సీ, ఎస్టీలకు 5వేల రూపాయలని ఆయన వివరించారు. రాష్ట్రంలో ఓటర్లు 6 కోట్ల 41 లక్షలకు చేరినట్లు తెలిపారు. వారిలో 3 కోట్ల 22లక్షల 3వేల మంది పురుషులు, 3 కోట్ల 18 లక్షల 50 వేల మంది మహిళలని చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో పోలీసులు నిర్వహించిన తనిఖీలలో 77.50 కోట్ల రూపాయల నగదు, 69.50 కిలోల బంగారం, 288 కిలోల వెండి, 1.85 లక్షల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు భన్వర్‌లాల్‌ వివరించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement