‘నన్నే మీ బిడ్డనుకోండి. మీకెప్పుడూ అందుబాటులోనే ఉంటా. ఏ కష్టమొచ్చినా వెంటనే స్పందించి సాయమందిస్తా'నని జనసేన అధినేత, సినీహీరో పవన్ కల్యాణ్ తిరుపతిలోని వినోద్ రాయల్ తల్లిదండ్రులకు భరోసా నిచ్చారు. రాయల్ హత్యోదంతంలో నేరస్థులైన వారికి చట్టప్రకారం శిక్ష పడేలా ప్రభుత్వాన్ని కోరతానన్నారు. భవిష్యత్తులో సంఘటన పునరావృతం కాకుండా అభిమానులకు సూచిస్తానని చెప్పారు. గురువారం ఉదయం 11 గంటలకు తిరుపతి వచ్చిన పవన్ కల్యాణ్ ఎస్టీవీ నగర్‌లోని వినోద్ రాయల్ ఇంటికి వెళ్లి ఆయన తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ నెల 21న కోలారులో హత్యకు గురైన తన కుమారుడు వినోద్ రాయల్ గురించి ఆయన తల్లిదండ్రులు వేదవతి, వెంకటేశ్‌లు పవన్ కల్యాణ్‌కు సవివరంగా వివరించారు. చెట్టంత కొడుకును దూరం చేసుకుని కుంగిపోతున్నామనీ, కొడుకు చంపిన నేరస్థులకు శిక్ష పడేలా చూడాలని వేదవతి కోరింది. ఈ సందర్భంగా పవన్ అభిమాన సంఘ నాయకునిగా తన కుమారుడు వినోద్ చేసిన సేవా కార్యక్రమాలు, అవయువ దాన శిబిరాలను, కోలారులో చివరిసారిగా ప్రసంగించిన వీడియో విజువల్స్‌ను వేదవతి పవన్ కల్యాణ్‌కు చూపించి భోరున విలపించింది. వినోద్ రాయల్ సోదరి వినీత, సోదరుడు రాజాలతో పాటు కుటుంబ సభ్యులందర్నీ పలకరించిన పవన్ కల్యాణ్ గంటసేపు విషణ్ణవదనంతో కూర్చుండిపోయారు. నేరస్థులకు తప్పకుండా శిక్ష పడుతుందనీ, అభిమానులు క్షణికావేశంలో ఈ తరహా ఘాతుకాలకు పాల్పడటం మంచిది కాదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆయన వెంట జనసేన నాయకులు మారిశెట్టి రాఘవయ్య, టీటీడీ బోర్డు సభ్యుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, పవన్ కల్యాణ్ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు కిరణ్‌రాయల్, అనీఫ్, రియాజ్, లోకేష్, శంకర్‌గౌడ్‌లు ఉన్నారు. అనంతరం పవన్ శ్రీవారి దర్శనం కోసం తిరుమల కొండకు వెళ్లారు.
Published Thu, Aug 25 2016 8:20 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
Advertisement