ప్రజా ప్రయోజనాల ముసుగులో రాజధాని ప్రాంతంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల రైతుల భూములను లాక్కోడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదకర ఆర్డినెన్స్ తీసుకు రావడానికి రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం ఏకంగా కేంద్ర భూసేకరణ చట్టం – 2013కు సవరణలు చేయాలని నిర్ణయించింది. భూ సేకరణకు చట్టం ఉండగా, అర్డినెన్స్ తీసుకు రావడం అనేది విరుద్ధమని తెలిసినా.. ఈ చట్ట స్ఫూర్తిని దెబ్బ తీస్తూ.. ప్రాజెక్టులు, రహదారుల సాకుతో చట్ట సవరణకు పూనుకుంది. అసెంబ్లీ ఆమోదంతో చట్ట సవరణ చేస్తే ఇందులో లోగుట్టు రట్టు అవుతుందని, ప్రభుత్వ పెద్దల నిర్వాకాన్ని ప్రతిపక్షం నిగ్గదీస్తుందనే భయంతో తెరచాటున చట్ట సవరణకు ఆగమేఘాలపై అడుగులు వేస్తోంది.