పవన్ ఏం చెప్తున్నారో ప్రజల్ని అడగాలి: వైఎస్ జగన్ | ys-jagan-mohan-reddy-chitchat-with-journalists | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 7 2015 1:07 PM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM

గవర్నర్ నరసింహన్ ప్రసంగం అంతా అర్థసత్యాలు, పూర్తి అబద్ధాలతో నిండి ఉందని శాసనసభా ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం అనంతరం వైఎస్ జగన్ మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారన్నది అర్థసత్యమో లేక అబద్దమో చెప్పాలన్నారు. రాజధాని భూముల్లో 3 నుంచి 4 పంటలు పండుతున్నాయన్నారు. రాజధాని ప్రాంతంలోని పిల్లలు కార్పొరేట్ పాఠశాలల్లో చదవుతున్నారని చెప్పారు. మంత్రి నారాయణ తన కాలేజీల్లో ఫీజులు కట్టడం ఒకరోజు ఆలస్యమైతే పిల్లల తల్లిదండ్రులకు పాతికసార్లు ఫోన్ చేసి అడుగుతున్నారని వెల్లడించారు. అధర్మం ఎప్పుడూ ఓడిపోతుందన్నారు. మానవత్వంతో తమ పార్టీ రాజధాని రైతులకు అండగా నిలిచిందని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారో ప్రజల్ని అడగాలన్నారు. పవన్ మొన్న ఏం చెప్పారు, నిన్న ఏం చెప్పారు. రేపు ఏంచెప్తారో తెలియదని వ్యంగ్యంగా అన్నారు. రూ. 20 వేల కోట్లకుపైగా నిధులకు సంబంధించిన జీవో 22 గురించి ఎవరూ మాట్లాడడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నర్ అబయెన్స్ లో పెట్టిన వివాదస్పద జీవోను అమలు చేయడం అవినీతి కాదా అని జగన్ ప్రశ్నించారు. పట్టిసీమకు 22 శాతం ఎక్సెస్ టెండర్లు కాంట్రాక్టర్లకు ఇవ్వడం అవినీతి కాదా అని అడిగారు. బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రం నిరాశపరిస్తే... సీఎం చంద్రబాబు తన మంత్రులను కేంద్ర కేబినెట్ లో ఎందుకు కొనసాగిస్తున్నారన్నారు. బీజేపీకి చెందిన వారిని రాష్ట్ర మంత్రివర్గంలో ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. ఈ సన్నాయి నొక్కులు, డ్రామాలు ఎవర్ని మోసం చేయడానికి సూటిగా ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement