తెలంగాణకు హైదరాబాద్ ఎలాగో.. ఆంధ్రప్రదేశ్కు పోలవరం అలాంటిదని జైరాం రమేష్ చెప్పారు. రాజ్యసభలో పోలవరం బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టు అని, 7 లక్షల ఎకరాలు సాగవుతాయని, 960 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని, 80 టీఎంసీల నీరు కృష్ణా బేసిన్కు వెళ్లడం వల్ల తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా దానివల్ల ఉపయోగమేనని ఆయన తెలిపారు. దాని సాంకేతిక డిజైన్ను కేంద్ర జలసంఘం ఆమోదించిందని అన్నారు. దీనికి 16వేల కోట్ల నిధులు ఖర్చవుతాయని, ఇందులో ఇప్పటికి దాదాపు 30 శాతం పూర్తయిందని వివరించారు. తాను మూడుసార్లు స్వయంగా మూడుసార్లు పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లానని అన్నారు. ప్రాజెక్టు వల్ల చాలా ఉపయోగాలున్నా, దానివల్ల చాలా కుటుంబాలను తరలించాల్సి ఉంటుందని, ఖమ్మం జిల్లాలో వందలాది గ్రామాలు మునిగిపోతాయి కాబట్టి సుమారు 45 వేల కుటుంబాలను తరలించాల్సి ఉంటుందని తెలిపారు. ఖమ్మం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఈ కుటుంబాలు ఉన్నాయన్నారు. ఈ సమయంలో వీహెచ్ మళ్లీ లేచి ఏదో మాట్లాడుతుండగా.. మీ సొంత పార్టీ సభ్యుడే మాట్లాడుతున్నారని, ఇలా చేయొద్దని కురియన్ ఆవేశంగా హెచ్చరించారు. ఒడిషా, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాల అభ్యంతరాలను పరిష్కరించేవరకు ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చేది లేదంటూ తాను స్వయంగా అడ్డుపడ్డానని, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాతే అనుమతులు వచ్చాయని అన్నారు. ఒడిసా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజాభిప్రాయం సేకరించాలని కోరుతున్నా, అందుకు ఇంతవరకు అనుమతులు ఇవ్వలేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 600 కోట్ల రూపాయలను ఆ రెండు రాష్ట్రాలకు ఖర్చుపెడతామని చెప్పిందని గుర్తుచేశారు. ప్రాజెక్టు నిర్మాణం చేపడితే కొన్ని ప్రాంతాల ప్రజలను తప్పనిసరిగా అక్కడినుంచి తరలించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో ఉన్న కొన్ని గ్రామాలు తొలుత తూర్పుగోదావరి జిల్లా పరిధిలోనే ఉండేవని, ప్రాజెక్టు ఒక రాష్ట్రంలోను, ప్రజలను వేరే రాష్ట్రంలోను తరలించాల్సి రావడం అసాధ్యమని, అవన్నీ ఒక రాష్ట్రంలో ఉండటమే న్యాయమని జైరాం రమేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పంపిన బిల్లులో్ ప్రాజెక్టు కట్టాలనే చెప్పాం తప్ప గ్రామాల బదిలీ గురించి చెప్పలేదన్నారు. తర్వాత షిండే అధ్యక్షతన నిర్వహించిన జీవోఎం సమావేశంలో వచ్చిన సూచనల మేరకు ఏడు మండలాలను ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయాలని జీవోఎం నిర్ణయించిందన్నారు. దీనికి తెలంగాణ ప్రాంత ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారని, భద్రాచలం రామాలయానికి వెళ్లే దారి ఆంధ్రలోను, భద్రాచలం తెలంగాణలోను ఉంటే కష్టమని చెప్పడంతో మరోసారి జీవోఎం సమావేశమై.. కేవలం ముంపు ప్రాంతాలను మాత్రమే ఆంధ్రప్రదేశ్కు తరలించాలని నిర్ణయించిందన్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 18న లోక్సభకు, 20న రాజ్యసభకు బిల్లు వచ్చిందన్నారు. దానిపై ప్రధానమంత్రి కూడా ఒక ప్రకటన చేశారన్నారు. పోలవరం ప్రాజెక్టు అమలు కోసం బిల్లుకు ఎలాంటి సవరణలు కావాలన్నా చేయొచ్చని ఆయన చెప్పారన్నారు. ప్రాజెక్టును కేంద్రమే చేపడుతుందని, అందులో ఎలాంటి అనుమానం లేదని తెలిపారన్నారు. ఏడు మండలాలు తరలించాలన్న మొదటి సూచనను తెలంగాణ ప్రతినిధులు, ముంపు గ్రామాలను మాత్రమే తరలించాలన్న రెండో సూచనను ఆంధ్రా ప్రతినిధులు వ్యతిరేకించడంతో కేంద్ర కేబినెట్ సమావేశమై.. ఆరు మండలాలను పూర్తిగాను, భద్రాచలం మండలాన్ని పాక్షికంగాను తరలించాలన్న మూడో సూచన చేసిందన్నారు. అయితే అప్పటికి ఎన్నికల కోడ్ రావడంతో.. తర్వాత ప్రభుత్వానికి దీన్ని వదిలిపెట్టామని జైరాం రమేష్ తెలిపారు.
Published Mon, Jul 14 2014 3:25 PM | Last Updated on Thu, Mar 21 2024 5:48 PM
Advertisement
Advertisement
Advertisement