ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా అంశంపై ఆనాడు రాజ్యసభలో మాట్లాడిన బీజేపీ.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు వెనక్కు తగ్గుందని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో సోమవారం జంతర్ మంతర్ వద్ద వైఎస్సార్ సీపీ ధర్నా చేపట్టింది. దీనిలో భాగంగా ఏఎన్ఐతో మాట్లాడిన వైఎస్ జగన్.. ఆనాడు ఏపీకి 10 ఏళ్ల ప్రత్యేక హోదా కావాలని రాజ్యసభలో వ్యాఖ్యానించిన వెంకయ్య నాయుడు.. నేడు ఎందుకు ప్రత్యేక హోదా అంశం చట్టంలో లేదని అనడానికి కారణం ఏమిటని జగన్ ప్రశ్నించారు. ఈ విషయంపై నాటి పెద్దల సభలో అరుణ్ జైట్లీ కూడా మాట్లాడిన సంగతిని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి బీజేపీతో పాటు, కాంగ్రెస్, టీడీపీలు కూడా ప్రధాన కారణమని జగన్ మండిపడ్డారు.