అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ నెల 25 నుంచి 27 వరకు భారత్లో పర్యటించనున్నారు. భారత గణతంత్ర వేడుకలకు ఒబామా ముఖ్యఅతిథిగా హాజరవుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో జరిగే సీఈఓల సమావేశంలో ఓబామా పాల్గొంటారు. ఈ పర్యటనలో ఆయన ఆగ్రాలోని తాజ్మహల్ను కూడా సందర్శిస్తారు. ఒబామా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణ రంగ ఒప్పందాలు, పౌర అణు ఇంధన ఒప్పందంపై పురోగతి సాధించేందుకు కృషి జరుగుతుందని నిన్న గాంధీనగర్లో అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీ చెప్పారు. గణతంత్ర వేడుకలకు ఒబామా ముఖ్యఅతిథిగా హాజరవుతున్నందున నగర పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా విధుల్లో అమెరికా ఏజెన్సీలు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు, సైన్యం, పారామిలిటరీ బలగాలతోపాటు ఇరుగుపొరుగు రాష్ట్రాలకు చెందిన పోలీసు బలగాలు కూడా పాలుపంచుకుంటున్నట్లు పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. ఉగ్రవాదులు ఏక్షణంలోనైనా దాడికి పాల్పడే అవకాశముందనే గూఢచార విభాగం హెచ్చరికల నేపథ్యంలో పోలీసు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్సు టెర్మినళ్లు, మెట్రో రైల్వేస్టేషన్లు, మాల్స్ వంటి కీలక ప్రదేశాలలో ప్రత్యేక బృందాలు మోహరిస్తాయి. అమెరికా అధ్యక్షుడి హోదాలో రెండో పర్యాయం భారత పర్యటనకు వస్తున్న తొలి అధ్యక్షుడు ఒబామాయే కావటం విశేషం.
Published Wed, Jan 14 2015 7:43 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
Advertisement